తాజాగా మంత్రి కేటీయార్, జయప్రకాష్ నారాయణ్ తో ఒక ఛానల్లో ముఖాముఖిలో కూర్చున్నారు. ఇద్దరూ అనేక అంశాలమీద ఆసక్తికరమైన సంభాషణ చేసారు.
అందులో భాగంగా ఒక చోట కేటీయార్ ఇలా చెప్పారు- “దినపత్రికల్లో ప్రధానంగా ఐదు రకాల వ్యక్తులు కనపడతారు.
చివరి నుంచి మొదలుపెడితే మొదట కనపడేది స్పోర్ట్స్ పర్సన్స్…దానికి చాలా ట్యాలెంట్ కావాలి, పరిశ్రమ కూడా అవసరం. ఆ తర్వాత సినిమా వాళ్లు కనపడతారు. దీనికి ట్యాలెంట్, లుక్స్, అదృష్టం ఉండాలి. అది కూడా ఈజీ కాదు.
ఇంకాస్త ముందుకెళ్తే బిజినెస్ పీపుల్, సంపద సృష్టించేవాళ్లూ ఉంటారు. అది కూడా అంత ఈజీ కాదు. దానికంటే ముందు పేజీకి పోతే కొంతమంది ఆఫీసర్స్, ఐ.ఏ.ఎస్ లు కనిపిస్తారు. దానికి కూడా బాగా చదవాలి, పరీక్షలు రాయాలి.
వీటన్నిటికంటే ముందు మొదటి పేజీలో రాజకీయ నాయకులు కనపడతారు. ఈ ఒక్క రంగంలోనే లోయెస్ట్ ఎంట్రీ బ్యారియర్స్…” అంటూ ఎవరైనా ట్రై చేయగలిగే రంగమని చెప్పుకొచ్చారు.
దీనినిబట్టి అర్ధమయ్యేది ఏంటంటే కీర్తి కాంక్ష ఉండి, ఎక్కడా ఫిట్ అయ్యే పరిస్థితి లేకపోతే రాజకీయాల్లో ట్రై చేయొచ్చు అనేది.
ఏ రంగంలోనైనా ప్రతిభ ఉన్నవారే పైకొస్తారనేది సహజం.
అయితే ఎంట్రీ లెవెల్లో ఏ అర్హతలు అవసరం లేకుండా జెండా మోసే పనితోనైనా ఒక పార్టీలోకి వెళ్లిపోవచ్చు.
ఇప్పుడు టాపిక్ ఈ జెండా మోయడం గురించే!
స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే ఉండేవి. క్రమంగా అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు తయారవుతూ వచ్చాయి.
అందులో కొన్ని పురిట్లోనే పోతే కొన్ని దశాబ్దాల పాటు మనుగడ సాగిస్తున్నాయి.
ప్రతి పార్టీకి జెండాలు మోసే యువత ఉండేవారు, ఉంటున్నారు, ఉంటారు కూడా!
ఇక్కడ చిత్తశుద్ధితో రాజకీయాల్లోకి వచ్చేవాళ్లు అతి తక్కువ. కీర్తికండూతి కొంత, పరిచయాలుంటే దేనికైనా పనికొస్తారు కాబట్టి ఏ కార్పొరేటర్ పక్కనో, ఎమ్మెల్యే వెనకనో జెండా మోసే పని కల్పించుకుని వచ్చే యువతే ఎక్కువగా ఉంది.
వీరిలో చాలామందికి రాజకీయ అవగాహన, రాజ్యంగ నిర్మాణం, రాజకీయ నాయకుల బాధ్యతలు..ఇవేవీ తెలీవు. నాలుగేళ్లు జెండా మోసే కార్యకర్తగా ఉంటే కాస్తంత ప్రొమోషన్ వస్తుందని ఆశ. అలా అలా ఎప్పటికైనా కార్పొరేటరో, ఎమ్మెల్యేనో అవ్వాలనే ఆకాంక్ష వీరిలో ఉంటాయి. సినిమాల్లో హీరోకైతే ఏజ్ బారైపోతుందని టెన్షన్ ఉంటుంది కానీ రాజకీయాల్లో ఏజ్ బార్ గొడవ లేదు. ఎన్నాళ్లు ఒక పార్టీని పట్టుకు వేలాడితే అంత అవకాశం వస్తుందనినమ్మే వాళ్లు కోకొల్లలు.
వీళ్లకి ఠికాణా ఎలాగ?
లౌక్యం ఉన్నవాళ్లు ఏ వ్యాపారస్తులకో అవసరమైన పనులు అవి చేస్తూ లోకల్ లీడర్ల దగ్గర లాబీయిస్టులుగా కాలక్షేపం చేస్తూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటూ ఉంటారు.
తక్కిన వాళ్లు జెండా మోస్తూ ఏదో చిరువ్యాపారం చేసుకుంటూ ఉంటారు.
కొందరు మాత్రమే జ్ఞానోదయం కలిగి ..అది తమ కప్పులో టీ కాదని భావించి జెండా పక్కన పెట్టేసి ఏ ఉద్యోగమో చూసుకుంటుంటారు.
ఈ జెండాలు మోసే పని పెట్టుకున్న యువత యొక్క దౌర్భాగ్యమేంటో చూద్దాం.
ఉదాహరణకి పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో జనసైనికుల్ని తెదేపా జెండా మోయమంటున్నాడు. రేపు తెలంగాణాలో భాజపా జెండా మోయమంటే వాళ్లు మోయాలి.
