Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఈ దాడులు మంచివి కాదు!

ఈ దాడులు మంచివి కాదు!

‘ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నది గనుక.. ఆ పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారని, విచ్చలవిడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆస్తులు టార్గెట్ గా దాడులు చేస్తున్నారని’ అన్నంత మాత్రాన గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు ఎలాంటి దాడులు చేయకుండా పరిశుద్ధాత్మ స్వరూపులుగా ఉన్నారని సర్టిఫై చేసినట్టు కాదు. కానీ.. ఈ దాడులకు కూడా సినిమాలకు లాగా స్టార్ రేటింగ్ ఇస్తే గనుక.. వైఎస్సార్ కాంగ్రెస్ జమానాలో జరిగినవి అన్నీ సింగిల్ స్టార్ రేటింగ్ పొందిన ఫ్లాప్ షోలు. అదే ఇప్పుడు చంద్రన్న  సారథ్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఫైవ్ స్టార్ రేటింగును దాటిపోయే సూపర్ హిట్ షో లు!!

రాజకీయ  అధికారం అనేది చంచలమైనది. అది నిత్యం అటూ ఇటూ మారుతూ ఉంటుంది. అప్పుడు వారు చేశారని ఇప్పుడు వీరు.. ఇప్పుడు వీరు చేశారని రేపు వారు.. శృతి పెంచుకుంటూ వెళితే.. సమాజం ఎక్కడకు వెళుతుంది? వీటికి అంతం ఎక్కడుంటుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో తలచుకుంటేనే భయంగొలిపే ఈ పరిణామాల మీద.. గ్రేట్ ఆంధ్ర విశ్లేషణాత్మక కవర్ స్టోరీ.. ‘ఈ దాడులు మంచివి కాదు’!

పార్టీల పట్ల మనకు ఉండగల రాగద్వేషాలను ఒకింతసేపు పక్కన పెట్టి ఆలోచించండి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ముద్ర ఉన్న ఆస్తుల మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తున్న, కూల్చివేస్తున్న తీరును అందరూ గమనిస్తున్నాం. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే.. చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న ఉండవిల్లి అక్రమభవనం అసలు ఇవాళ్టికి ఉండేదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కూల్చివేతలు జరిగాయి.

కానీ.. అందులో విచ్చలవిడిగా చెలరేగిపోకుండా జగన్ కాస్త మొహమాట పడ్డారు. ఆక్రమించిన ప్రహరీలను, ప్రభుత్వం స్థలాలను కబ్జా చేసి కట్టుకున్న బాత్రూములను ఇలాంటి వాటిని మాత్రమే కూల్చారు. కేవలం అనుమతి లేని లేదా అనుమతుల్లోని ప్లానుకు భిన్నంగా ఉన్న కారణాలు చూపి ఏకంగా కూల్చివేసిన ఘటనలు జగన్ పాలనలో లేవు. ముందు లోపాలను అన్వేషించి.. ఆ తర్వాత ఆ కారణాలు కలిసి వస్తే కూల్చేవేతలు చేసేవారు.

ఇప్పుడు పరిస్థితి అది కాదు. ముందు కూల్చివేయడానికి నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత అందుకు తగిన విధంగా కారణాలను వండుతున్నారు. లోపాలను ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. ఈ దుర్మార్గం ఎటువైపు దారితీస్తుంది. 

కక్ష సాధింపులకు ఇదొక మార్గమా?

