జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ అనుకూల మీడియాకు నిజానిజాలతో సంబంధం వుండేది కాదు. కేవలం వైసీపీపై వ్యతిరేకత సృష్టించడమే ఏకైక లక్ష్యంగా ఆ మీడియా పని చేసింది. అందులో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే మీడియా ధోరణి మారింది. ఆ చంద్రబాబు రాజగురువు పత్రికకు పింఛన్ల లబ్ధిదారుల్లో అక్రమార్కులు కనిపిస్తున్నారు. చంద్రబాబు సర్కార్‌పై వ్యతిరేకత లేకుండా, అక్రమార్కులు కాబట్టే పింఛన్ రాకుండా వేటు వేశారన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ఈనాడు పత్రిక కథనాలు మొదలు పెట్టింది.
ఇప్పుడు జిల్లా సంచికల్లో పింఛన్ల లబ్ధిదారులపై ఆ పత్రిక వ్యతిరేక కథనాలను రాయడం మొదలు పెట్టింది. చంద్రబాబునాయుడి మార్క్ పాలన అంటే ఇదే. చంద్రబాబు సర్కార్ తన చేతికి మట్టి అంటకుండా, కోతలన్నీ అనుకూల మీడియా ద్వారా చేయించడానికి వ్యూహాత్మకంగా నడుచుకుంటోంది. పింఛన్ సొమ్మును వెయ్యి రూపాయలు పెంచడం, అలాగే అన్ని రకాల లబ్ధిదారులు 65 లక్షలకు పైబడి వుండడంతో ప్రభుత్వానికి పెనుభారంగా మారింది.
వీరికి తోడు 50 ఏళ్లు పైబడిన బీసీలకు కూడా పింఛన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో లబ్ధిదారులు మరింత మంది పెరగనున్నారు. ఈ నేపథ్యంలో భారీ కోత విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పింఛన్ బడ్జెట్ తగ్గించుకోవడంతో పాటు మాట నిలబెట్టుకున్నారనే పాజిటివ్ ప్రచారం జరగాలంటే ఏం చేయాలనే ఆలోచన ప్రభుత్వ పెద్దల్లో మొదలైంది. అందుకే పెన్షనర్లలో అక్రమార్కులపై వేట మొదలు పెట్టారు.
ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాకు భార్యాభర్తలు పింఛన్ కోసం విడిపోయినట్టు కనిపిస్తున్నారు. అలాగే ఒంటరి మహిళలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆధార్‌లో మార్పులు చేసుకుని, పింఛన్ పొందడాన్ని గుర్తిస్తున్నారు. దివ్యాంగుల పింఛన్లలో లెక్కలేనన్ని అవకతవకలు టీడీపీ అనుకూల మీడియాకు కనిపించడం గమనార్హం. ఇంకా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో కూడా అక్రమార్కులున్నారని ఆ పత్రిక కథనాలు రాస్తోంది.
ఇలా నిత్యం కథనాలు రాస్తూ, నిజమే కదా, అవతకవకలకు పాల్పడిన వారిని అనర్హులుగా ప్రకటిస్తే తప్పేంటనే అభిప్రాయం కలిగించేలా ప్రభుత్వ పెద్దలు తమ అనుకూల మీడియా ద్వారా సరికొత్త మైండ్ గేమ్‌కు తెరలేపారు. రానున్న రోజుల్లో భారీగా పింఛన్ లబ్ధిదారుల్లో కోత విధించడం ఖాయమని ఆ మీడియా కథనాలు చదివితే అర్థమవుతోంది.