హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. విచారణ కూడా మొదలుపెట్టారు.
రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, తనను వదిలేసి, హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో సహజీవనం స్టార్ట్ చేశాడంటూ లావణ్య ఆరోపించింది. ఈ మేరకు 5 పేజీలతో లిఖితపూర్వకంగా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు, లావణ్యను సాక్ష్యాలు కోరుతూ నోటీసులు జారీచేశారు. దీనిపై వెంటనే స్పందించిన లావణ్య, తనదగ్గరున్న ఫొటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్, మెసేజీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లాంటి అన్ని ఆధారాల్ని అందించింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు, లావణ్య అందించిన సాక్ష్యాలు సరిపోవడంతో, పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. అతడ్ని రేపోమాపో పోలీస్ స్టేషన్ కు పిలిచే అవకాశం ఉంది.
11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో తను సహజీవనం చేస్తున్నట్టు పోలీసులకు వెల్లడించింది లావణ్య. ఓ టైమ్ లో తను గర్భం కూడా దాల్చానని, కానీ రాజ్ తరుణ్ బలవంతంగా అబార్షన్ చేయించుకునేలా రాజ్ తరుణ్ తనపై ఒత్తిడి తెచ్చాడని ఆమె ఆరోపిస్తోంది.
సీన్ లోకి ఎంటరైన మాల్వి మల్హోత్రా..
మొత్తం వివాదానికి కేంద్ర బిందువైన హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఇప్పటికే ఈ అంశంపై స్పందించింది. ఇప్పుడు చట్టపరంగా చర్యలకు ఉపక్రమించింది. లావణ్య తనను బెదిరిస్తోందని, బ్లాక్ మెయిల్ చేస్తోందని, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందంటూ, ఆమెపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చింది. ఈ మేరకు లావణ్యపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
లీగల్ గా ప్రొసీడ్ అవుతున్న రాజ్ తరుణ్..
అటు రాజ్ తరుణ్ కూడా ఈ వివాదాన్ని చట్టపరంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే మీడియాకు వెల్లడించిన ఈ హీరో, ఎలా ముందుకెళ్లాలనే అంశంపై లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నాడు.
రాజ్ తరుణ్ రాజీ కోసం ప్రయత్నించినట్టు లావణ్య చెబుతోంది. తనను వదిలేస్తే ఇల్లు రాసిస్తానని, ప్రతి నెల ఖర్చులకు డబ్బులిస్తానని రాజ్ తరుణ్ తనకు ఆఫర్ చేశాడని, కానీ తనకు అవేం అక్కర్లేదని, రాజ్ తరుణ్ తనకు కావాలని ఆమె అంటోంది.