సలహాదారు.. ఈ మాటే పెద్ద బూతుపదం అయిపోయింది! గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావుకు ప్రభుత్వ సలహాదారు అనే హోదా ఒకటి ఇచ్చారు. దానిపై పచ్చమీడియా చెలరేగిపోయేది! వైఎస్ ను ఏ స్థాయిలో ద్వేషించేదో ఆ మీడియా కేవీపీనీ అలాగే చూసేది! వైఎస్ మరణానంతరం కేవీపీ ని ప్రభుత్వ సలహాదారు హోదా నుంచి తప్పిస్తారనే ప్రచారం ఒకటి జరిగింది.
కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాకా పచ్చమీడియానే ఆ ప్రచారాన్ని పెట్టింది. ఆ సమయంలో ‘సలహాల రావుకు ఇక సెలవు’ అనే హెడ్డింగ్ ఒకటి పెట్టారు పచ్చమీడియాలో పెద్ద పత్రికలో! అయితే ఆ హోదా ఉన్నా లేకపోయినా.. కేవీపీ హవాకు కిరణ్ ప్రభుత్వంలోనూ లోటు లేకపోయింది!
కిరణ్ సీఎంగా ఉన్నన్నాళ్లూ కూడా కేవీపీకి ఇబ్బందులు రాలేదు! కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ కేవీపీ హవా కొనసాగింది. కాంగ్రెస్ హయాంలోనూ, కాంగ్రెస్ అనంతరం వైఎస్ కుటుంబంతో సహా అనేక మంది వారి సావాసగాళ్లు రకరకాల ఇబ్బందులు పడ్డా.. కేవీపీని మాత్రం ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు! పచ్చమీడియా ఆ స్థాయిలో పగబట్టి కూడా ఏ స్థాయిలోనూ ఇబ్బందులు పడనిది కేవీపీ మాత్రమేనేమో!
ఇక జగన్ హాయాంలోనూ అనేక మంది సలహాదారులు పుట్టుకొచ్చారు! ఒక దశలో వీరందరి మీదా పచ్చమీడియా కన్నెర్ర చేసింది. పచ్చ పార్టీ కోర్టులకు వెళ్లింది. అంతమందికి సలహాదారుల పదవులు ఇచ్చారని, అసలు వారంతా ఎందుకంటూ కోర్టును ఆశ్రయించారు! మరి జగన్ సలహాదారులను చూసి అప్పుడు టీడీపీ కుళ్లుకుని ఉండవచ్చు కానీ, జగన్ ను ఆ సలహాదారులే చివరకు ముంచేశారనేది చేదు నిజం!
మళ్లీ వైఎస్ హయాం నాటికే వెళితే కేవీపీ ఏవేవో సలహాలు ఇచ్చేసి ఉంటారని, ఆయనేదో వైఎస్ ను రెండోసారి సీఎంగా గెలిపించేంత స్థాయి సలహాలు ఇచ్చి ఉంటారని ఎవ్వరూ అనలేరు! అయితే సీఎం హోదాలో కొన్ని విషయాల్లో మంచిచెడులు మాట్లాడటానికి మాత్రం తగు సలహాదారు అవసరం! వైఎస్ అలా మాట్లాడుకోవడానికి తన చిరకాల స్నేహితుడికి ఆ హోదాను ఇచ్చుకున్నారు! పాటించినా పాటించకపోయినా.. స్వేచ్ఛగా స్పందించగల వారి దగ్గర కొన్ని విషయాలను చర్చించడం అనేది ఎవరికైనా తగు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నట్టే! మరి జగన్ సలహాదారులు ఏం చేశారు? ఏం చెప్పారు? అంటే.. చాలా మంది ఆ హోదాల్లో ఉండినా, వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి ముందు వరసలో నిలిచినా.. వీళ్ల వల్ల జగన్ కు లాభం మాట అటుంచి, తీవ్రమైన నష్టం జరిగిందని మాత్రం వేరే చెప్పనక్కర్లేదు!
2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడంలో ముఖ్యమైన క్రెడిట్ సలహాదారులకు దక్కుతుందని అక్కడి పరిణామాలను చూసిన వారు సూటిగానే చెబుతున్నారు! తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా వీరిది ఒక్కోరిది ఒక్కో అమోఘమైన పాత్ర! సలహాదారు అంటే .. ఆ మాట విని జనాలు ఒకటి ఊహించుకుంటారు. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో వీరు మంచిచెడులను విశ్లేషించి ముఖ్యమంత్రికి చెబుతారని అంతా అనుకుంటారు! అయితే.. సలహాదారులకు మంచి చెడులను విశ్లేషించే సత్తానే లేకపోతే, ఒకవేళ ఎవరైనా వీరికి అసలు విషయాలను చేరవేసినా వాటిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లే ఉద్దేశమే లేకపోతే.. వీరి హోదానే ఒక వ్యర్థమైనదని స్పష్టం అవుతోంది!
