కూటమి అధికారంలోకి రావడానికి రెడ్లు కూడా తమ వంతు పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో తమ వాడని వైఎస్ జగన్‌ను అధికారంలోకి తెచ్చుకుంటే, తన చుట్టూ ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితర ఆరేడుగురు రెడ్లకు మాత్రమే రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల్ని సీఎం హోదాలో జగన్ కలిగించారని రెడ్లంతా ఆగ్రహానికి గురయ్యారు.
జగన్‌పై కోపాన్ని ఎన్నికల్లో చూపారు. అందుకే వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కానీ జగన్‌పై కోపం, విద్వేషంతో ఆయన సామాజిక వర్గాన్ని టీడీపీ టార్గెట్ చేసింది. ముఖ్యంగా ఉద్యోగుల్లో రెడ్డి అనే ఏ ఒక్క వ్యక్తికి మనశ్శాంతి మిగల్చకూడదని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించకుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్స్‌పై కక్ష కట్టినట్టుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
ప్రభుత్వం సరిగ్గా కొలువుదీరకుండానే వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అన్ని స్థాయిల్లోని రెడ్ల ఉద్యోగుల్ని చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్టుగా ఇష్టమొచ్చినట్టు బదిలీలు చేశారు. విద్యా సంవత్సరం మొదలై, పిల్లల్ని స్కూల్స్, కాలేజీల్లో చేర్పించుకున్న తల్లిదండ్రుల గురించి ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించలేదు. జగన్ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగి అయితే చాలు… వేసేయ్ దూర ప్రాంతాలకు అన్నట్టుగా కక్షతో వ్యవహరించారు.
అలాగే ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న జగన్ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులపై కూడా ఇదే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రెడ్‌బుక్‌లో పేర్లకు అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఉద్యోగి వివరాలు తెప్పించుకుంటూ, వారిలో అభద్రత, భయాందోళన కలిగిస్తున్నారు. అక్కడక్కడ ఒకరిద్దరు మినహాయిస్తే తమపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా టార్గెట్ చేసిందనే భావన రెడ్లలో వచ్చేసింది.
ఇటీవల కొత్త కలెక్టర్ల నియామకాన్ని చేపట్టారు. ఒక్కరంటే ఒక్కరైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారికి పోస్టింగ్ ఇవ్వకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం వారిపై ఎంత విద్వేషంతో వుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఎక్కువ మందికి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ దేనికి సంకేతం? రెడ్లను రాజకీయంగా, అలాగే సామాజికంగా అణచివేసేందుకే ఈ ప్రభుత్వం పని చేస్తోందని నిరూపించుకోదలిచిందా?
రెడ్లకు కుల పిచ్చి వుండి వుంటే, కూటమి ఈ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకునేదా? రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో రెడ్లు రాజకీయంగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 నుంచి 80 నియోజకవర్గాల్లో గెలుపోటములను రెడ్లు శాసించే పరిస్థితి. రెడ్లు కేవలం తమ సామాజిక వర్గం ఓట్లనే ప్రభావితం చేస్తారని అనుకుంటే పొరపాటు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీల ఓట్లను కూడా వారు ప్రభావితం చేయగలిగే సత్తా వుంది.
తమ కులంలా కాకుండా, రెడ్లు కులాన్ని దాటుకుని తమకు అండగా నిలిచారనే స్పృహ చంద్రబాబులో కొరవడిందని ఆ సామాజిక వర్గీయులు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్లకు సంబంధించిన ఆస్తులపై దాడులు, వేధింపులు ఆ సామాజిక వర్గాన్ని మనస్తాపానికి గురి చేస్తోంది. జగన్‌ను ఊరికే ఓడించుకున్నామా? అనే పశ్చాత్తాపం ఆ సామాజిక వర్గంలో స్టార్ట్ అయ్యింది. ఇదీ చంద్రబాబు సర్కార్ నెలరోజులు కూడా నిండని పాలన తీసుకొచ్చిన మార్పు.
వైఎస్ జగన్‌పై రాజకీయంగా ఏవైనా ప్రతీకారాలుంటే తీర్చుకోవడాన్ని ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ జగన్‌పై అక్కసుతో ఆయన తండ్రి, ప్రజానాయకుడు వైఎస్సార్ విగ్రహాల్ని ధ్వంసం చేయడం, వాటికి నిప్పు పెట్టి దహనం చేయడాన్ని రెడ్లు జాగ్రత్తగా గమనిస్తున్నారని టీడీపీ నేతలు గుర్తించాలి. మొత్తానికి కూటమి ప్రభుత్వ వైఖరిపై రెడ్లు రగిలిపోతున్నారు. చంద్రబాబు సర్కార్ చేజేతులా జగన్‌కు బలాన్ని పెంచుతున్నారు. ఎలాంటి రాజకీయ సంబంధాలు లేని రెడ్లను సైతం జగన్‌కు మద్దతుగా నిలిచేలా చంద్రబాబు సర్కార్ పాలన సాగుతోంది. రెడ్లలో నివురుగప్పిన నిప్పు రానున్న రోజుల్లో ఎవర్ని దహిస్తుందో కాలం జవాబు చెప్పాల్సి వుంది.