రాజకీయాల్లో ప్రతిపక్షాలను శత్రువుల్లాగా చూడడం అనేది ఇవాళ్టి పరిణామం కాదు. ఎన్నికల వరకే శత్రుత్వాలు.. ఆ పర్వం ముగిసిన తర్వాత.. అందరూ కలిసి సమాజం కోసం పనిచేయడమే అనే ఆదర్శాలు, విలువలు ఎప్పుడో మంటగలిసిపోయాయి. వేరే పార్టీలో ఉన్న వాడిని శత్రువుగా చూడడం అనే పోకడ చాలా కాలం కిందటే రాజకీయాల్లోకి చొరబడిపోయింది. ఎదుటి పార్టీలో ఉన్నంత కాలం శత్రువులాగా చూడడం, ఫిరాయించి తమ పార్టీలోకి వస్తే నెత్తిన పెట్టుకోవడం.. ఒక అపభ్రంశపు అలవాటుగా మారిపోయింది. అప్పట్లో కూడా ప్రత్యర్థులను వేధించడం, కక్ష సాధింపులకు పాల్పడడం ఉన్నాయి. కాకపోతే అలాంటి దుర్మార్గానికి కూడా కొన్ని విలువలు ఉండేవి. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏదైనా తప్పు చేసి దొరికిపోయిన సందర్భాల్లో వారి చుట్టూ గట్టిగా ఉచ్చు బిగించేయడానికి అధికారపక్షం ఉత్సాహపడేది. ఇప్పుడు వాతావరణం అలా లేదు. తప్పులు చేయాల్సిన అవసరం లేదు.. తప్పులను పులిమేసి, నేరాలకు సంబంధించిన సెక్షన్లను బనాయించి ఉత్తిపుణ్యానికే కక్షసాధింపులకు పాల్పడుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసక పాలన అని ప్రత్యర్థులు అంటారు. నదీపరీవాహక ప్రాంతంలో నిర్మాణాలు జరగకూడని చోట ప్రభుత్వం ధనంతో నిర్మించినంత మాత్రాన ఉపేక్షించడం తప్పు అనే ఉద్దేశంతోనే ఆయన ప్రజావేదికను కూల్చివేయించారు. తెలుగుదేశం నాయకుల్లోని కొందరి ఇళ్ల విషయంలో కాస్త దూకుడు ప్రదర్శించారు. వారు తమ పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి.. నిర్మాణాలను ఎక్స్‌టెండ్ చేసి ఉంటే అలాంటి భాగాలను మాత్రం కూల్చేయించారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయించిన ప్రహరీ గోడ వంటివి కూల్చేయించారు. ఇవన్నీ జగన్ విధ్వంసకాండ కింద ప్రచారానికి నోచుకున్నాయి.

కానీ నిజం చెప్పాలంటే.. నిబంధనల అతిక్రమణ అనే పాయింట్ దొరికినప్పుడు మాత్రమే జగన్ కాస్త దూకుడు చూపించారు. అదే సమయంలో.. చంద్రబాబునాయుడు నివాసం ఉండే ఉండవిల్లి హర్మ్యం.. పూర్తిగా నిబంధనల ఉల్లంఘనే అయినప్పటికీ.. నేలమట్టం చేయించడానికి తగినదే అయినప్పటికీ.. నోటీసులు సర్వ్ చేసి వ్యవహారం కోర్టుకు వెళ్లాక పూర్తిగా విస్మరించారు.

కానీ, తెలుగుదేశం పాలన మొదలైన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ వారు తమలపాకుతో ఒకటి వడ్డిస్తే.. తాము తలుపుచెక్కతో రెండు వడ్డించాలని తెలుగుదేశం నాయకులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు జరుగుతున్న దందా అంతా అలాగే ఉంటున్నది. ‘పా పాలనలో కక్ష సాధింపులు ఉండవు.. విధ్వంసం ఉండదు..’ అని సన్నాయి నొక్కులు నొక్కుతూ చంద్రబాబు పాలన ప్రారంభించారు. కానీ అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసి, లీజుకు తీసుకున్న భూముల్లో కడుతున్న నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేయడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి. పూర్తయిన భవనాలు అన్నింటికీ.. కూల్చవేయడానికి నోటీసులు ఇవ్వడాన్ని ఎలా పరిగణించాలి? ముందు కూల్చివేసి తర్వాత ఉల్లంఘనల గురించి వెతుకుతున్నట్టుగా ఉంది.

