సినీ నటుడు తెలివైన వాడు. అలీ చిన్నతనం నుంచి కష్టపడి సినీ రంగంలో ఏ అండా లేకుండా ఎదిగిన వాడు. బాల నటుడిగా , కమెడియన్‌గా రాణించి హీరో అయ్యాడు. హీరోగా తనని ఎక్కువ కాలం చూడరని సత్యాన్ని గ్రహించి వెనక్కి వెళ్లి కామెడీలో స్థిరపడిన లౌక్యుడు. అందరితో మంచి స్నేహ సంబంధాలు నడిపి, ప్రముఖ దర్శకులు, హీరోల సినిమాల్లో అలీకి ఒక పాత్ర వుండేలా చూసుకున్నాడు. ముఖ్యంగా పవన్ సినిమాల్లో అన్నింటిలో కనిపించాడు.
సినిమా నటులకి ఒక దశ దాటిన తర్వాత వెర్రి మొదలవుతుంది. తాము ఇంతకు మించి అనుకుంటారు. చుట్టూ వున్న వాళ్లు గాలి కొడతారు. హీరోలు మొదలుకుని మామూలు నటుల వరకు రాజకీయాల వైపు మళ్లుతారు. ఎందుకంటే డబ్బు, పవర్, గ్లామర్ వుండేది సినిమాల తర్వాత రాజకీయాల్లోనే. అలీ కూడా దీనికి మినహాయింపు కాదు.
సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదా అంటే రావచ్చు. తమిళ, తెలుగు రాజకీయాలు సినిమా నటుల పార్టీలతోనే నడుస్తున్నాయి. అయితే సినిమాలు, రాజకీయాలు ఒకటి కాదు. సినిమాలకి లౌక్యం, రిలేషన్స్, సినీ పెద్దల గుడ్ లుక్స్ వుంటే చాలు. రాజకీయాల్లో వ్యూహప్రతివ్యూహాలు వుండాలి. సినిమాల్లో శత్రువులు అజ్ఞాతంగా వుంటారు. రాజకీయాల్లో కనిపిస్తూ వుంటారు.
తెలుగుదేశంతో ప్రారంభమైన అలీ రాజకీయ జీవితం దాదాపు 25 ఏళ్లు. రామానాయుడికి ప్రచారం చేయడంతో మొదలయ్యాడు. తెలుగుదేశంలో ఉన్నంత కాలం అలీకి టికెట్ ఇస్తారని, పదవులు ఇస్తారని అంటూనే ఉన్నారు. అయితే జరగలేదు. సినిమాల్లో ఉన్నంత లౌక్యం రాజకీయాల్లో లేదా? కేవలం కరివేపాకులా వాడుకుని వదిలేశారో తెలియదు.
అయితే ఉన్నట్టుండి వైసీపీలో చేరాడు. రాజ్యసభ ఇస్తారని కొంత కాలం, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని మరి కొంత కాలం గడిచింది. చివరికి ఏమీ లేదు. కనీసం వైసీపీకి ప్రచారం కూడా చేయలేదు. పార్టీ ఓడిపోగానే రాజకీయాలకి గుడ్ బై ప్రకటించాడు.
మళ్లీ తెలుగుదేశంలో చేరుతారా? పాత మిత్రుడు పవన్‌తో చేతులు కలుపుతారా? అనేది ప్రశ్న. పోసాని అంత వివాదాస్పదుడు కాకపోయినా అలీ కూడా శత్రు కూటమిలో ఉన్నాడు కాబట్టి మళ్లీ చేర్చుకుంటారా? అనేది సందేహం. అయితే రాజకీయాలకి స్వస్తి అని అలీ అంటున్నాడు. మరి వెనక్కి వెళితే సినిమా అవకాశాలు మళ్లీ వస్తాయా? సినిమాల్లోని సగం మంది హీరోలు మెగా కాంపౌండ్లోనే ఉన్నారు. వైసీపీ తరపున సినిమాల్లో సాయం చేసే వాళ్లు ఎవరూ లేరు. అలీని దాటి చాలా మంది కమెడియన్స్ వచ్చేశారు. రాజకీయాలు వుండవు. సినిమాలు అనుమానమే, మరి ఏంటి భవిష్యత్?
రాజకీయాలు బలి కోరుతాయి. బలిపీఠానికి సిద్ధపడితేనే దాని జోలికెళ్లాలి. అలీ బేసిక్‌గా నాయకుడూ కాదు, వ్యూహకర్త కాదు. బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ మాత్రమే.