సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీలో భారీ మార్పులు అవసరమనే చర్చ జరుగుతోంది. ఇదే కోణంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆలోచిస్తున్నారని సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లుగా, అలాగే జిల్లా అధ్యక్షులుగా కొత్త వారిని, సమర్థవంతుల్ని నియమించడానికి జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి మార్పునకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో పెనమలూరు నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అక్కడి నుంచి తప్పించారు. మైలవరం ఇన్‌చార్జ్‌గా జోగిని నియమించారు. చాలా కాలంగా మైలవరం బాధ్యతల్ని అప్పగించాలని జగన్‌ను జోగి రమేశ్ కోరుతున్నారు. ఇది జోగి సొంత నియోజకవర్గం. అందుకే వసంత కృష్ణప్రసాద్, జోగి రమేశ్ మధ్య విభేదాలు నాడు చోటు చేసుకున్నాయి. ఈ విభేదాలే వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడేలా చేశాయి.
పెడన నుంచి గెలిచిన జోగి రమేశ్ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడాన్ని వసంత కృష్ణప్రసాద్ అంగీకరించలేదు. ఇద్దరి మధ్య విభేదాలు చినికిచినికి గాలివానగా మారినట్టు… చివరికి పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. పెనమలూరు నుంచి సిటింగ్ ఎమ్మెల్యే, నేడు బాబు కేబినెట్‌లో మంత్రి పార్థసారథిని జగనే బయటికి పంపారు. దీంతో అక్కడ అభ్యర్థి లేకపోవడంతో జోగి రమేశ్‌ను పంపారు. చివరికి అన్ని చోట్ల వైసీపీకి ఓటమి తప్పలేదు.
అభ్యర్థుల ఎంపికలో జగన్ గందరగోళం సృష్టించారు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఏవేవో మార్పులు చేసినా, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వుందని జగన్ అనుకున్నారే తప్ప, తన పాలనే ప్రజలకు నచ్చలేదని ఆయన గ్రహించలేకపోయారు. ఇప్పుడు సరికొత్తగా పార్టీని పునర్నిర్మించుకోడానికి జగన్ కసరత్తు మొదలు పెట్టారు.
పెనమలూరు నుంచి మాజీ మంత్రి జోగి రమేశ్‌ను తప్పించి, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా దేవభక్తుని చక్రవర్తిని నియమించారు. ఎన్నికల ముందు వరకు జగన్ ఒక భ్రమలో ఉన్నారు. తాను ఎవరిని నిలబెట్టినా గెలుస్తారనే అహంకారంతో జగన్ వ్యవహరించారు. అందుకే పెనమలూరులో మాజీ మంత్రి పార్థసారథి, నెల్లూరులో వేమిరెడ్డి ప్రబాకర్‌రెడ్డి దంపతులు, ఒంగోలులో మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, నరసారావుపేటలో లావు కృష్ణదేవరాయలు లాంటి నాయకుల్ని చేజేతులా పోగొట్టుకున్నారు.
ఒకే ఒక్క ఘోర ఓటమి ఆయనకు రాజకీయాలంటే ఏంటో జ్ఞానోదయం కలిగించింది. ప్రజాదరణ కలిగిన నాయకుల్ని, మంచి పేరున్న వారిని పోగొట్టుకుని తప్పు చేశామని బహుశా జగన్‌కు అంతరాత్మ అయినా చెప్పి వుంటుంది. ఇంత వరకూ నాయకులతో మాట్లాడాల్సిన అవసరం లేదనే లెక్కలేనితనంతో జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే తాను మాట్లాడాలని కోరుకున్నా, అటు వైపు నుంచి ముందుకు రాని నాయకులుంటారని తాజా అనుభవాలు ఆయనకు ఎదురవుతాయి.
ఎన్నికల్లో ఓటమికి తన పాలనతో పాటు ఎమ్మెల్యేల దారుణాలు తోడయ్యాయి. అలాంటి వారిని తప్పించి, కొత్త ముఖాల్ని పార్టీ తీసుకొచ్చుకోవాలి. యువ రక్తాన్ని ఎక్కించడంతో పాటు సీనియర్ నాయకుల సలహాల్ని తీసుకోవాలి. కమ్యూనికేషన్ వ్యవస్థని బలోపేతం చేసుకోవాలి. సోషల్ మీడియా బాధ్యతల్ని పద్ధతైన, జర్నలిజంలో అనుభవం ఉన్న వారికి అప్పగించాలి.
ఇంకా వారసులు, తన విధేయులనే పేరుతో పాత వారికే కీలక బాధ్యతలు అప్పగిస్తే, ఇక వైసీపీ భవిష్యత్‌ను మరిచిపోవాల్సిందే. అందుకే జగన్ అడుగులు జాగ్రత్తగా వేయాలి. తనను అభిమానించే వారెవరు? అవసరాల కోసం అంటిపెట్టుకునే వారెవరో జగన్ గుర్తించాలి. పొగడ్తల మాయ నుంచి జగన్ బయట పడాలి.
నిజాలు చేదుగా ఉన్నా, జీర్ణించుకోవాలి. మామ, చిన్నాన్న, పెదనాయన అంటూ పనికిమాలినోళ్లందరికీ పదవులు కట్టబెట్టడం మానేయాలి. సొంత జిల్లా కడపలో దారుణ ఓటమికి బంధువులే కారణమని ఇప్పటికైనా జగన్ గుర్తించాలి. ఇలా అన్ని కోణాల్లో ఆలోచించాలి. అప్పుడే తనకైనా, పార్టీకైనా మంచి భవిష్యత్ వుంటుందని జగన్ గుర్తించాలి. వైసీసీ పునర్నిర్మాణం సందర్భంలో ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి వుంటుంది.