రాజకీయ నాయకుల మాటలకు కూడా అర్థాలే వేరులే అని భావించాల్సి ఉంటుంది. వారి మాటలు చేతలు పైకి ఒకరకంగా కనిపిస్తే లోన వాటి అంతరార్థం మరొకరకంగా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో- ‘‘పార్టీ మారే ఉద్దేశ్యం లేదని, ఎప్పటికీ భారాసతోనే కలిసి ఉంటామని’’ గులాబీ ఎమ్మెల్యేలు చెబుతున్న మాటలు కూడా అనుమానాస్పదంగా మారుతున్నాయి. కాంగ్రెస్ మంత్రితో వారి భేటీ ఇలాంటి అనుమానాలకు కారణం అవుతోంది.
ఒక పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచిన నాయకులు మరో పార్టీలోకి చేరిపోవడం అనే ప్రక్రియ సాధారణంగా ఎలా జరుగుతూ ఉంటుందో ప్రజలకు తెలుసు. కొన్ని దశాబ్దాలుగా అవకాశవాద ఎమ్మెల్యేలు ఆలా మారుతూనే ఉన్నారు. ప్రజలు ఆ పరిణామాలు ఎలా జరుగుతున్నాయో గమనిస్తూనే ఉన్నారు. తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి అడగడానికి ముఖ్యమంత్రిని లేదా మంత్రిని కలిసినట్టుగా ఈ ఎమ్మెల్యేలు తొలుత చెబుతారు.
తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సదరు మంత్రి లేదా ముఖ్యమంత్రి నుంచి హామీ లభించినట్లుగా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వాళ్లు అధికార పార్టీలో చేరడం అనేది ఆటోమేటిగ్గా జరిగిపోతుంటుంది. కేసీఆర్ పరిపాలన సాగుతున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఇదే తరహాలో గులాబీ దళంలో చేరారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు వచ్చింది. గులాబీ పార్టీని ఖాళీ చేసి ఎమ్మెల్యేలందరినీ తమలో కలుపుకోవడానికి ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలను సిరాయింపజేసి కాంగ్రెసులో కలుపుకున్న రేవంత్ రెడ్డి తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకున్నారు.
ఒకవైపు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉండగా మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు కొందరు మంత్రి శ్రీధర్ బాబును కలిసి తమ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల గురించి నిధులు విడుదల చేయడానికి సంప్రదించారు. అయితే వారినందరినీ కూడా తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరమని, మీ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అనడం గమనార్హం.
మా పార్టీలో చేరితేనే మీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం అని అర్థం వచ్చేలాగా బాధ్యతాయుతమైన ఒక మంత్రి మాట్లాడడం చవకబారుతనం అయినప్పటికీ, ఇవాల్టి రాజకీయాలలో దానిని ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, సుధీర్ రెడ్డి, అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. మంత్రి తమను కాంగ్రెసులో చేరాల్సిందిగా ప్రతిపాదిస్తే ‘పార్టీలో చేరబోము గానీ, మా నియోజకవర్గాల సంగతి చూడండి’ అని వారు విన్నవించినట్లుగా, ‘బిఆర్ఎస్ లోనే కొనసాగుతామని’ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆఫర్ ని వీరు తిరస్కరించినట్టుగా కనిపిస్తున్నారు కానీ, వీరిలో కేసీఆర్ తో సమావేశానికి కూడా హాజరు కాకుండా ఎగ్గొట్టిన కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా కాంగ్రెసులో చేరిపోవడం ఖరారే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.