మహా విశాఖ నగర పాలక సంస్థ మీద చిత్తూరు కార్పోరేషన్ ప్రభావం పడబోతోందా అన్నది చర్చగా ఉంది. చిత్తూరులో పాతిక మంది వైసీపీ కార్పోరేటర్లు మేయర్ తో సహా వెళ్ళి టీడీపీలో చేరిపోయారు. దాంతో రాత్రికి రాత్రి కండువాలు మార్చేశారు.
ఆ ఎఫెక్ట్ విశాఖ మీద పడింది అని అంటున్నారు. విశాఖలో వైసీపీ నుంచి 30 మందికి పైగా కార్పోరేటర్లు టీడీపీ కండువా కప్పుకునేందుకు తహతహలాడుతున్నారు అని అంటున్నారు. వీరంతా పసుపు పార్టీ పెద్దలతో టచ్ లో ఉన్నారని ప్రచారం సాగుతోంది.
వైసీపీకి 58 మంది కార్పోరేటర్లు జీవీఎంసీలో ఉన్నారు. వీరిలో పెద్ద నంబరే రూట్ మార్చబోతోంది అని అంటున్నారు. ఒక్కసారి కనుక అటు నుంచి ఇటు జంప్ స్టార్ట్ అయితే వైసీపీకి భారీ షాక్ అని అంటున్నారు. టీడీపీ కూటమి నేతలు అయితే వైసీపీని సింగిల్ డిజిట్ కే పరిమితం చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మేయర్ డిప్యూటీ మేయర్లను పక్కన పెట్టి వచ్చిన వారిని వచ్చినట్లే పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా విశాఖలో వైసీపీని ఖాళీ చేయించాలని పంతం మీద ముందుకు సాగుతున్నారు అని తెలుస్తోంది.
విశాఖలో అన్ని సీట్లూ గెలిచినా గుండెకాయ లాంటి కార్పోరేషన్ లో మాత్రం వైసీపీ జెండా ఎగరడం టీడీపీకి ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు. విశాఖ నగరాభివృద్ధి జీవీఎంసీ మీదనే ఆధారపడి ఉంది. దాంతో జీవీఎంసీ మీదనే టీడీపీ జెండా ఎగిరేలా చూడాలని పట్టుబడుతున్నారు.
జీవీఎంసీని తమ పరం చేసుకుంటే విశాఖలో రాజకీయంగా నూరు శాతం సాధినట్లు అవుతుందని టీడీపీ భావిస్తోంది. రానున్న రోజులలో విశాఖ మీద పూర్తి ఆధిపత్యం చలాయించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. వైసీపీ కార్పోరేటర్లు చాలా మంది అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్న నేపధ్యంలో వారిని ఆపేందుకు వైసీపీ చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించబోవు అని అంటున్నారు.