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దుర్మార్గమైన పోకడకు తెలుగుదేశం వారు కూడా సిగ్గుపడుతున్నారు. వైసీపీ నాయకుడు తమ స్థలాన్ని ఆక్రమించుకుని భవనం కడుతున్నాడంటూ ఎవరో ఫిర్యాదు చేశారట.. అంతే! కొలికపూడి ఇక చెలరేగిపోయారు. అసలు ఆ ఆరోపణల్లో నిజం ఉన్నదా? లేదా? న్యాయ వివాదం ఉన్నదా? ఆక్రమణ అంటున్న వారు ఆధారాలు చూపిస్తున్నారా? అంతా సవ్యంగా ఉంటే అలాంటి ఆక్రమణలను నిలువరించడానికి చట్టపరమైన పద్ధతి ఏమిటి? ఇలాంటి ఏ అంశాన్నీ ఆయన పట్టించుకోలేదు. కూల్చివేయాలని అధికారులకు హుకుం జారీచేశారు. వారు నోటీసులు సిద్ధం చేసేలోగా.. తానే పొక్లెయిన్లు తీసుకువెళ్లి కూల్చివేతలు కూడా సాగించారు.

కొలికపూడి శ్రీనివాసరావు తనను తాను దైవాంశ సంభూతుడిగా, తన వద్దకు వచ్చి మొరపెట్టుకున్న ఆశ్రితులందరికీ న్యాయం ప్రసాదించే రాజుగా భావించుకుంటున్నట్టుగా ఈ పరిణామాలు కనిపించాయి. చట్టం గిట్టం, రూల్సూ గీల్సూ తన ముందు పనిచేయవు.. తానే సర్వోన్నతుడిని అనే భావనతో అతిగా చెలరేగుతున్నట్టుగా ప్రజల్లోకి సంకేతాలు పంపాయి. తమాషా ఏంటంటే.. ఈ దూకుడు తర్వాత చంద్రబాబునాయుడు పిలిపించి మందలించారు. అంతవరకు ఆయన తన పాత్ర తాను చక్కగానే పోషించారు. బయటకు వచ్చిన కొలికపూడి.. ‘నష్టం జరిగిన వారికి న్యాయం చేయలేకపోతే ఈ పదవులు ఎందుకు?’ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం ఇంకా చిత్రం! ఇది కేవలం ఆయన దుర్మార్గమైన ఆలోచన సరళినే కాదు.. చంద్రబాబునాయుడు పట్ల ధిక్కారస్వరాన్ని కూడా చాటిచెబుతున్న వైనం! అంతేకాదు.. తన పార్టీ నేతల అరాచకాల్ని అదుపులోపెట్టలేని చంద్రబాబునాయుడు చేతగానితనానికి కూడా ఇది నిదర్శనం!!

ఇలాంటి దుర్మార్గపు, కక్షసాధింపు కూల్చివేతల పర్యవసానం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఊహించడం చాలా సులభం. జగన్ గతంలో నిబంధనలు పట్టించుకుంటూ కూల్చారు. ఇప్పుడు చంద్రబాబు నిబంధనల్ని తుంగలో తొక్కి కూలుస్తున్నారు. రేపు మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే నిబంధనల ఊసేలేకుండా కూల్చేస్తారు. మళ్లీ రావడం అంటూ జరిగితే.. ప్రమాణం చేసే సమయానికే తొలి పొక్లయిన్ చంద్రబాబునాయుడు ఉండవిల్లి నివాసాన్ని కూల్చేసే పనిలో ఉంటుందేమో.. ఎవరు చూడొచ్చారు? ఈ ప్రతీకారాత్మక, విధ్వంసక కార్యకలాపాలకు అంతూ దరీ ఎక్కడ ఉంటాయి? 

వ్యాపారాలు పరిశ్రమల మీద కూడానా?

వ్యాపారాలు పరిశ్రమలను కూడా రాజకీయ నాయకులు వదిలిపెట్టడం లేదు. రొటీన్ రాజకీయ కక్షసాధింపుల్లాగా.. ఇప్పుడు మొదలైనవి కాదు. గతంలో కూడా ఉన్నాయి. జగన్ పాలన రోజుల్లో కూడా ఉన్నాయి. అయితే ఇదివరకటి తరహాలోనే.. జగన్ రూల్సు, చట్టం అతిక్రమణ ఉంటే ప్రత్యర్థిని వదిలిపెట్టకుండా టార్గెట్ చేశారు. కానీ.. ఇప్పుడు ఆ వేధింపులకు కూడా రూపు మారిపోతోంది.

