టీటీడీలో విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. టీటీడీ స్థానిక విజిలెన్స్ అధికారులపై నమ్మకం లేకపోవడంతో రాష్ట్ర పెద్దలు… రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారులను రంగంలోకి దింపారు. ముఖ్యంగా టీటీడీ ఇన్‌చార్జ్ ఈవోగా పని చేసిన ధర్మారెడ్డి టార్గెట్‌గా సోదాలు నిర్వహించారు. రోజుల తరబడి అన్ని రకాలుగా తనిఖీలు నిర్వహించినా, ప్రభుత్వ పెద్దలు ఆశించిన స్థాయిలో అవకతవలు బయటపడలేదు.
ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి రాష్ట్ర విజిలెన్స్ అధికారులు తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో ఖంగుతిన్న ప్రభుత్వ పెద్దలు, విజిలెన్స్ అధికారులు చెప్పిందాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా ధర్మారెడ్డిని ఇరికించేందుకు అక్రమాల్ని వెతికి పట్టుకోవాలని, అంత వరకూ విజిలెన్స్ తనిఖీలు చేయాల్సిందే అని ఆదేశాలు ఇచ్చారని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా 30 మంది బృందంతో కూడిన విజిలెన్స్ అధికారులు మరోసారి టీటీడీలో దర్శనాలు, సివిల్ వర్క్స్ తదితర వాటిపై ముమ్మర తనిఖీలు చేపట్టినట్టు తెలిసింది.
ఒకవైపు ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు, మరోవైపు టీటీడీలో ఇరికించడానికి ఏవీ లేకపోవడంతో విజిలెన్స్ అధికారులు తలలు పట్టుకుంటున్నారని తెలిసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్కే రోజా ఇద్దరు ముగ్గురు వైసీపీ నాయకులకు మినహాయిస్తే మరెవరికీ మితిమీరి దర్శనాలు ఇచ్చిన దాఖలాలు లేవు.
అయితే వీటిని అవినీతి కింద జమ కట్టడానికి కేసులో బలం వుండదని విజిలెన్స్ అధికారులు చెప్పారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో అక్రమాలు జరగాయని నిరూపించడానికి విజిలెన్స్ అధికారులకు ఇంకెంత సమయం పడుతుందో చూడాలి.