తేడా వస్తే రేవంత్‌రెడ్డిపై తెలంగాణ ద్రోహి ముద్ర!

ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబునాయుడు, రేవంత్‌రెడ్డి మ‌ధ్య సంబంధాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. రేవంత్‌రెడ్డి అంగీక‌రించ‌క‌పోయినా… ఆయ‌న్ను రెండు తెలుగు రాష్ట్రాలు చంద్ర‌బాబు శిష్యుడిగానే చూస్తాయి. ఏపీ విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ టీడీపీ…

ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబునాయుడు, రేవంత్‌రెడ్డి మ‌ధ్య సంబంధాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. రేవంత్‌రెడ్డి అంగీక‌రించ‌క‌పోయినా… ఆయ‌న్ను రెండు తెలుగు రాష్ట్రాలు చంద్ర‌బాబు శిష్యుడిగానే చూస్తాయి. ఏపీ విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి కీల‌క పాత్ర పోషించారు. అప్ప‌ట్లో టీడీపీ కోసం రేవంత్‌రెడ్డి ప‌డిన క‌ష్టాలు అన్నీఇన్నీ కావు. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరి, రాజ‌కీయంగా నిల‌దొక్కుకున్నారు. ఇవాళ ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం నిమిత్తం చ‌ర్చించుకుందామ‌ని చంద్ర‌బాబు పిలుపు ఇవ్వ‌డం, అందుకు రేవంత్‌రెడ్డి అంగీక‌రించ‌డం తెలిసిందే. శ‌నివారం హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబు, రేవంత్‌రెడ్డి కీల‌క భేటీ నిర్వ‌హించ‌నున్నారు. ఈ భేటీపై రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతున్నారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల నాయ‌కులు డేగ క‌న్ను వేశారు.

స‌మ‌స్య‌ల ప‌రిష్కారం పేరుతో త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను బ‌లి పెడితే మాత్రం… రాష్ట్ర ద్రోహిగా ముద్ర వేయ‌డానికి రాజ‌కీయ ప‌క్షాలు కాచుక్కూచున్నాయి. ఇదే హెచ్చ‌రిక‌ను సీపీఐ జాతీయ నాయ‌కుడు కె.నారాయ‌ణ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌ను హెచ్చ‌రించారు.

రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల భేటీ ముఖ్యంగా రేవంత్‌రెడ్డికి క‌త్తిమీద సాములాంటిద‌ని హెచ్చ‌రించారు. ఏ మాత్రం తేడా వ‌చ్చినా రేవంత్‌రెడ్డిపై తెలంగాణ ద్రోహి అనే ముద్ర వేస్తార‌ని ఆయ‌న అప్ర‌మ‌త్తం చేశారు. నీటి స‌మ‌స్య‌, భ‌ద్రాచ‌లం, విభ‌జ‌న స‌మ‌స్య‌లున్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. పోల‌వ‌రం నిర్మిస్తే భ‌ద్రాచ‌లం మునిగిపోతుంద‌ని ఇప్ప‌టికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అలాగే ఇరు రాష్ట్రాల్లో అనుమ‌తులు లేకుండా కొన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. వాటిపై ప‌ర‌స్ప‌రం కేంద్ర జల‌వ‌న‌రుల‌శాఖ‌కు ఫిర్యాదు చేసుకున్నాయి.

అలాగే రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌పై తెలంగాణ అభ్యంత‌రం చెప్పింది. శ్రీ‌శైలం విద్యుత్ ఉత్ప‌త్తిపై రెండు రాష్ట్రాలు ప‌ర‌స్ప‌రం కొట్టుకునేంత ప‌ని చేశాయి. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌లిపిన తెలంగాణ గ్రామాల స‌మ‌స్య తెర‌పైకి వ‌చ్చింది. ఏపీకి రావాల్సిన వేల కోట్ల విద్యుత్ బ‌కాయిల సంగ‌తి తేలాల్సి వుంది.

ఇందులో ఏ ఒక్క స‌మ‌స్య‌పై అయినా , ఎవ‌రు త‌లొగ్గినా ఆ రాష్ట్ర ద్రోహిగా మిగులుతారు. ముఖ్యంగా తెలంగాణ‌లో ప్రాంతీయ సెంటిమెంట్ ఎక్కువ‌. అందుకే రేవంత్‌కు నారాయ‌ణ హెచ్చ‌రిక చేయ‌డం. బాబు కోసం రేవంత్‌రెడ్డి స‌మ‌స్య‌ల్ని కొని తెచ్చుకుంటారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.  ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఏం చ‌ర్చిస్తారో, ఎలాంటి ప‌రిష్కారం చూపుతారో మ‌రి.