కొత్త ఐడియాలు చేయడంలో తప్పు లేదు. కానీ ఆ ఆలోచనల వల్ల జనం మీద భారం పడకుండా వుండాలి. ఇప్పటికే చాలా రోడ్లు జాతీయ రహదారులుగా మారి, టోల్ గేట్లు పెట్టి, జనాల దగ్గర నుంచి భారీగా వసూళ్లు సాగిస్తున్నారు. ఏళ్లు, పూళ్లు గడిచినా ఆ టోల్ బాకీలు, బాధలు తప్పడం లేదు. ఇప్పుడు స్టేట్ రోడ్లకు కూడా టోల్ గేట్ లు పెడితే ఎలా వుంటుంది? బైక్ లు, ఆటోల సంగతి సరే. వాళ్లకు ఫ్రీ వుంటుంది. కానీ కార్లు అన్నది కామన్ అయిపోయిన కాలం కదా.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఆంధ్రలోని రద్దీగా వుండే స్టేట్ రోడ్ లను గుర్తించమని సిఎమ్ చంద్రబాబు ఆదేశించారు. అలాంటి బిజీగా వుండే స్టేట్ రోడ్లను గుర్తించి బివోటీ పద్దతిన ఇవ్వాలన్నది ఆయన ఆలోచన. బివోటీ అంటే నిర్మించు.. నిర్వహించు.. బదలాయించు. అంటే ఓ రొడ్ అభివృద్దికి ఎంత ఖర్చవుతుందో గుత్తేదారునే పెట్టుకుంటాడు. ఇన్నేళ్ల పాటు నిర్వహిస్తాడు. తన పెట్టుబడి వెనక్కు వచ్చే వరకు టోల్ వసూలు చేసుకుంటాడు. ఆ తరవాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తాడు.
కానీ ఈ టోల్ వసూళ్లే దశాబ్దాల తరబడి సాగుతూ వుంటాయి. పెట్టిన కోట్ల పెట్టుబడి, దాని వడ్డీలు, ఏళ్ల కొద్దీ నిర్వహణ ఖర్చులు కలిపి అన్నమాట. మరి ఇది జనం మీద భారమే కదా. ప్రభుత్వం చేయాల్సింది చేయకుండా, జనం మీద భారం వేయడం అవుతుంది.
కేంద్రం ఇఫ్పటికే జాతీయ రహదారులు అన్నీ ఈ ప్రాతిపదికనే అభివృద్ది చేస్తూ వస్తోంది. జాతీయ రహదారి మీదకు వస్తే చాలు టోల్ వాచిపోతోంది. ఇక స్టేట్ రోడ్ల మీద కూడా అంటే.. కార్లు పక్కన పెట్టి బైక్ ల మీద తిరగాల్సిందే జనాలు.