ప్రధాని మోదీని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అనుసరిస్తున్నారు. ఆధ్యాత్మికం విషయంలో మోదీ పద్ధతుల్ని అనుసరించి ప్రజల అభిమానాన్ని చూరగొనాలనేది పవన్ ఉపాయం. దైవ సంబంధిత విషయాల్లో లీనమయ్యే నాయకుల్ని ప్రత్యేకంగా ఆరాధించడం మన దేశం ప్రత్యేకత. ఎన్నికల సందర్భంలో మోదీ వేషధారణ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నికల తంతు ముగిస్తే ప్రధాని మోదీ దైవ నిష్ట వేషధారణ నుంచి బయటికొస్తారు.
జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కొన్ని రోజులుగా కాషాయ వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శుక్రవారంతో వారాహి ఏకాదశ దిన దీక్షోద్వాసన క్రతువుతో ముగిసింది. ఆ వెంటనే ఆయన చాతుర్మాస దీక్ష చేపట్టనున్నారని జనసేన నాయకులు తెలిపారు. ఒకవైపు అధికారిక కార్యకలాపాలు కొనసాగిస్తూనే, మరోవైపు శుభతిథుల్లో మాత్రం దీక్ష వస్త్రాలను ధరించనున్నట్టు వారు తెలిపారు.
ఒకదాని తర్వాత మరొక దీక్షను పవన్‌కల్యాణ్ చేపట్టడం చూస్తే, ప్రధాని మోదీని గుర్తు తెస్తున్నారు. భక్తి సంబంధ విషయాలు ప్రజల్ని ఏకం చేస్తాయి. రాజకీయంగా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బీజేపీ ఎజెండానే ప్రజల దైవ సెంటిమెంట్ అని తెలిసిందే. అయోధ్యలో రామాలయ నిర్మాణం పేరుతో దేశంలో మెజార్టీ హిందూ సమాజంలో సెంటిమెంట్ రగిల్చి రాజకీయంగా బీజేపీ లబ్ధి పొందింది. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది.
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడ్డం అంటే, హిందువులకు వ్యతిరేకమనే భావనను క్రియేట్ చేయడమే పనిగా బీజేపీ పెట్టుకుందని కాంగ్రెస్ తీవ్ర విమర్శ చేస్తోంది. ఇటీవల హిందుత్వం కేంద్రంగా రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో చేసిన కామెంట్స్ ఎంత వివాదం అయ్యాయో తెలిసిందే.