ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. వైసీపీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతన్నారనే కారణంతో అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు. 2019లో కదిరి నుంచి పోటీ చేసిన డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వడానికి వైఎస్ జగన్ నిరాకరించారు.
దీంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సిద్ధారెడ్డికి బదులు బీఎస్ మక్బూల్‌కు టికెట్ ఇచ్చారు. తనకు టికెట్ దక్కకపోవడంతో వైసీపీని ఓడించడానికి ఆయన ప్రయత్నించారు. కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్‌కు ఆయన మద్దతు ఇచ్చారనే ఫిర్యాదులు అధిష్టానానికి వెల్లువెత్తాయి. వైసీపీ అధిష్టానం విచారించి, ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో సస్పెన్షన్ వేటు వేసింది.
కదిరిలో ముస్లింల ఓట్లు ఎక్కువ. అయినప్పటికీ వైసీపీ ఓడిపోయింది. కూటమి సునామీలో కంచుకోట లాంటి కదిరిలో వైసీపీ ఓటమికి సొంత పార్టీలో అసమ్మతే కారణమని తెలుస్తోంది. కూటమి అభ్యర్థులు చాలా నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే కదిరిలో మాత్రం 6,625 ఓట్ల తేడాతో టీడీపీ గెలుపొందడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి టీడీపీలో లేదా బీజేపీలో చేరొచ్చనే ప్రచారం జరుగుతోంది.