కల్కి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అందులో సందేహం లేదు. ఉభయం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సినిమాను నిర్మాత స్వంత రిస్క్ మీద విడుదల చేసుకున్నారు. ఓ అంచనా వేసుకుని, ఆ మేరకు అడ్వాన్స్ లు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ముందుగా తీసుకున్నారు.
సినిమా విడుదలయిన రెండు నెలల్లో ఈ అడ్వాన్స్ లు సెటిల్ చేస్తానని నిర్మాత అశ్వనీదత్ డిస్ట్రిబ్యూటర్లకు మాట ఇచ్చారు. నిజానికి కల్కి సినిమా బజ్, రెండు భాగాలు ఇవన్నీ లెక్కలు వేసుకునే నిర్మాత అడిగిన మేరకు పంపిణీ దారులు అడ్వాన్స్ ఇచ్చారు. పంపిణీ చేసినందుకు గాను పదిశాతం కమిషన్ వుంటుంది. కాస్త ఖర్చులు కట్ చేస్తారు.
సరే, ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కల్కి సినిమా పరిస్థితి ఏమిటి? నైజాం సంగతి పక్కన పెడితే , సీడెడ్, ఆంధ్రల్లో చాలా గట్టిగా రికవరీ కావాల్సి వుంది. లేదూ అంటే తీసుకున్న అడ్వాన్స్ ల్లో కొంత వెనక్కు ఇవ్వడమో, లేదా రెండో భాగానికి అడ్వాన్స్ అన్నట్లు వుంచడమో చేయాల్సి వస్తుంది. నైజాంలో ఇప్పుటికి 60 కోట్ల వరకు రికవరీ వచ్చింది. మరో ఇరవై కోట్ల వరకు టోటల్ రన్ లో వస్తుందని డిస్ట్రిబ్యూటర్ ధీమాగా వున్నారు. అందువల్ల ఇక్కడ సమస్య లేదు.
ఆంధ్రలో 90 కోట్ల మేరకు అడ్వాన్స్ లు తీసుకున్నారు. ఇప్పటికి సగానికి కాస్త అటుగా రికవరీ వచ్చింది. ఉత్తరాంధ్ర బాగుంది కానీ గుంటూరు, నెల్లూరు లాంటి జిల్లాలు అంత ఆశాజనకంగా లేవు. సీడెడ్ పరిస్థితి చూస్తే అక్కడ కూడా సగం దాటింది.
ఈ శని, ఆదివారం కల్కి గట్టిగా లాగాలి. ఈ శని ఆదివారం దాటితో రేట్లు కూడా టోటల్ గా తగ్గిపోతాయి. అందువల్ల గట్టి రికవరీ సాధించాల్సింది ఈ శని, ఆదివారాల్లోనే. అందుకే కల్కి యూనిట్ ఇప్పుడు ప్రచారం మీద దృష్టి పెట్టింది. నార్త్ కు వెళ్లి దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంటర్వూలు ఇచ్చి వచ్చారు. ఇక్కడ టోటల్ మీడియాతో సమావేశం అయ్యారు. కల్కి సెట్ ను మీడియాకు చూపించి, యూ ట్యూబ్ లో కల్కి సినిమా మరోసారి హల్ చల్ చేసేలా ప్లాన్ చేసారు.
ఇలా ఇప్పుడు ఈ శని, ఆదివారాలు కల్కిని కాస్త ముందుకు పుష్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ శని, ఆదివారం కనుక ఆంధ్రలో అయిదు నుంచి పది కోట్ల మధ్యలో వసూలు చేస్తే కనుక, లాంగ్ రన్ లో తీసుకున్న అడ్వాన్స్ లు చాలా వరకు సరిపెట్టుకోవచ్చు అన్నది నిర్మాత ఆలోచన అనుకోవాలి. అందువల్ల ఈ వీకెండ్ కల్కికి కీలకం.