తిరుపతిలో పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయ్యింది. జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై సొంత పార్టీతో పాటు టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కూటమిలో పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయ్యింది. జనసేన గెలుపు కోసం పని చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడానికి నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆ కూటమిలో లుకలుకలు వీధినపడ్డాయి. బహిరంగంగానే ఎమ్మెల్యేపై సొంత పార్టీ నాయకుడు ఘాటు వ్యాఖ్యలు చేయడం, ఆయనకు ఆరణి శ్రీనివాసులు దీటుగా కౌంటర్ ఇవ్వడం తిరుపతిలో సర్వత్రా చర్చనీయాంశమైంది.
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చిత్తూరు నుంచి వైసీపీ తరపున ప్రాతినిథ్యం వహించారు. ఈ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆయన జనసేనలో చేరి తిరుపతి టికెట్ దక్కించుకున్నారు. అదృష్టం కలిసొచ్చి ఆరణి గెలుపొందారు. అయితే ఆరణి తమ పన్నాగాలు పడనివ్వడం లేదని అప్పుడే కొందరు ఆయనపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎలాగైనా ఆరణిపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల వద్ద చెడ్డ చేయాలనే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
ఆరణికి వ్యతిరేకంగా రాయల్ కాని రాయల్ బహిరంగంగా ప్రకటనలు చేస్తుండగా, ఆయనకు వత్తాసు పలుకుతూ కొందరు నాయకులు లోలోపల కుట్ర రాజకీయాలకు తెరలేపినట్టు ఆరణి అనుచరులు చెబుతున్నారు. వైసీపీ నాయకులతో ఆరణి ఎక్కువగా టచ్‌లో ఉన్నారని, వారికే పనులు చేస్తారని ప్రధానంగా ఆయన వ్యతిరేకులు చేస్తున్న ప్రచారం. పాత పరిచయాలను దృష్టిలో పెట్టుకుని ఆరణి వైసీపీ నాయకులతో అంటకాగుతున్నారంటూ వ్యతిరేకులంతా కూడబలుక్కుని ముఖ్యంగా పవన్‌కల్యాణ్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్టు తెలిసింది.
అయితే చిత్తూరు నుంచి తిరుపతికి తాను పోటీ చేయడానికి వస్తే… గో బ్యాక్ అంటూ నగర వ్యాప్తంగా ప్లెక్సీలు వేసి తరిమేయడానికి ఎవరెవరు కుట్రలు చేశారో బాగా తెలుసని ఆరణి హెచ్చరిస్తున్నారు. అలాగే తన ఓటమిని ఆకాంక్షించిన టీడీపీ, జనసేన నాయకులెవరో బాగా తెలుసని, ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆరణి శ్రీనివాసులు బహిరంగంగానే కామెంట్స్ చేయడం అసంతృప్త నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరి కనీసం నెల రోజులు కూడా కాకుండానే తిరుపతిలో కూటమి పార్టీల్లో అసమ్మతి జ్వాలలు రగులుతుండడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కూటమిలో కనీసం అంటే 20 మంది నాయకులున్నారు. వాళ్లంతా తామే ఎమ్మెల్యేలుగా ఫీల్ అవుతున్నారు. దానికి ఎమ్మెల్యే ఆరణి అడ్డుకట్ట వేస్తున్నారు. దీన్ని సహించలేకపోతున్నారు. ఇదేంటి…. నిన్నగాక మొన్న వైసీపీ నుంచి వచ్చిన ఆరణి శ్రీనివాసులు తమపై రాజకీయంగా పెత్తనం చేయడం బాగోలేదని వారు అంటున్నారు. రానున్న రోజుల్లో తిరుపతిలో రాజకీయ గేమ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.