అధికారంలో ఉన్నప్పుడు తన పార్టీ నాయకుల మాట వైఎస్ జగన్ వినలేదు. జగన్ మాట జనం పట్టించుకోలేదు. ఫలితం వైసీపీకి దారుణ ఓటమి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా జనం మాటకు తలొగ్గాల్సిందే. నేను సీతయ్య… ఎవరి మాట విననంటే, అలాంటి వారి స్థానం ఏంటో జనం మాట్లాడకుండానే, బుద్ధి చెబుతారు. అందుకే ఎంత మొండి నాయకులైనా జనం దగ్గరికి వచ్చే సరికి .. చేతులు కట్టుకుని వినయ విధేయలతో నిలబడాల్సిందే.
వైఎస్ జగన్ తమ మాట వినకపోవడం వల్లే వైసీపీ ఓటమి మూట కట్టుకోవాల్సి వచ్చిందని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వాపోవడం చర్చనీయాంశమైంది. వైసీపీ ఓటమికి కారణాలను నిర్మొహమాటంగా ఆయన వివరించడం విశేషం. బీఎన్ రహదారి గోతులే తన ఓటమికి ప్రధాన కారణంగా ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందు జగన్‌కు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని ఆయన అన్నారు. ఫలితంగానే భారీ ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయామని ఆయన చెప్పుకొచ్చారు. ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయని ఆయన అంగీకరించారు. వాటిని సరిదిద్దుకోలేకపోయామన్నారు.
ఓటమిపై నిర్మొహమాటంగా విశ్లేషించుకోవడం అంటే ఇదే. కానీ జగన్ మాత్రం ఇన్ని లక్షల మందికి ఆ పథకాన్ని ఇచ్చాం, ఈ పథకాన్ని ఇచ్చామని పదేపదే అంటున్నారు. వాళ్ల ఓట్లన్నీ ఏమయ్యాయని ఆయన అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందించినంత మాత్రాన ఓట్లు వేస్తారని అనుకోవద్దని జగన్ ఓటమి ఓ గుణపాఠం. వాటితో పాటు ప్రజలు కనీస సౌకర్యాలు కోరుకుంటారు. వాటిని విస్మరిస్తే జనాగ్రహానికి గురి కావాల్సి వుంటుంది.
అలాగని జగన్ పరిపాలనలో మంచే జరగలేదనడం న్యాయం కాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు జగన్ పాలనలోనే చోటు చేసుకున్నాయి. అయితే ఉపాధ్యాయుల ప్రయోజనాల విషయానికి వచ్చే సరికి సరిగా డీల్ చేయకపోవడంతో వ్యతిరేకత వచ్చింది. దీనికి తోడు ప్రవీణ్ ప్రకాశ్ అనే ఐఏఎస్ అధికారి చేష్టలు వైసీపీ ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డ పేరు తీసుకొచ్చాయి.
మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పినట్టు రహదారులు అధ్వానంగా ఉన్నా పట్టించుకోలేదనే కోపం ప్రజల్లో వుండింది. రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనుల విషయంలో జగన్ పట్టించుకోలేదన్నది వాస్తవం. వీటి గురించి జగన్‌కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పట్టించుకోలేదు. చేజేతులా ఘోర ఓటమిని జగన్ కొని తెచ్చుకున్నారన్నది వాస్తవం. కరణం ధర్మశ్రీలా జగన్ కూడా ఆలోచించాల్సి వుంటుంది.
గతంలో పాదయాత్ర సందర్భంగా “నేను విన్నాను.. నేను ఉన్నాను” అనే నినాదంతో జనంలో భరోసా నింపిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే మరిచిపోయారు. తాడేపల్లిలో ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో జనంలో కోపం కట్టలు తెంచుకుంది. తామెంతో అభిమానించే నాయకుడికి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరూ ఆలోచించారు. ఇది కేవలం జగన్‌పై వ్యతిరేక ఓటే తప్ప, కూటమి అనుకూల ఓటు మాత్రం కాదు.
ఇప్పటికైనా ఓటమిపై జగన్ హృదయావిష్కరణ చేసుకోవాలి. ఇంత వరకూ జగన్ ఎప్పుడూ కార్యకర్తలనే మాట ప్రస్తావించలేదు. ఎంతసేపూ పైన దేవుడున్నాడు, కింద ప్రజలున్నారని అంటూ వచ్చారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అంతే తప్ప, కార్యకర్తలే ప్రాణమని అనడంలేదని వారు ఆవేదనతో గుర్తు చేస్తున్నారు. జగన్‌లో మొదట రావాల్సిన మార్పు ఇది. ఇలా తనను మార్చుకోవడం మొదట మొదలు పెట్టాలి. మళ్లీ అధికారంలోకి రావాలంటే, తన పాలనలో జరిగిన తప్పొప్పులపై నిజాయితీగా జగన్ సమీక్షించుకోవాల్సి వుంటుంది. వీటిపై జగన్, వైసీపీ భవిష్యత్ ఆధారపడి వుంటాయి.