కొన్ని విషయాలను అర్థం చేసుకుంటే జీవితంలో పరిణతి దక్కుతుంది. అలాగే కొన్ని నిజాలను ఒప్పుకోగలిగితే ప్రశాంతత లభిస్తుంది. వీటిని ఒప్పుకోవడానికి ఎప్పుడైతే ఒప్పుకోమో అప్పుడే మానసిక అలజడి చెలరేగుతుంది. ప్రశాంతత లేకుండా పోతుంది. మనం కొన్నిటిని విస్మరించడం వల్లనే ఇలాంటి అశాంతికి లోనవుతున్నామనే విషయాన్ని గ్రహించగలిగిన వారు నిజంగా దృఢచిత్తులవుతారు. మరి ఆ కఠినమైన ఆమోదించాల్సిన ఆరు జీవిత సత్యాలేమిటంటే!
ఏదీ శాశ్వతం కాదు!
ఇదేదో భైరాగి తత్వం కాదు కానీ, ప్రస్తుతం మనం గడుపుతున్న ఆనందం అయినా, దుఃఖం అయినా శాశ్వతం కాదని, అనుభవిస్తున్న భోగం, లేదా దరిద్రం రెండూ పర్మినెంట్ కాదనే విషయాన్ని గుర్తెరగాలి. అసలు జీవితమే శాశ్వతం కాదు, అలాంటిది పరిస్థితులు, పరిణామాలు ఎంత? ఈ విషయాన్ని గ్రహిస్తే వేదాంతులు అయిపోరు, నిరాశ పడే సందర్భాలు అయితే కచ్చితంగా తగ్గవచ్చు!
మీ ఆనందానికి మీరే కారకులు!
మీ ఆనందానికి మీరే కారణం అనే విషయాన్ని గ్రహిస్తే ఆ తర్వాత జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబం వల్ల, పార్ట్ నర్ వల్ల, స్నేహితుల వల్ల మేం ఆనందంగా ఉన్నామని మీరు అనుకోవచ్చు. అయితే వాళ్లంతా మీకు సపోర్ట్ మాత్రమే! అల్టిమేట్ గా మీ మానసిక ఆనందానికి మీరే కారకులు. ఎవరి వల్లనో ఆనందంగా ఉన్నామని, వారుంటే ఆనందం అనుకోవడం వారి కంపెనీ లేనప్పుడు బాధకు గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది. వ్యక్తిగతమైన అలవాట్లు, అభిరుచుల వల్ల ఆనందంగా ఉండగలిగే వారికి ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ ఉండదు! అలాగని ఏకాకిలో గదిలో కూర్చోమని కాదు, మన ఆనందకరమైన పరిణామాలు ఎప్పుడూ వేరే వాళ్లతో ముడిపడి ఉండకూడదనేది మాత్రం కచ్చితంగా ఒప్పుకోవాల్సిన సత్యం!
అంతా ఇష్టపడరు!
నేను చాలా మంచివాడిని, అందరితోనూ నైస్ గా ఉంటాను, అందరితోనూ కలిసి పోతాను, అందరితోనూ సఖ్యతగా ఉంటాను.. కాబట్టి నన్ను అందరూ లైక్ చేయాలని అనుకోవడం చాలా ఇబ్బందికరమైన అలవాటు. మీ దృష్టిలో మీఅంతటి నైస్ పర్సన్ లేకపోయినా.. పక్కవారి పర్సెప్షన్ లో మీరు ఏ మాత్రం ఆమోదం లేని వ్యక్తి కావొచ్చు. కాబట్టి.. మిమ్మల్ని అంతా ఇష్టపడాలని కానీ, ఇష్టపడతారని మాత్రం భ్రమ చెందవద్దు. మీరెంతటి ఉత్తములైనా అందరి సర్వామోదాన్నీ పొందలేరు!
హార్డ్ వర్క్ అన్ని వేళలా విజయాన్ని ఇవ్వలేదు!
నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా పని చేశాను, నా కన్నా తక్కువ పని చేసిన వారు కూడా ఆ పని విషయంలోనే సక్సెస్ అయ్యారు, నేను హార్డ్ వర్క్ చేసినా నాకు విజయం దక్కలేదనే భావన చాలా మందిలో, చాలా సందర్భాల్లో వ్యక్తం అవుతూ ఉంటుంది. కావొచ్చు.. మీరు హార్డ్ వర్కే చేసి ఉండొచ్చు. అయితే కఠోరమైన శ్రమ ఒక్కటే విజయాలను తెచ్చి పెట్టదు! మీరు శ్రమ పడ్డ పరిస్థితులు, పరిణామాలు కూడా మీ విజయాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి.. హార్డ్ వర్క్ చేసేస్తే విజయం దక్కేస్తుందని ఎవరైనా చెప్పినా నమ్మేయరాదు. అలాంటి శ్రమకు రెడీ అవుతున్నప్పుడే.. పూర్వాపరాలను కూడా కాస్త పరిశీలించుకోవడం తెలివైన వారి పని.
కాంఫ్లిక్ట్స్ మామూలే!
రిలేషన్ షిప్ లో కానీ బాంధవ్యాల్లో కానీ లేదా ఆఫీసుల్లో కానీ.. కొన్ని సార్లు కొందరితో కొన్ని కాంఫ్లిక్ట్స్ వస్తాయి. వాటి విషయంలో తీవ్రంగా మధనపడటం కానీ, అశాంతికి గురి కావడం కానీ టైమ్ వేస్ట్. నేనింతమంచివాడిని కదా నాతో వాదనలా, నేను అంత కష్టపడుతుంటే నాతో ఆర్గ్యుమెంటా అంటూ మీకు మీరే అశాంతికి గురి కావడం పెద్ద పొరపాటు!
అంచనాలు నిరాశను పెంచుతాయి!
ఏ విషయంలో అయినా భారీ ఎక్స్ పెక్టేషన్లు పెట్టుకోవడం, బాగా ఆశించి పని చేయడం లేదా, ఏదో అద్భుతం జరుగుతుందని ప్రయత్నించడం.. వల్ల పెరిగేది నిరాశే తప్ప మరోటి కాదు! పెద్ద ఎక్స్ పెక్టేషన్లు లేకుండా పని చేసుకుపోతే.. ఫలాలు రెట్టింపు ఆనందాన్ని ఇస్తాయి. అయితే అతిగా ఆశించడం వల్ల అంతిమంగా నిరాశే ఎక్కువగా డ్యామినేట్ చేయొచ్చు!