భారతీయ జనతా పార్టీ కీలక నేత అమిత్ షా అంటే అపర చాణక్యుడు అన్నదే కదా అందరికీ వుండే అభిప్రాయం. కానీ ఒక్కోసారి ఆయన చర్యలు చూస్తుంటే ఇంత అమాయకుడా అనిపిస్తుంది కదా. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ను స్పెషల్ ఫ్లయిట్ లో హుటాహుటిన ఢిల్లీ రప్పించి, భాజపాతో జనసేన కలిసి పోటీ చేయాలని ఓ మాట చెప్పేసారు. ఒకటి రెండు రోజుల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తారో డిసైడ్ చేసుకోవాలన్నారు.
ఈ పరిస్థితి చూస్తుంటే ముందుగా అయ్యో… భాజపా అనిపిస్తోంది. ఎందుకంటే కొన్ని నెలల క్రితం వరకు తెలంగాణలో ప్రధాన ప్రత్యామ్నాయంగా కనిపించిన భాజపా ఇప్పుడు జనసేనకు కావాల్సిన సీట్లు ఇచ్చేసే పరిస్థితికి చేరుకుంది. జనసేన లేకుండా పోటీ చేయలేని బలహీనతను స్వంతం చేరుకుంది. ఒక్క సీటు గెలవని పార్టీ లీడర్ ను స్పెషల్ ఫ్లయిట్ లో రప్పించేందుకు సిద్దపడింది.
ఈ పరిస్థితి చూస్తుంటే భాజపా కేవలం సెటిలర్స్ ఓట్ల కోసం పవన్ ను దగ్గరకు తీస్తోందా? లేక నిజంగానే పవన్ కు తెలంగాణలో ఓటు బ్యాంక్ వుందని నమ్ముతోందా అన్న అనుమానాలు కలగడం సహజం. కానీ అదే సమయంలో సెటిలర్లు అంత అమాయకులా అన్న అనుమానం కలుగుతుంది. సెటిలర్లు తెలివైన వారు. వాళ్లు రాష్ట్రం, వాళ్ల ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ బతుకుతున్నారు అంటే అంతో ఇంతో తెలివైన వారే అయి వుండాలి కదా.
తెలంగాణలో ఇష్టం వున్నా, లేకున్నా, రెడ్ల ఓట్లు పాలరైజ్ అవుతున్నాయి. ఈ రెడ్లలో సీమ రెడ్లు వున్నారు, కోస్తా రెడ్లు వున్నారు. అదే విధంగా కమ్మ సామాజిక వర్గ ఓట్లు కాంగ్రెస్ కు అనుకూలంగా మారిపోయాయని వార్తలు, సర్వేలు కనిపిస్తున్నాయి. సెటిలర్లలో వుండే బస్తీ ఓట్లు లాస్ట్ మినిట్ లో జరిగే ‘పోల్ మేనేజ్ మెంట్’ ను బట్టి వుంటాయి. ఆ విషయంలో భారాస దే పైచేయి. ఇక మిగిలింది సెటిలర్లలోని కాపుల ఓట్లు. ఈ ఓట్లనే పవన్ తీసుకురాగలగాలి అవి ఏ మేరకు అన్నది చూడాలి.
కానీ అదే సమయంలో ఇక్కడ ఇంకో సమస్య వుంది. ‘స్ధానికత’ సమస్య. అవకాశం కుదిరినపుడల్లా భారాస ఈ లోకల్.. నాన్ లోకల్ ఫీలింగ్ ను తెరపైకి తెస్తూనే వుంటుంది. గతంలో భాజపా కూడా అందుకే పవన్ తో తెలంగాణలో పొత్తు వద్దనుకుంది. కానీ ఏం చేస్తాం. విధి బలీయమైనది. వద్దు అనుకున్న పొత్తే ఇప్పుడు అవసరం పడింది. అందువల్ల భారాస చేతికి మళ్లి లోకల్ .. నాన్ లోకల్ ఆయుధం ఇచ్చినట్లే.
ఆ సంగతి అలా వుంచితే పవన్ ముఫైకి పైగా స్థానాలు అడుగుతున్నారు అన్న వార్తలు కూడా వచ్చేసాయి. స్వంతంగానే ముఫైకి పైగా స్థానాల్లో పోటీ చేస్తా అని ప్రకటించి వున్నారు. ఆ స్థానాలు ఏవో కూడా డిసైడ్ చేసుకుని వున్నారు. గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం అన్నట్లు ఆ స్థానాలు ఇచ్చేయడానికి భాజపా రెడీగా వుండొచ్చు. కానీ ఆ స్థానాలు అన్నీ పవన్ గెలవగలరా? ఎందుకు భాజపాకు వున్న ఓటు బ్యాంక్ ఏ మేరకు, అది జనసేనకు ఏ మేరకు బదిలీ అవుతుంది అన్నది సమస్య.
జనసేనకు బలమైన అభ్యర్ధులు కావాలి. వాళ్లు డబ్బులు ఖర్చు చేయగలిగి వుండాలి. ఓట్లు రాబట్టగలిగి వుండాలి. అలా కాకపోతే ఆంధ్ర లో 2019లో జరిగినదే తెలంగాణలో ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు ఆంధ్రలో ఏ విధంగా ముందుకు వెళ్తారు.
భాజపా లోకల్ లీడర్ షిప్ ను కట్టడి చేసి, బలోపేతం చేసి, గత రెండు మూడేళ్లలో అన్ని విధాలా ప్లాన్ చేయడం మానేసి, ఈ లాస్ట్. మినిట్ లో అమిత్ షా లాంటి మేధావి, పవన్ పార్టీ ని పట్టుకుని ఎన్నికలను ఈదేద్దాం అనుకోవడం అంటే అమాయకత్వం అనుకోవాలా? చివరాఖరి ప్రయత్నం అనుకోవాలా?