అలాగే చంద్రబాబు తన మనుషుల చేత ఆంధ్రాలో సొంత పార్టీ జెండా మోయించినా, తెలంగాణాలో లోపాయికారిగా కాంగ్రెస్ జెండా మోయమనొచ్చు.
షర్మిల పార్టీ జెండాలు మోసిన యువత రేపు ఆమె కాంగ్రెస్ జెండా మోయమని చెప్తే మోయాల్సి రావొచ్చు.
ఇక్కడ వాళ్లూ వీళ్లూ అనేది లేదు. పదవుల పందేరంలో యువతీయువకులే పావులుగా మారుతున్నారు.
ఈ రాజకీయ ప్రహసనాన్ని చూస్తున్న వారిలో అనేకమందికి వెగటు పుడుతోంది, అసహ్యం కూడా వేస్తోంది. సొంత విధివిధానాలు పెట్టుకున్నా కూడా అవసరానికి వాటిని మడిచి జేబులో పెట్టుకుని ఎవరితో పడితే వారితో పొత్తులు పెట్టుకునే నాయకులా మనల్ని పాలించేది?!
పైగా అడుగడుగునా బూతులు, తిట్లు. హుందాతనానికి వేల మైళ్ల దూరంలో నడుస్తున్నాయి నేటి రాజకీయాలు.
ఈ రాజకీయాలంటే సంక్షేమపథకాలు అందుకునే ప్రజలకి తప్ప తక్కిన వారిలో కొందరికి వినోదం, ఇంకొందరికి విషాదం తప్ప ఏదీ మిగలచడం లేదు.
పేదవారికి ఏమో గానీ, మధ్యతరగతి, ఆ పై తరగుల వాళ్లకి ఎవడొచ్చినా ఒకటే అనే భావనలో ఉంటున్నారు.
పరిస్థితి ఇలాగే ఉంటే రాను రాను ఓటు వేయడాన్ని పై తరగతుల వాళ్లు బాధ్యతగా తీసుకోని దుస్థితి రావొచ్చు.
ఇప్పటికే చాలామంది పోలింగ్ బూతులకొచ్చి ఓటు వేయడానికి ఇష్టం చూపడం లేదు. వాళ్లకి ఏ పార్టీవాడూ నచ్చడం లేదు. పోలింగ్ బూతుకొచ్చి నొటా నొక్కడానికి కూడా వాళ్లకి చిరాకుగానే ఉంటోంది.
ఈ బాపతు జనం మున్ముందు ఇంకా పెరగొచ్చు.
అప్పుడు ఈ దేశ రాజకీయమనేది కేవలం పేదలకే పరిమితమైపోయే అవకాశముంది. ఆ ఫీలింగ్ బలపడితే ఈ దేశంలో బతికి ట్యాక్సులు కట్టడానికి తప్ప దేనికీ పనికిరామనే భావన కలిగి అవకాశమున్నవాళ్లు విదేశాలకి చెక్కేసే ప్రమాదాలున్నాయి. ఇప్పటికే గోల్డెన్ వీసాలు, ట్యాక్స్-ఫ్రీ పౌరసత్వాల పేరుతో ఆ తంతు నడుస్తోంది. రేపు పరుగెట్టొచ్చు.
ఈ పరిస్థితిలో మార్పు తీసుకురాగలిగే దమ్ము ఎవరికుంది? ఇంకెవరికి..జెండాలు మోసే యువతకే.
తమ నాయకులు ఏది చెబితే అది బానిస కుక్కల్లాగ చేయాల్సిన అవసరముందా?
ఒక పార్టీని అభిమానించి జెండా ఎత్తుకున్నాక చిత్తశుద్ధితో ఆ పార్టీ ఎదుగుదలకి కృషి చేసే క్రమంలో తమ నాయకుడు ప్రత్యర్ధి-పార్టీ జెండా మోయమంటే గళమెత్తి నినదించే రోజు రావాలి.
బానిస శృంఖలాలు తెంచుకుని బయటకు రావాలి.
జెండా మోసే వాళ్ల మనొభావల్ని బట్టి నాయకులు నడుచుకోవాలి తప్ప రివర్సులో కాదు.
అప్పుడు తప్ప రాజాకీయంలో ఒక పద్ధతి పాడూ కనపడవు.
ఇది ఫలానా పార్టీ జెండాలు మోసే యువతని ఉద్దేశించో, ఫలానా నాయకుడి వైఖరిని ఖండించాలనో చెబుతున్నది కాదు.
కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు..కచ్ నుంచి అరుణాచలం వరకు ఉన్న అన్ని పార్టీల జెండాలు మోసే యువతకి ఇది వర్తిస్తుంది.
ఒక తలకాయ వేయి తలల్ని శాసిస్తే అది రాచరికమవుతుంది.
వేయి తలలు ఒక తలని శాసిస్తే అది ప్రజల పాలన అవుతుంది.
ప్రస్తుతం జెండా మోసే యువత మొదటి విధానంలో ఉన్నారు.
వారంతా ఏకమై రెండో విధానాన్ని తీసుకురావాలి.
కాబట్టి జెండాలు మోయడం తప్పు కాదు! కోరుకున్న రంగంలో ఆసక్తితో రావడమూ తప్పు కాదు. అయితే జెండాల్ని మోయాల్సిన విధంగా మోయాలి. అవసరమైతే తమ శక్తితో తప్పుదారిలో పొత్తులే పరమావధిగా వెళ్తున్న నాయకుల నోళ్లను మూయాలి.
– శ్రీనివాసమూర్తి