అమరరాజా ఫ్యాక్టరీల విషయంలో కాలుష్య నియంత్రణ మండలి వారికి నోటీసులు ఇవ్వడం తొలిసారి కాదు. ఉల్లంఘన కూడా తొలిసారి కాదు. అయితే అమరరాజా ఫ్యాక్టరీలకు నోటీసులు ఇచ్చినందుకు ఎంత యాగీ చేశారో అందరూ చూశారు. ఉల్లంఘనలు లేకుండా వ్యాపారం చేయడం తనకు చేతకాదు అన్నట్టుగా అప్పటి తెదేపా ఎంపీ జయదేవ్ వ్యవహరించారు. ఇక్కడ జగన్ నోటీసుల సాకు చూపించి.. తెలంగాణలో అప్పనంగా రాయితీలు పొంది.. అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. అసలు జగన్ ఇచ్చిన నోటీసుల వల్ల పారిపోయారా? లేదా, ఇక్కడ జగన్ నుంచి వ్యాపారానికి రాయితీలు పొంది, దందా సాగించడం సాధ్యం కాదని.. తెలంగాణకు తరలిపోయారా? అనేది కూడా సస్పెన్సే. ఒక్క అమరరాజా వారి స్వార్థపూరిత పలాయనానికి ముడిపెట్టి.. జగన్ మీద ఎంత బురద చల్లారో లెక్కేలేదు.

కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? నిబంధనల ఉల్లంఘన కూడా ఉండక్కర్లేదు. డైరక్టుగా దందా సాగించడమే. నోటీసుల పర్వం కాదు.. కేవలం దందా.. మాకు ఇంత ఇస్తే నువ్వు వ్యాపారం చేసుకోగలవ్.. లేదా.. మూయించేస్తాం అన్నట్టుగానే బెదిరింపుల పర్వం నడుస్తోంది.

చంద్రగిరి నియోజకవర్గం కుంట్రపాకంలో ఆర్యవైశ్యుల సంఘం నాయకుడు కిషోర్‌కు చెందిన ఎల్‌.వి.ఎం రైస్‌ మిల్లును మూసివేయించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తన అనుచరుల్ని పంపి, పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. అంత ఇవ్వలేనని, కొంత ఇస్తానని చెప్పినప్పటికీ వారు అంగీకరించలేదని సమాచారం. దీంతో  ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే అధికారులను రంగంలోకి దించి, అన్ని రకాల అనుమతులతో నడుస్తున్న రైస్‌ మిల్లుకు బుధవారం అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిపివేయించి, సీజ్‌ చేయించినట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ‘తాను లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడినని, తన మాట వినకుంటే జిల్లాలో ఎక్కడా వ్యాపారం చేయనీయను’ అంటూ ఎమ్మెల్యే పులివర్తి నాని, రైస్ మిల్ యజమాని కిషోర్‌ను భయపెట్టినట్లు సమాచారం.

ప్రభుత్వ వేధింపులు ఇలాంటి దందాల, రౌడీమామూళ్ల రూపం సంతరించుకుంటే.. చిరువ్యాపారాలు ఏం చేయగలరు? అమరరాజా వంటి పెద్ద సంస్థ మరో రాష్ట్రానికి వెళ్లి లాభపడగలిగింది. స్థానికంగా రైస్ మిల్లు నడుపుకుననే చిన్న వ్యక్తి.. ఏం చేయగలడు? ఎవరితో పోరాడగలడు? ఎందుకు వేధిస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రశ్నలే.

ఆ పేదరాలు ఏం చేసిందో?

