ఆయన ఒక సాధారణ నాయకుడు. చిన్న స్థాయి నుంచి తెలుగుదేశంలో తన పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టి ఈ రోజు అనూహ్యంగా విజయనగరం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో నిలిచారు. రెండున్నర లక్షల ఓట్లకు పైగా భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు.
అతి సామన్య కుటుంబీకుడైన ఆ ఎంపీయే కలిశెట్టి అప్పలనాయుడు. ఆయన తొలిసారి పార్లమెంట్ సమావేశాలకు సైకిల్ మీద వెళ్లారు. పసుపు దుస్తులు ధరించి పార్టీకి పరవశం తీసుకుని వచ్చారు. ఇపుడు అమరావతి రాజధాని కోసం తన మొదటి జీతాన్ని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్ రూపంలో అందించారు. లక్షా యాభై ఏడు వేల రూపాయలను కలిశెట్టి విరాళంగా అందించి బాబు గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
ఆయన గతంలో పాత్రికేయుడుగా పనిచేశారు. అలా టీడీపీ నేతల అభిమాన పాత్రుడై ఈ రోజుకు ఎంపీ అయ్యారు. 2019లో ఆయన ఎచ్చెర్ల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే దక్కలేదు. అది కూడా మంచిదే అన్నది ఇప్పుడు ఆయనకు లభించిన రాజకీయ ఉన్నతాసనం చూస్తే అర్ధం అవుతుంది.
విజయనగరంలో బీసీలు ఎక్కువ. అలా తన సామాజిక వర్గం నుంచి ప్రతినిధిగా గెలిచిన కలిశెట్టి మరింత కాలం రాజకీయం చేసేందుకు వీలుగా తన అడుగులు వేస్తున్నారు. విజయనగరంలో ఎంపీలుగా అత్యధికసార్లు రాజులు ఎంపిక అయ్యారు. టీడీపీ నుంచి కలిశెట్టి ఈసారి నెగ్గడంతో రాజుల కోటలో పాగా వేశారు అని అంటున్నారు.
ఆయన సామాన్యుడి ప్రజా ప్రతినిధిగా గుర్తింపు పొందుతున్నారు. అలాగే పార్టీలో బాబు వంటి వారి మెప్పు అందుకున్నారు. దాంతో విజయనగరం నుంచి చిరకాలం కలిశెట్టి రాజకీయ ప్రస్థానం సాగుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. కలిశెట్టి చిరునామా ఇక మీదట రాజకీయంగా విజయనగరం గానే ఉండబోతోంది అని అంటున్నారు.