వైఎస్ రాజశేఖర రెడ్డిలా జగన్ కింది నుంచి రాలేదు! తండ్రి వారసత్వమే పునాదిగా తన కోటను నిర్మించుకున్నాడు! మరి ఆయన సలహాదారులైనా రాజకీయాల్లో డక్కామొక్కీలు తిన్న వారా అంటే.. ఎవరికీ అంత సీన్ లేదు! తన అన్న చాటు ఎదుగుదలతో సజ్జల సాక్షికి ఎడిటోరియల్ డైరెక్టర్ అయ్యాడు! దాదాపు పదేళ్ల పాటు ఆ హోదాలో ఉండి ఆయన సాక్షిని ఉద్ధరించింది ఏ మేరకో అయినా జగన్ కు అవగాహన ఉండి ఉండాలి! ఏదో పునరావాస కేంద్రం లాగా సజ్జలను, జీవీడీని, రామచంద్రమూర్తిని సాక్షి నుంచి తీసుకొచ్చి ప్రభుత్వంలో తన చుట్టూ పెట్టుకున్నారు జగన్! సాక్షి ఏ మేరకు సక్సెస్ అయినా అందులో వీరికి ఏ క్రెడిట్ దక్కదు, కేవలం ఒక ప్రత్యామ్నాయ మీడియాగా మాత్రమే సాక్షి సర్క్యులేషన్ ను సాధించింది కానీ, వీరు చేసిన అద్భుతాలు ఏమీ లేవు! వీరిలో రామచంద్రమూర్తి తనకు ఆ హోదా కూడా వద్దంటూ వెళ్లిపోయారు.
ఇంకా సాక్షి నుంచి రక్కసి ధనుంజయ్ రెడ్డి లాంటి ఆణిముత్యాలు కూడా ఆ తర్వాతి కాలంలో ప్రభుత్వంలో వెళ్లారు! సాక్షి నుంచి ఇంకా అనేక మంది జర్నలిస్టులకు ప్రభుత్వ కొలువులు లభించాయి! అవన్నీ చూసి.. జగన్ పేపర్ నడుపుతున్నాడో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడో అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పేపర్ నడపడానికి ప్రభుత్వాన్ని నడపడానికి చాలా వ్యత్యాసం ఉందని ఇప్పటికైనా అర్థమయ్యే ఉండాలి!
అంత వరకూ జగన్ ఇచ్చిన జీతం మీద ఆధాపడిన వారికి ఆయనకు సలహాలు ఇచ్చే తాహతు ఉంటుందా? ఇది మినిమం కామన్ సెన్స్ తో వేసుకోవాల్సిన ప్రశ్న! ఏ యజమానికి అయినా ఉద్యోగి సలహాలు ఇవ్వగలడా? ఏదైనా యజమాని చెప్పినా .. దానికి గుడ్డిగా తలాడించడమే తప్ప ఏ హోదాలోని ఉద్యోగి అయినా మారుమాట్లాడగలడా? ఎంతసేపూ తన హోదాను కాపాడుకోవాలి, వీలైతే ఆ హోదాను అడ్డం పెట్టుకుని ఏ సంపాదించుకోవచ్చు అనే తప్ప ఏ ఉద్యోగికి అయినా వేరే ధ్యాస ఉంటుందా? యజమాని ఏదైనా విషయంలో సలహాలు అడిగినా.. ఆయన ఏం చెప్పినా సమర్థించడమే తప్ప వేరే తీరు ఉండే ఉద్యోగులు ఎంతమంది? అలాంటి వారు ఉంటారేమో కానీ, జగన్ చుట్టూ మూగిన సలహాదారులకు మాత్రం అంత సీన్ లేదని ఎప్పుడో స్పష్టం అయ్యింది!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాకా.. సజ్జల చెప్పిన మాటలు వింటే సగం మందికి మతి పోయింది! పార్టీ ఎమ్మెల్యేలను, క్యాడర్ ను దారుణంగా మోసం చేసే మాటలు సజ్జల బాహాటంగా మాట్లాడాడు! గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటమికి కారణం ఏమిటి? అంటే.. దానిపై సజ్జల స్పందిస్తూ, గ్రాడ్యుయేట్లు తమ ఓటు బ్యాంకు కాదని సెలవిచ్చారు! తమ ఓటు బ్యాంకు వేరే అన్నారు! మరి .. గ్రాడ్యుయేట్లు జనరల్ ఎలక్షన్స్ లో ఓటేయరా? ఓటేయరు అనుకున్నారా? వారికి కుటుంబం ఉండదని అనుకున్నారా? డిగ్రీ వరకూ చదివిన వాడు తన ఇంట్లో వాళ్లను ఓటు విషయంలో ప్రభావితం చేయడని అనుకున్నారా? కనీసం ఇది అంచనా వేయకుండా తోచినట్టుగా మాట్లాడి పార్టీ అధినేతను, ఎమ్మెల్యేలను, పార్టీ క్యాడర్ ను దారుణంగా మోసం చేసిన వ్యక్తి సజ్జల! ఆయనో సలహాదారు!
