తమ్ముళ్ళ కంటే ఎక్కువగా బీజేపీ ఎమ్మెల్యే!

తమ్ముళ్ళు సాధారణంగా ఆవేశపడతారు. వారి మీదనే అయిదేళ్ల వైసీపీ పాలనలో వేధింపులు ఎక్కువగా జరిగాయి. దాంతో రివెంజ్ పాలిటిక్స్ ఇటు నుంచే ఉంటుంది. అది కొన్ని చోట్ల స్టార్ట్ అయింది కూడా. అయితే విశాఖలో…

తమ్ముళ్ళు సాధారణంగా ఆవేశపడతారు. వారి మీదనే అయిదేళ్ల వైసీపీ పాలనలో వేధింపులు ఎక్కువగా జరిగాయి. దాంతో రివెంజ్ పాలిటిక్స్ ఇటు నుంచే ఉంటుంది. అది కొన్ని చోట్ల స్టార్ట్ అయింది కూడా. అయితే విశాఖలో చూస్తే తెలుగు తమ్ముళ్ల కంటే బీజేపీ ఎమ్మెల్యే ఎక్కువగా ఆవేశపడి పోతున్నారు.

విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే వైసీపీకి కచ్చితంగా రిటర్న్ గిఫ్త్ ఇచ్చి తీరాల్సిందే అని పట్టుపడుతున్నారు. ఎవరినీ వదిలిపెట్టే సమస్యే లేదని అందరి సంగతి తేలుస్తామని కూడా గర్జిస్తున్నారు. ఇంతకీ ఆయనకు కోపం ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు 2020 ప్రాంతంలో విశాఖ వచ్చినపుడు ఆనాడు విశాఖ ఎయిర్ పోరులో ఆయన మీద చెప్పులు విసిరారు అని వైసీపీ నేతలను ఉద్దేశించి ఆరోపిస్తున్నారు.

వారి మీద ఇపుడు ఏ చర్యలు తీసుకున్నారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. హోం మంత్రి దీని మీద ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నారా లోకేష్ రెడ్ బుక్ ఏమైంది అని నిలదీస్తున్నారు. దేవుడే చూసుకుంటారు అని వదిలేస్తే కుదరదు బతికి ఉన్నప్పుడే తప్పు చేసిన వారి అంతు చూడాలని ఆవేశంతో ఊగిపోయారు.

ఆయన బీజేపీ ఎమ్మెల్యే, చంద్రబాబు మీద చెప్పుల దాడి జరిగితే దాని మీద తమ్ముళు యాక్షన్ తీసుకోకుండా ఉంటారా. ఇప్పటికే చాలా జిల్లాలలో వైసీపీ వారిని గుర్తు పెట్టుకుని మరీ వేధింపులకు గురి చేస్తున్నారు అని అంటున్నారు. ఒక వైపు కక్ష సాధింపు చర్యలు వద్దు అని చంద్రబాబు పవన్ చెబుతున్నా రాజకీయ దమనకాండ జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అయినా ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించడానికి వ్యవస్థలు ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే అంతు తేలుస్తామని అనడం పట్ల వైసీపీ నుంచి నిరసన వినిపిస్తోంది. పసుపు తమ్ముళ్ళ కంటే చంద్రభక్తిని అధికంగా బీజేపీ ఎమ్మెల్యే చూపిస్తున్నారు అని సెటైర్లు పడుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది అంతు చూడడానికి కాదని ప్రజా ప్రతినిధులు గుర్తుంచుకో లేకపోతే వైసీపీకి జరిగిన పరాభవం కళ్ల ముందే ఉంది కదా అన్నది చాలా మంది మాట.