ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాజధాని అమరావతి నిర్మాణం మొట్టమొదటి, చిట్టచివరి ప్రాధాన్య అంశం. ఎవరేమనుకున్నా చంద్రబాబు తన అభిప్రాయాన్ని మార్చుకోరు. అసలు తనకు అపరిమితమైన అధికారాన్ని ఇచ్చిందే అమరావతిని పూర్తి చేయాలని చంద్రబాబు నమ్ముతున్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా కూటమికి ప్రజలు పట్టం కట్టారంటేనే, రాజధాని అమరావతిని జాగ్రత్తగా నిర్మించాలనే ప్రజల ఆకాంక్షను ఓటు ద్వారా చెప్పకనే చెప్పారని చంద్రబాబుతో పాటు కూటమి నేతలు విశ్వసిస్తున్నారు.
అందుకే అధికారం వచ్చిన మొదలు చంద్రబాబు గుండె లబ్డబ్ బదులు… అమరావతి, అమరావతి అని కొట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మనసంతా అమరావతి కమ్ముకుంది. బాబు ఆలోచనల నిండా అమరావతే. ఇప్పుడాయనకు మరే పథకాలు కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతి మినహాయిస్తే మరేదీ గుర్తుండడం లేదు.
ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబునాయుడు కేంద్ర పెద్దలతో మాట్లాడి తనకు కావాల్సింది సాధించుకున్నట్టు ఆయన అనుకూల మీడియా చెబుతోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకు పైగా నిర్మాణ ఖర్చును భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చినట్టు టీడీపీ మీడియా రాసుకొచ్చింది. రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి అమరావతి వచ్చేందుకు రహదారుల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇది ఆచరణలోకి వస్తే మాత్రం అమరావతిలో భూములున్న వారి పంట పండినట్టే. అక్కడ ఎవరెవరికి భూములున్నాయో అందరికీ తెలిసిందే.
జగన్ సర్కార్ రాజధాని తరలిస్తే కొంతమంది ఎందుకు గగ్గోలు పెట్టారో ఏపీలో తెలియని వారుండరు. ఇప్పుడు చంద్రబాబు అందుకే అమరావతి నిర్మాణంపైన్నే ప్రత్యేక దృష్టి సారించారు. మిగిలిన హామీలు ఎలా వున్నా, అమరావతిలో భూములున్న వారి పంట పండడానికి మాత్రం ఎలాంటి డోకా వుండదు. ఇందుకు తాజాగా చంద్రబాబు సాధించుకొచ్చారని జరుగుతున్న ప్రచారమే నిదర్శనం.