గ్రాడ్యుయేట్లు మీ ఓటు బ్యాంకు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు మీ ఓటు బ్యాంకు కాదు, మద్యపాన ప్రియులు మీ ఓటు బ్యాంకు కాదు.. ఇంకెవరు మీ ఓటు బ్యాంకో ఇప్పటికైనా సజ్జల ఒక ప్రెస్ మీట్ పెట్టి చెబితే వినాలని ఉంది! పై కేటగిరి లోని ఎవరికీ కుటుంబాలు ఉండవు, వారు తమ ఆగ్రహాన్ని కుటుంబంతో పంచుకుని వ్యతిరేకంగా ఓటేయిస్తారనే జ్ఞానమూ సలహాదారులకు లేకపోతే ఎలా! సజ్జలే కాదు.. జగన్ చుట్టూ మూగిన ప్రతి సలహాదారు పరిస్థితే ఇదే!
ఎంతసేపూ తమ తమ మార్గాలనే చూసుకున్నారు తప్ప వాస్తవాలను ఏ స్థితిలోనూ గ్రహించలేకపోయారు, గ్రహించడానికి అసలు ఇష్టపడలేదు! అది ఐప్యాక్ అయినా జగన్ చుట్టూ ముందు వరసలో ఉండిన వారైనా ఎవరి స్వార్థాన్ని వారు చూసుకున్నారు కానీ, తాము ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నాము, తాము ప్రాతినిధ్యం వహిస్తున్నది ఒక రాష్ట్రానికి అని గుర్తుంచలేని చిన్న స్థాయి జీవులు జగన్ చుట్టూ చేరారు గత ఐదేళ్లలో!
ఇక్కడ వ్యక్తిగత ద్వేషం కాదు, ఈ వ్యాసాన్ని రాస్తున్న నేను సాక్షిలో ఐదు సంవత్సరాల పాటు పని చేసిన వాడినే! అక్కడి పరిణామాలను దగ్గర నుంచి గమనించిన అనుభవం ఉన్న వాడినే! సాక్షిలో నా ఉద్యోగానికి నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసింది సదరు సజ్జలే! ఆసక్తి కొద్దీ ఫ్రీలాన్స్ గా రాసుకోవడానికి తగు రాతను నేర్పడంలో సాక్షి పాత్ర ఎంతో ఉంది కూడా! అయితే.. రెండు వేల మంది ఉద్యోగుల వ్యవస్థను సరిగా నడపలేని వ్యక్తులు ప్రభుత్వంలోకి వెళ్లి ఉద్ధరిస్తారన్నప్పుడే నాబోటి వాళ్లకు అనుమానాలు మొదలయ్యాయి! అయితే అభిమానులను, పార్టీ క్యాడర్ ను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా భ్రమల్లోకి తీసుకెళ్లి మోసం చేసిన ఘనత మాత్రం జగన్ చుట్టూ ఉన్న వారికే సాధ్యమైంది!
మరి ఇప్పటికైనా పరిస్థితి మారుతుందా? లేక మారదా అనేది శేష ప్రశ్న! మారకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అనేది ఒక కలగానే మిగులుతుందనేది వాస్తవం! జగన్ తీరులో మార్పు రావాలి, సలహాలు స్వీకరించాలి, సలహాలు ఇవ్వదగిన స్థాయి వ్యక్తులను ఎంచుకోవాలి! కడప వాడనో, సాక్షిలో పని చేశాడనో, కుటుంబానికి ముందు నుంచి తెలుసనో, బంధువు అనో కాదు.. ఈ ఎంపిక ఉండాల్సింది! నీ నిర్ణయాల్లో మంచి చెడులను విశ్లేషించగలిగే వారు అయితే చాలు! వారికి అపారమైన మేధస్సు అవసరం లేదు.
మందు బాబులు సాయంత్రం అయితే మనల్ని తిట్టుకుంటున్నార్రా బాబూ మద్యం విధానం మారుద్దాం.. అని చెప్పగలిగే వాడు లేకపోయాడా? పార్టీ క్యాడర్ ఊరూరా పార్టీని వీడుతోంది.. 2014, 2019 ఎన్నికల్లో మనకు హార్డ్ కోర్ గా పని చూసినా వారిలో ఊరికి రెండు మూడు కుటుంబాలు ఇప్పుడు పూర్తిగా యాంటీగా తయారయ్యాయి.. దీనిపై ఎక్కడిక్కడ ఏదైనా వర్కవుట్ చేద్దాం.. అని చెప్పగలిగే వాడు లేకపోయాడా! రాజధాని విషయంలో ట్రోలింగ్ జరుగుతూ ఉంది, దీనికి ఎక్కడో అక్కడ ఎలాగోలా అడ్డుకట్ట వేయాలని చెప్పగలిగే వాడు లేకపోయాడా! వాళ్లు మన ఓటు బ్యాంకు కాదు, వీళ్లు మన ఓటు బ్యాంకు కాదు అని తేల్చేయగల మేధావులు తమ మూలాలనే మరిచిపోయేంత మత్తులో మునిగారా! ఈ మత్తు నుంచి బయటకు వచ్చి వాస్తవాలను గ్రహించగలిగే వారు, వాస్తవాలను విడమరిచి చెప్పగల సలహాదారులు అయితే జగన్ కు అత్యవసరం!
-జీవన్ రెడ్డి. బి