ఆంధ్రప్రదేశ్‌లో అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ పార్టీల నాయకుల జోక్యం శ్రుతిమించుతోంది. తాజాగా తిరుపతిలో తిరుపతి, చిత్తూరు జిల్లాల టూరిజం అధికారులతో సంబంధితశాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొనడం వరకూ ఓకే.
కానీ జనసేన నాయకులు కూడా అధికారిక కార్యక్రమంలో చొరబడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కందుల దుర్గేశ్, అలాగే ఆరణి శ్రీనివాసులు జనసేన ఎమ్మెల్యేలు. కందుల దుర్గేశ్ జనసేన నాయకుడు కావడంతో ఆయన్ను స్థానిక పార్టీ నాయకులు కలవడంపై ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన అవసరం లేదు. అలాగని మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు అధికారిక కార్యక్రమంలో పాల్గొని పెత్తనం చేస్తామంటే ఎలా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
పర్యాటక శాఖ అధికారులతో మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో జనసేన అధికార ప్రతినిధులు పసుపులేటి హరిప్రసాద్, కీర్తన ఫ్రంట్ లైన్‌లో ఆసీనులయ్యారు. ఇదే సమావేశంలో వెనుక వరుసలో కిరణ్ రాయల్, ఎన్వీ ప్రసాద్, శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్ వినూత దంపతులు పాల్గొనడం విమర్శలకు దారి తీసింది. మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకున్న చందంగా… జనసేన నాయకుల తీరు వుందని పౌర సమాజం విమర్శిస్తోంది.
ఇటీవల తిరుపతి ఎమ్మెల్యే ఆరణి అన్న కుమారుడు శివకుమార్ కార్పొరేషన్ కార్యాలయంలో షాడో ఎమ్మెల్యే పాత్ర పోషించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ తిరుపతి జనసేన నాయకుల తీరు మారలేదు. అధికారంలో వున్నాం కదా అని, అధికారిక కార్యక్రమాల్లో అనధికారికంగా పెత్తనం చెలాయిస్తామనే లెక్కలెనితనాన్ని ప్రదర్శిస్తున్నారని తిరుపతి వాసులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలపై గొప్ప మాటలు మాట్లాడే డిప్యూటీ సీఎం దీనిపై ఏం మాట్లాడతారనేది తెలియాలి. ఇప్పటికే పిఠాపురంలో కూడా పవన్ అన్న నాగబాబు ప్రభుత్వ అధికారులతో సమావేశం అయి వారికి దిశానిర్ధేశం చేసిన విషయం తెలిసిందే.