టాలీవుడ్ లో కోట్లు అంటే ఇప్పుడు ఏమీ కాకుండా అయిపోయింది. శ్రీవిష్ణు-నాగశౌర్య దగ్గర నుంచి మెగాస్టార్-మహేష్ బాబు వరకు కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్లు. సరే, వాళ్లంటే హీరోలు, వాళ్ల డిమాండ్ మేరకు సినిమా మార్కెట్ ఆధారపడి వుంటుంది కనుక కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ నిర్మాణ వ్యయాన్ని కంట్రోలు చేయాలి కదా. వెనకటికి పెద్ద వాళ్లు చెప్పే వ్యాపార సూత్రం ఒకటి వుంది. లాభం అనేది మన చేతుల్లో లేదు. కానీ ఖర్చు తగ్గించుకోవడం మన చేతుల్లో వుంది అన్నదే ఆ సూత్రం.
కానీ మన దర్శకులకు అది అస్సలు పట్టడం లేదు. నిర్మాతలు కంట్రోలు చేసే స్థితిలో లేరు. ఒక వేళ కంట్రోలు చేయాలని నిర్మాత అనుకుంటే దర్శకుడు వెళ్లి హీరోకి ఫిర్యాదు చేస్తాడు మెల్లగా. నిర్మాత సినిమాను చుట్టేయాలని చూస్తున్నాడు అంటూ. దాంతో నిర్మాత కు హీరోల నుంచి క్లాస్ వుంటుంది. అందువల్ల ఒకసారి సినిమాను పట్టాలు ఎక్కించాక ఇక నిర్మాత చేతిలో ఏమీ వుండదు. ఖర్చు పెట్టుకుంటూ పోవడం తప్ప.
సాధారణంగా వేసుకున్న బడ్జెట్ కు ఓ పది శాతం అదనంగా కావడం అన్నది మామూలు విషయం. దాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. అలా కాకుండా డబుల్, త్రిబుల్ కావడం అన్నది, హీరో మార్కెట్ ను దాటిపోవడం అన్నది అస్సలు సహించరాని, క్షమించరాని విషయం. కానీ ఏమీ మాట్లాడలేరు. ఎవరూ ఏమీ అనలేరు. పైగా ఏమన్నా అంటే నాన్ థియేటర్ రెవెన్యూ వచ్చింది కదా అని నిర్మాతనను వత్తిడి చేస్తారు.
కొన్నేళ్ల క్రితం అంటే ఓ పెద్ద సినిమా నిర్మాణంలో వుంది. థియేటర్ హక్కులు మంచి రేట్లకు అమ్ముడు పోయాయి. దాంతో థియేటర్ నుంచి మంచి మొత్తాలు వచ్చాయి కదా, సినిమా మీద ఖర్చు చేయండి మరి కొంచెం అన్నారు హీరోగారు. చేయక తప్పలేదు. సినిమా డిజాస్టర్ అయింది. నిర్మాతలు కుదేలయిపోయారు.
ఓ హీరో అంటే అభిమానం ఓ నిర్మాతకు. మంచి సినిమా తీసి ఇవ్వాలి తన హీరోకి అనుకున్నారు. తీసారు. మంచి సినిమానే. కానీ ఏం లాభం నిర్మాతకు మిగిలింది ఏమీ లేదు.
ఓ కొత్త దర్శకుడితో సినిమా స్టార్ట్ చేసారు ఓ హీరో. బడ్జెట్ అదుపు దాటి వెళ్లిపోతోంది. నిర్మాత తల పట్టుకున్నారు. దర్శకుడిని వారించారు. దర్శకుడు వెళ్లి హీరోకి ఫిర్యాదు చేసాడు. ఖర్చు పెట్టలేకపోతే ప్రాజెక్టు వదిలేయండి అంటూ హీరో నుంచి సందేశం.. దాంతో ఇంక నిర్మాత మారు మాట్లాడలేదు. సినిమా విడుదలయింది. పేరు వచ్చింది.. లాభం రాలేదు.
అంతెందుకు ఈ మధ్య ఓ పెద్ద హీరో సినిమా వచ్చింది. 80 కోట్లలో అవుతుంది అనుకున్నారు. మహా అయితే తొంభైకి పెరుగుతుందేమో అనుకున్నారు. 130 దాటింది. సినిమా చూస్తే రెమ్యూనిరేషన్లు కూడా పెద్దగా లేవు. అందరి రెమ్యూనిరేషన్లు కలిపినా 40 నుంచి 50 కోట్లు కావు. అంటే మేకింగ్ కు 80 కోట్లు అన్నమాట. సినిమా చూస్తే 80 కోట్ల సినిమా అన్నట్లు లేదు. హీరోకి పట్టుమని రెండు మూడు డ్రెస్ లు కూడా లేవు.
ఆ మధ్య స్ట్రగుల్ పడుతున్న ఓ కుర్ర హీరో సినిమా వచ్చింది. 40 కోట్ల అంచనాతో మొదలై 80 కోట్లకు చేరింది. నిర్మాత కుదేలయిపోయారు.
స్ట్రగుల్ లో వున్న ఓ మిడ్ రేంజ్ హీరో సినిమా నిర్మాణంలో వుంది. ఇప్పటికే 45 కోట్లకు చేరింది బడ్జెట్.
ఇలా ప్రతి సినిమా థియేటర్ ఫెయిల్యూర్ నా కాదా అన్నది తరువాత సంగతి ముందుగా కాస్ట్ ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. హీరో మార్కెట్, సినిమా మార్కెట్ కు మించి ఖర్చు చేయించేస్తున్నారు చాలా మంది దర్శకులు. అందరు నిర్మాతలు కాస్ట్ ను కంట్రొలు చేయలేకపోతున్నారు.
అసలు ప్లాన్ చేస్తున్న సినిమాలు కూడా ముందుగానే ఇలా లెక్కలు వేస్తున్నారు. ఓ మిడ్ రేంజ్ హీరో సినిమా స్టార్ట్ కాబోతోంది. 80 నుంచి 100 కోట్ల బడ్జెట్ అని వినిపిస్తోంది. ఓ సీనియర్ హీరో సినిమా ప్రారంభం కాబోతోంది. 200 కోట్ల బడ్జెట్ అని వినిపిస్తోంది. ఇప్పుడు పది.. ఇరవై కోట్ల సినిమా అన్నది కాస్త పేరున్న హీరోతో అస్సలు సాధ్యం కాకుండా అయిపోయింది.
దీని వల్ల థియేటర్ మార్కెట్ మీద భారం పడుతోంది. సినిమా హిట్ అయినా కూడా డబ్బులు సరిపోని పరిస్థితి వుంటోంది. హీరోల మెహర్బానీ కోసం నిర్మాతలు పెదవి విప్పరు. అలా పెదవి విప్పితే మళ్లీ డేట్ లు దొరకవు.
మొత్తం మీద టాలీవుడ్ ఇప్పుడు పదుల కోట్ల మీద మాట్లాడడం మానేసింది. డెభై కోట్లు.. ఆపైన ప్రారంభమవుతోంది పాట. వందల కోట్లను దాటుతోంది. ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుందో మరి.