మ‌న‌ నాయ‌కుల్లో హుందాత‌నాన్ని ఆశించ‌డం అత్యాశే!

లోక్‌స‌భ విప‌క్ష‌నేత రాహుల్‌గాంధీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోంది. రాజ‌కీయంగా ఆయ‌న ప్ర‌ద‌ర్శిస్తున్న హుందాత‌నం ప్ర‌త్య‌ర్థుల మ‌న‌సుల్ని సైతం చూర‌గొంటోంది. రాహుల్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై బీజేపీ నేత‌లు గ‌త ప‌దేళ్ల‌లో వ్య‌క్తిగ‌త‌మైన అంశాల‌తో…

లోక్‌స‌భ విప‌క్ష‌నేత రాహుల్‌గాంధీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోంది. రాజ‌కీయంగా ఆయ‌న ప్ర‌ద‌ర్శిస్తున్న హుందాత‌నం ప్ర‌త్య‌ర్థుల మ‌న‌సుల్ని సైతం చూర‌గొంటోంది. రాహుల్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై బీజేపీ నేత‌లు గ‌త ప‌దేళ్ల‌లో వ్య‌క్తిగ‌త‌మైన అంశాల‌తో తీవ్ర దాడుల‌కు తెగ‌బడ్డారు. వీరిలో బీజేపీ అగ్ర‌నేత‌లు కూడా ఉన్నారు. అయినా రాహుల్‌గాంధీ తొణ‌క‌లేదు.

తాజాగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీపై త‌న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అభ్యంత‌ర‌క‌ర భాష‌ను ప్ర‌యోగించార‌ని తెలిసి రాహుల్ తీవ్రంగా స్పందించారు. స్మృతిపై మాత్ర‌మే కాదు, ఇత‌ర నేత‌ల‌పైనా కించ‌ప‌రిచే భాషను ప్ర‌యోగించొద్ద‌ని రాహుల్ త‌న పార్టీ శ్రేణుల్ని వారించారు. 2019 ఎన్నిక‌ల్లో అమేధిలో రాహుల్‌పై స్మృతి ఇరానీ గెలిచారు. అప్ప‌ట్లో రాహుల్‌పై ఆమె కించ‌ప‌రిచేలా అవాకులు చెవాకులు పేలారు.

అయిన‌ప్ప‌టికీ రాహుల్‌గాంధీ నోటి దురుసు ప్ర‌ద‌ర్శించ‌లేదు. త‌మ నాయకుడు అమేధిలో ఓడిపోయిన‌ప్పుడు కించ‌ప‌ర‌చ‌డాన్ని మ‌రిచిపోలేని కాంగ్రెస్ శ్రేణులు… ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన స్మృతి ఇరానీపై అదే భాష‌లో గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ విష‌యం తెలుసుకున్న రాహుల్‌గాంధీ, అలా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని వార్నింగ్ ఇచ్చారు.

రాజ‌కీయాల్లోనూ, జీవితంలోనూ గెలుపోట‌ములు స‌హ‌జ‌మ‌న్నారు. ఇత‌రుల‌ను అవ‌మానించ‌డం బ‌ల‌హీన‌త‌కు చిహ్న‌మ‌ని , అది గొప్ప‌త‌నం కాద‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. రాహుల్‌గాంధీలా హుందాగా వ్య‌వ‌హ‌రించే నేత‌ల్ని ఏపీలో ఊహించుకోగ‌ల‌మా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

వైసీపీ, టీడీపీ అగ్ర నాయ‌కులు మొద‌లుకుని, గ్రామ స్థాయి వ‌ర‌కూ ప‌ర‌స్ప‌రం దూషించుకోవ‌డం మిన‌హా, పెద్ద‌రికంతో న‌డుచుకునే వాతావ‌ర‌ణం అస‌లు క‌నిపించ‌దు. ప్ర‌త్య‌ర్థుల్ని దారుణంగా ఎంత కించ‌ప‌రిస్తే, అంత‌గా ఆనందించే అగ్ర‌నాయ‌కుల్ని చూస్తున్నాం. ఇందుకు చ‌ట్ట‌స‌భ‌లు సైతం అతీతం కాదు. అందుకే ఏపీ రాజ‌కీయాలంటేనే అస‌హ్యించుకునే ప‌రిస్థితి.

ఏపీ రాజ‌కీయాలు క‌లుషితం అయ్యిన‌ట్టుగా, దేశంలో మ‌రే రాష్ట్రంలో ఇంత‌గా రాజ‌కీయాలు దిగ‌జార‌లేదేమో అన్న అభిప్రాయం ప్ర‌జ‌ల్లో వుంది. ఏపీ రాజ‌కీయ నాయ‌కుల్లో హుందాత‌నాన్ని ఆశించ‌డం అత్యాశే అవుతుందేమో! ఈ ధోర‌ణిలో మార్పు వ‌స్తే త‌ప్ప‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం బాగుప‌డ‌ద‌నే వారి అభిప్రాయాన్ని ఎలా కాద‌న‌గ‌లం?