నోరు జారి క్షమాపణ చెప్పిన సుమ

యాంకర్ సుమ యాంకరింగ్ వేరే లెవెల్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీతో పూర్తిగా మమేకం అయిపోయిన కుటుంబం ఆమెది. అందరితోనూ మంచి పరిచయాలు వున్నాయి, గౌరవప్రదమైన సంబంధాలు వున్నాయి. అందువల్ల ఆమె ఓ మాట అటు…

యాంకర్ సుమ యాంకరింగ్ వేరే లెవెల్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీతో పూర్తిగా మమేకం అయిపోయిన కుటుంబం ఆమెది. అందరితోనూ మంచి పరిచయాలు వున్నాయి, గౌరవప్రదమైన సంబంధాలు వున్నాయి. అందువల్ల ఆమె ఓ మాట అటు ఇటుగా అన్నా, చనువు తీసుకుని ఓ చురక వేసినా ఎవ్వరూ పెద్దగా ఫీలవరు. 

పైగా ఆమెనే తమను ఇంటర్వ్యూ చేయాలని, తమ ఫంక్షన్ హోస్ట్ చేయాలని కూడా కోరుకుంటారు. అలాంటి సుమ ఓ అడుగు ముందుకు వేసి మీడియా మీద కూడా ఓ మాట వేసేసారు. నిన్నటికి నిన్న జరిగిన ఓ ఫంక్షన్ లో ఆన్ లైన్ లైవ్ జరుగుతుండగా, కెమేరా జనాలు ఇంకా లోపలకు రాలేదని చటుక్కున ఓ మాట విసిరారు. ‘…స్నాక్స్ ను భోజనాల్లా తింటున్న మీడియా వాళ్లు లోపలకు రావాలి’ అంటూ ఘాటుగానే అన్నారు.

నిజానికి ప్రతి పంక్షన్ అన్న టైమ్ కు జరగవు. గంటలకు గంటలు ఆలస్యం అవుతాయి. అయినా మీడియా జనాలు ఓపిగ్గా కూర్చుంటారు. కేవలం టీమ్ మధ్య వున్న అనుబంధం తప్ప మరేం కాదు. ఇవన్నీ సుమకు తెలియనివి కాదు. ఆమె కూడా మొన్నటికి మొన్న తన కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న ఫంక్షన్ చేసారు. అది కూడా ఠంచనుగా అన్న టైమ్ కు ఏమీ స్టార్ట్ కాలేదు.

ఫంక్షన్ లో రాంగ్ గా కామెంట్ చేసిన విషయాన్ని మీడియా సుమ దృష్టికి తీసుకెళ్లినపుడు కూడా సర్దుకోకుండా, సర్లెండి.. స్నాక్స్ ను స్నాక్స్ లాగే తింటున్నారు.. సరేనా అంటూ మళ్లీ సెటైర్ వేసారు. మళ్లీ అభ్యంతరం పెడితే ఓకె సారీ అని మొక్కుబడిగా చెప్పి ఊరుకున్నారు. ఈ లోగా ఇదంతా సోషల్ మీడియాలోకి వెళ్లడంతో సుమకు డ్యామేజ్ అర్థం అయినట్లుంది. అప్పుడు మళ్లీ ఓ వీడియో ప్రత్యేకంగా వదిలారు.

మొత్తం మీద నోరు జారి, సారీ చెప్పాల్సి వచ్చింది. ఇక మీదట సుమగారు తమ కుమారుడు హీరోగా పరిచయం అవుతున్న ఫంక్షన్ లకు స్నాక్స్ పెట్టకుండా వుంటే సరిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఇక మీడియా లేటుగా రారు. పైగా స్నాక్స్ ఖర్చు కూడా తప్పుతుంది.