ఆమె ఒక పేదరాలు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండి పెట్టడం, వచ్చిన సొమ్ముతో పొట్టపోసుకోవడం ఆమె బతుకు తెరువు! అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయపురం మండల పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలు ఆమె. 23 ఏళ్లుగా ఇదే పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే తెలుగుదేశం మూకలు ఆమె పొట్టకూటిని కొల్లగొట్టడానికి తెగించాయి. మధ్యాహ్న భోజన ఏజన్సీని వదిలేయాలంటూ తెదేపా నాయకులు ఆమెను బెదిరించారు. ఆమె రాజకీయ పార్టీలకు చెందినది కాదు. ఏదో బతుకుతెరువుగా ఆ పని చేసుకుంటున్న మహిళ. కానీ.. తెదేపా నాయకులు ఆమెను టార్గెట్ చేశారు. బతుకుతెరువు మీద కొట్టడంతో.. ఆమె పాఠశాల ఆవరణలోనే పురుగుల మందు తాగేసింది. ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ వేధింపుల్లో రాజకీయం లేనేలేదు. అధికారంలో ఉన్నది తమ పార్టీనే కదా.. కాబట్టి తాము పేదల కడుపు కొట్టవచ్చు అనే దాష్టీకం మాత్రం పుష్కలంగా ఉంది. ఇలాంటి దుర్మార్గమైన పాలన కోసమేనా.. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నమ్మి.. ఆయనకు, ఆయన వెంట నిలిచిన కూటమికి కలిపి 164 సీట్లు కట్టబెట్టారు. చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, పేదల పక్షాన నిలబడడం అంటే ఇదేనా? అని ప్రజలు అడుగుతున్నారు.

ఈరాష్ట్రం భవిష్యత్తు భయానకం!

ఇదివరకు తెదేపా అనుకూలురను జగన్ నిబంధనల ప్రకారం వేధించారు. ఇప్పుడు వైకాపా అనుకూలమైన వారినందరినీ చంద్రబాబు.. ఉత్తినే వేధిస్తారు. మళ్లీ అధికారం చేతులు మారితే.. తెదేపా వ్యక్తి అనే అనుమానం వస్తే చాలు.. జగన్ వారి భరతం పట్టడానికి ఉద్యమిస్తుంటారు.. ఇదొక సైకిల్! ఇదొక చక్రభ్రమణం! కానీ ఇలాంటి పోకడల పర్యవసానం ఎలా ఉంటుందో ఊహిస్తే భయం వేస్తుంది.

రాష్ట్రంలో పెద్దస్థాయి వ్యాపారం చేయడానికి, ఒక పరిశ్రమ పెట్టడానికి ఏ ఒక్కడూ ముందుకు రాడు. జగన్ హయాంలో ఇక్కడ పరిశ్రమ ప్రారంభిస్తే.. తెలుగుదేశం వచ్చినప్పుడు మూసేయాల్సి వస్తుందని భయపడతారు. తెలుగుదేశం హయాంలో ప్రారంభిస్తే.. జగన్ వచ్చాక తమను వెంటాడుతాడని జంకుతారు. ఏతావతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావడం అనేది జరగదు గాక జరగదు. పరిశ్రమల సంగతి తర్వాత.. అసలు ప్రజలు కూడా నిత్యభయాల మధ్య బతకడం తప్పదు. ఇప్పుడున్న రాజకీయ వేధింపులు ఇలాగే కొనసాగుతూ వస్తే గనుక.. ఒక దశాబ్దం తరవాత పరిస్థితిని ఊహించుకోలేం.

ఒక పార్టీ అధికారంలోకి వస్తే.. రెండో పార్టీకి చెందిన వారంతా.. రాష్ట్రం వదలి మరోచోట తలదాచుకునే దుస్థితి దాపురిస్తుంది. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోకి వచ్చి ప్రత్యర్థి పార్టీ వారిని రాష్ట్ర సరిహద్దులు దాటేవరకు తరిమికొట్టే సంస్కృతి వస్తుంది.

అంతిమంగా.. రాష్ట్ర భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇలాంటి సైకిల్ అనదగిన వేధింపుల పోకడలకు ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పడాలి. జగన్ హయాంలో తెలుగుదేశం వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి నిజమే. దానికి అనేక రెట్లుగా ఇప్పటికే చంద్రబాబు మరియు పార్టీ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. కానీ ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పడాలి. చంద్రబాబునాయుడు తన సుదీర్ఘ అనుభవాన్ని, పెద్దరికాన్ని నిలబెట్టుకునేలా.. ఆ ఫుల్ స్టాప్ తానే పెడితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. బాబు పాలనలోనే కక్షలు, కక్ష సాధింపులు, వేధింపులు ఎరగని మంచిరోజులు వస్తాయని ఆశిద్దాం. 

..ఎల్. విజయలక్ష్మి

 


  • Advertisement
    
  • Advertisement