ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సమర్థతకు సొంత పార్టీకి చెందిన కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ అగ్ని పరీక్ష పెట్టారు. పర్యావరణ పరిరక్షణ జనసేన ఆశయాల్లో ప్రధానమైంది. అందుకే ఏరికోరి మరీ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖతో పాటు పర్యావరణ శాఖను కూడా తీసుకున్న పదేపదే చెబుతున్న పవన్‌కల్యాణ్‌కు బొలిశెట్టి నుంచి సవాల్ ఎదురు కావడం చర్చనీయాంశమైంది. బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్ వేదికగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యావరణ సంపదైన ఎర్రమట్టి దిబ్బలను కొల్లగొట్టడంపై పోస్టు పెట్టారు. అదేంటంటే…
“ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు, అది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు అవి దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్య భాగం. ఇవి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి విశాఖ -భీమిలి మధ్య, రెండవది తమిళనాడులోని పేరి వద్ద. అటువంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై నిన్నటి నుండి యథేచ్ఛగా దాడి జరుగుతోందని నాకు సమాచారం వచ్చింది. అధికారులు తక్షణమే స్పందించాలి. దీనిని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పర్యావరణ శాఖా మంత్రి పవన్‌కల్యాణ్‌కు తెలియజేస్తున్నా”
ఈ పోస్టుతో పాటు ఎర్రమట్టి దిబ్బల్ని కొల్లగొడుతున్నారనేందుకు సాక్ష్యంగా వీడియోను, అలాగే ఎర్రమట్టి దిబ్బల విశిష్టతను తెలియజేసే సమాచారాన్ని కూడా ఆయన షేర్ చేయడం విశేషం. బొలిశెట్టి షేర్ చేసిన దాంట్లో.. ఎర్రమట్టి దిబ్బలు విశాఖ-భీముని పట్నం మధ్యలో 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించాయి.
దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ఇవి కూడా ఒకటి. రెండోది తమిళనాడులోని పేరి వద్ద ఉన్నా అవి జనావాసానికి దూరంగా ఉండడం వల్ల అందుబాటులో లేక అంతగా ఆదరణకు నోచుకోవడం లేదు. మూడోది శ్రీలంకలో ఉన్నాయి. ఇక్కడ సినిమాలు చిత్రీకరిస్తుంటారు.
ఎర్రమట్టి దిబ్బల్ని కొల్లగొట్టడానికి అధికార అండ వుంటే తప్ప సాధ్యం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దోపిడీ వెనుక ఏ రాజకీయ పార్టీ వుంటుందో జగమెరిగిన సత్యమే. అయితే వారసత్వ సంపదను కొల్లగొడుతుండడాన్ని తమ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి అయిన పవన్ దృష్టికి బొలిశెట్టి తీసుకెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. పర్యాటక శాఖ మంత్రి కూడా అయిన పవన్ వెంటనే స్పందించి వారసత్వ సంపదను కాపాడితే ప్రశంసలు అందుకుంటారు.
భాగస్వామ్య పక్షానికి చెందిన దోపిడీదారుల్ని అడ్డుకోలేకపోతే మాత్రం పవన్ అభాసుపాలు కావడం ఖాయం. ఎందుకంటే ఎర్రమట్టి దిబ్బలను కొల్లగొడుతున్న వైనాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లింది… ఆయన పార్టీకి చెందిన ముఖ్య నాయకుడే కాబట్టి.