కమల్ మరిచిపోయినా అమితాబ్ గుర్తు చేశారు

కల్కి బ్లాక్ బస్టర్ హిట్టయినందుకు థ్యాంక్స్ చెబుతూ విడుదల చేసిన వీడియోలో ప్రభాస్ పేరును ప్రస్తావించడం మరిచిపోయారు కమల్ హాసన్. పైపెచ్చు సినిమాకు ఎన్ని కోట్లు వసూళ్లు వచ్చాయనేది ముఖ్యం కాదని, అదిచ్చిన తృప్తి…

కల్కి బ్లాక్ బస్టర్ హిట్టయినందుకు థ్యాంక్స్ చెబుతూ విడుదల చేసిన వీడియోలో ప్రభాస్ పేరును ప్రస్తావించడం మరిచిపోయారు కమల్ హాసన్. పైపెచ్చు సినిమాకు ఎన్ని కోట్లు వసూళ్లు వచ్చాయనేది ముఖ్యం కాదని, అదిచ్చిన తృప్తి చాలా ముఖ్యమంటూ కామెంట్ చేశారు. ప్రభాస్ లేకుండా వేల కోట్ల కలెక్షన్లు సాధ్యమా.. అంత వసూళ్లు రాకపోతే ఇంత తృప్తి కలుగుతుందా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

అయితే కమల్ హాసన్ మరిచిపోయిన విషయాన్ని అమితాబ్ బచ్చన్ మాత్రం మరిచిపోలేదు. ఈరోజు బిగ్ బి నుంచి వీడియో రిలీజైంది. సినిమాను సూపర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూనే, నిర్మాత-దర్శకుడ్ని మెచ్చుకున్నారు అమితాబ్. సినిమా సక్సెస్ లో ప్రతి ఒక్కరికి భాగం ఉందని చెబుతూనే.. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయని పరోక్షంగా వెల్లడించారు.

“ప్రభాస్ కు వెయ్యి కోట్ల వసూళ్లు కొత్త కాదు. అతడి గత చిత్రాలు కొన్ని ఈ ఘనత సాధించాయి. నాకు మాత్రం కల్కి లాంటి అతిపెద్ద కాన్సెప్ట్ లో భాగమైనందుకు చాలా ఆనందంగా గౌరవంగా ఉంది. నేను ఆల్రెడీ సినిమాను 4 సార్లు చూశాను. ప్రతిసారి నాకు ఏదో ఒకటి కొత్తగా కనిపించింది.”

కల్కి తనకు కేవలం ఒక సినిమాలా అనిపించలేదని, ఈ ప్రాసెస్ మొత్తం తనకు ఓ పెద్ద ఎడ్యుకేషన్ లా అనిపించిందని చెప్పుకొచ్చారు. కల్కి పార్ట్-2 కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ప్రకటించారు బిగ్ బి.