విశాఖ జిల్లాల్లో టీడీపీయే అన్ని సీట్లు గెలుచుకుంది. ఎంపీ అభ్యర్ధికి అయితే అయిదు లక్షలకు పైగా భారీ మెజారిటీ వచ్చింది. ఎమ్మెల్యేలు అయితే ఒకటికి మూడు నాలుగు సార్లు గెలిచిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అందరూ అనుభవం కలిగిన వారే. అందరూ రాజకీయంగా రాటు తేలిన వారే.
అయితే విశాఖ జిల్లాలో టీడీపీ బాధ్యతలను చూసేది ఎవరూ అన్న చర్చకు తెర లేస్తోంది. విశాఖ జిల్లాకు మంత్రిగా గతంలో గంటా శ్రీనివాసరావు ఉండేవారు. ఆయన పార్టీని కూడా చూసుకుంటూ ముందుకు సాగేవారు. జిల్లా మంత్రిగా ఆయన కీలకంగా ఉండేవారు.
తాజా మంత్రివర్గంలో విశాఖకు మినిస్టర్ లేకుండా పోయారు రూరల్ జిల్లా నుంచి వంగలపూడి అనితకు హోం మంత్రి ఇచ్చారు. ఆమె మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీని కూడా నడిపించాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి గతంలో కొందరు నేతలు అంగబలం అర్ధం బలం అందిస్తూ ఉండేవారు. వారే పార్టీని లీడ్ చేసేవారు.
అధినాయకత్వం ఆ విధంగా బేఫికర్ గా ఉండేది. ఇపుడు కూడా విశాఖ జిల్లాకు కార్యవర్గం ఉంది. కానీ పార్టీని కో ఆర్డినేట్ చేసుకుంటూ అన్ని వేళల్లో ముందుకు నడిపించే పెద్ద తలకాయలు ఉండాలి. దివంగత ఎంవీవీఎస్ మూర్తి మనవడుగా వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రీభరత్ పార్టీకి పెద్ద దిక్కుగా మారుతారా అంటే ఆయన ఎంపీగా ఉంటూ తన విద్యా సంస్థలను కూడా చూసుకోవాల్సి ఉందని అంటున్నారు.
మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు వంటి నేతలు తమ సొంత నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. దీంతో పార్టీ బాధ్యతలను చూసుకుంటూ ప్రభుత్వాన్ని కూడా కో ఆర్డినేట్ చేసే పెద్దన్న కోసం చూస్తున్నారు. జిల్లా ఇంచార్జి మంత్రి రూపంలో ఆ పెద్దన్న ఎవరో ఒకరు రావచ్చు అని అంటున్నారు. అది ఎవరో చూడాల్సి ఉంది అని అంటున్నారు.