జ‌గ‌న్ రాజీనామా ఎందుకు చేస్తారు?

పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికైన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి, క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తార‌నే ప్ర‌చారంపై వైసీపీ ముఖ్య నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. జ‌గ‌న్ ఎందుకు రాజీనామా…

పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికైన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి, క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తార‌నే ప్ర‌చారంపై వైసీపీ ముఖ్య నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. జ‌గ‌న్ ఎందుకు రాజీనామా చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం విశేషం. దీంతో జ‌గ‌న్ రాజీనామాపై స‌స్పెన్స్ వీడిన‌ట్టైంది.

కొన్ని రోజులుగా జ‌గ‌న్ రాజీనామాపై సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌డంతో అసెంబ్లీకి వెళ్ల‌డానికి జ‌గ‌న్‌కు మ‌న‌సు రావ‌డం లేద‌నే మాట వినిపిస్తోంది. అందుకే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి క‌డ‌ప ఎంపీగా జ‌గ‌న్ పోటీ చేస్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. త‌న త‌ల్లిని పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తార‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ ప్ర‌చారాన్ని మొగ్గ ద‌శ‌లోనే తుంచేయాల్సిన వైసీపీ… ఆ ప‌ని చేయ‌లేదు. అది చెట్టుగా పెరిగేంత వ‌ర‌కూ వైసీపీ ప్రేక్ష‌క పాత్ర పోషిస్తూ వ‌చ్చింది. ఈ ప్ర‌చారం వైసీపీకి రాజ‌కీయంగా న‌ష్టం తీసుకొస్తోంద‌ని తెలుసుకున్న త‌ర్వాత వైసీపీ మేల్కొంది. ఈ క్ర‌మంలో వైవీ సుబ్బారెడ్డి స్పందించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

జ‌గ‌న్ కడ‌ప ఎంపీగా పోటీ చేస్తార‌న్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని ఆయ‌న కొట్టి పారేశారు. పేద‌ల‌కు ఉచితంగా ఇసుక ఇస్తే స్వాగ‌తిస్తామ‌ని ఆయ‌న అన్నారు. కానీ వైసీపీ హ‌యాంలో ఇసుక‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని దుష్ప్ర‌చారం చేయ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న అన్నారు. ఉచిత ఇసుక పేరుతో డ‌బ్బు వ‌సూలు చేయ‌డం మంచిది కాదన్నారు. టీడీఆర్ బాండ్ల‌లో అవినీతి జ‌రిగింద‌ని భావిస్తే నిరభ్యంత‌రంగా విచార‌ణ చేసుకోవ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు.