ఇలా చేస్తే ఏం జరుగుతుంది అన్న చిన్న ఆలోచన లేకుంటే ఎప్పటికైనా ఇబ్బందే. అది ఏ రంగమైనా, ఏ వృత్తి అయినా, ఏ వ్యక్తి అయినా. ఎందుకంటే ఇప్పుడు మనం డిజిటల్ వరల్డ్ లో వున్నాం. మనం మాట్లాడకుండానే ఎడిటింగ్ టెక్నిక్ లు వాడేందుకు రెడీ గా వున్నాయి. మనం కాకున్నా డీప్ ఫేక్ వీడియోలు వచ్చేస్తున్నాయి. ఇలా ఫేక్ నే భయపెడుతూ వున్నపుడు, ఇది డిజిటల్ యుగం అని మరిచిపోయి, ప్రతీదీ రికార్డ్ నే, ప్రతీదీ ప్రూఫ్ నే అని మరిచిపోయి, ఇంగితం మరిచి, ఉచ్ఛం నీచం మరిచి కామెంట్ చేయడం, రెచ్చిపోవడం అంటే ఏమనుకోవాలి. కోరి కష్టాలను కొని తెచ్చుకోవడం తప్ప వేరు కాదు.
సోషల్ మీడియా ఎప్పుడు ఎత్తుతుందో, ఎప్పుడు కింద పడేస్తుందో ఊహించడం కష్టం. అలాంటి సోషల్ మీడియాలో తాము తురుములు తోపులు అనుకుంటూ, తమ చిత్తానికి ఎదుటివాళ్లను తూలనాడుకుంటూ పోతే, దొరికిపోవడం పక్కా. కామెంట్లు పెట్టేస్తాం అనుకుంటే ప్రతీదీ అఫీషియల్ గా దొరికేదే. కాల్ అయినా కామెంట్ అయినా అంతా రికార్డెడ్ గా దొరికేదే. యూ ట్యూబర్ హనుమంతు ఉదంతం ఇప్పుడు మరోసారి ఎంత జాగ్రత్తగా వుండాలో చెబుతుంది.
పెర్వర్టెడ్ నెస్ కు పరాకాష్టగా గా ఇష్టం వచ్చినట్లు చిన్న పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు కించపరుస్తూ మాట్లాడితే ఇప్పుడు ఏమయింది జైలు అంచుల దగ్గర నిల్చోవాల్సి వచ్చింది. ప్రభుత్వం దయదలిస్తే అది వేరు. లేదు ప్రభుత్వం తలుచుకుంటే ఈ కారణాల చాలు.
కుర్రకారుకు ఏం చేస్తున్నామో తెలియడం లేదు. ఇద్దరు ఇంటర్ కుర్రాళ్లు మరో ఇంటర్ కుర్రాడిని మర్డర్ చేసేసారు. జైలు జీవితం ఎంత నరకంగా వుంటుందో తెలిస్తే, ఊపిస్తే ఆ పని చేసి వుండేవారు కాదు. ఓ గర్ల్ ఫ్రెండ్ కోసం ఇప్పుడు జీవితం మొత్తం పోగొట్టుకున్నారు.
సోషల్ మీడియాలో కూడా ఓ గీత వుంటుంది. ఆ గీత లోపలే వుండాలి ఎవరైనా. ఎవరూ సీరియస్ గా తీసుకోరు. పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ ఎక్కడ తిరుగుతాం అనే ఉదాసీన వైఖరితో వుంటారు. అందువల్ల నడిచిపోతోంది. అదే చట్టాలు పటిష్టం గా వుండి, ఫిర్యాదు చేయడం సులువు అయిన రోజు ఇదే సోషల్ మీడియా ఉరితాడుగా మారుతుంది.
రాను రాను కుర్రాళ్లు లేదా మనుషులే పెర్వెర్టెడ్ గా మారుతున్నారు. సైకోల మాదిరిగా బిహేవ్ చేస్తున్నారు ఒక్కోసారి. లేదంటే చిన్న పిల్లలు, తండ్రీ కూతుళ్ల బంధం మీద కామెంట్లు చేయడం ఏమిటి? హీరోల కూతుర్ల మీద నీచమైన కామెంట్లు చేసిన సంఘటనలు వున్నాయి. ఇవన్నీ పెర్వెర్టెడ్ నెస్ కు మాత్రమే పరాకాష్ట కాదు. తమనేం చేయలేరు, ఏదో గుర్తు తెలియని ఐడితో కామెంట్ చేసేసాం. తరువాత డిలీట్ చేసేస్తాం అనే ధీమా. కానీ ఏ గుర్తు తెలియని ఐడి అయినా పోలీసులు తలుచుకుంటే పది నిమిషాలు చాలు.
హనుమంతు ఉదంతం ఇప్పుడు సీరియస్ టర్న్ తీసుకుంది సినిమా ప్రముఖులు సాయి తేజ్, మంచు మనోజ్ లాంటి వాళ్లు స్పందించడంతో సిఎమ్ రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగక తప్పదు. ఈ ఉదతం ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా, బ్రాడ్ కాస్టింగ్ గ్రూపు లు వాడేవారికి ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక. తస్మాత్ జాగ్రత్త.