వైఎస్సార్ కుటుంబానికి ఆ రెండు పత్రికలు నిత్యం వ్యతిరేకంగా పని చేస్తుంటాయి. వైఎస్సార్ జీవించిన కాలంలో ఆ పత్రికల పోకడలను విమర్శించేవారు. ఆ రెండు పత్రికలంటూ… వైఎస్సార్ వెటకరించేవారు. ఆ రెండు పత్రికల ఒంటెత్తు జర్నలిజానికి వ్యతిరేకంగా, ప్రత్యామ్నాయ మీడియా వుండాలనే తలంపుతోనే “సాక్షి” పురుడు పోసుకుంది. ఈ విషయం అందరికీ తెలుసు.
వైఎస్సార్ మరణంతో రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్ కుటుంబం కూడా నిట్టనిలువునా చీలిపోయింది. ఏ మీడియాకైతే వ్యతిరేకంగా వైఎస్సార్ తుది శ్వాస వరకూ పోరాడారో, ఆ మీడియానే ఆయన ముద్దుల కుమార్తె షర్మిలకు ప్రీతిపాత్రమైంది.
ఇవాళ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన జీవితాంతం వ్యతిరేకించిన పత్రికకు రెండు ఫుల్ పేజీల వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం… అంతా కాల, షర్మిల మహిమ అని దివంగత నేత అభిమానులు నిట్టూర్చుతున్నారు. వైఎస్సార్ 75వ జయంతిని పురస్కరించుకుని మంగళగిరిలో నిర్వహించే సమావేశానికి సంబంధించిన ఫుల్ పేజీ యాడ్‌ను షర్మిల ఇచ్చారు. ఇందులో ఏపీకి చెందిన నేతల ఫొటోలు లేకపోవడం గమనార్హం.
అలాగే వైఎస్సార్ ఆత్మ బంధువుల పేరుతో మరో ఫుల్ పేజీ యాడ్‌ను ఇవ్వడం గమనార్హం. వైఎస్సార్ కుటుంబానికి చెందిన వివరాలు కేవలం ఆ పత్రికలోనే ఎందుకు వస్తున్నాయో, వారికి ఎవరు చెబుతున్నారో ఇంత కాలం సాగుతున్న ప్రచారానికి ఈ వాణిజ్య ప్రకటనలు బలం కలిగిస్తున్నాయని చెప్పొచ్చు.
ఇదే సందర్భంలో వైఎస్సార్ వారసురాలిగా ప్రజాదరణ పొందాలని అనుకుంటున్న షర్మిలకు, ఈ వాణిజ్య ప్రకటనలు శాశ్వతంగా రాజకీయ సమాధి కడుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే, ఎవరినైతే రాజకీయంగా, మీడియా పరంగా వైఎస్సార్ వ్యతిరేకించారో, వారితోనే షర్మిల అంటకాగడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకున్నారనే చర్చ జరుగుతోంది.