కల్కి సినిమా సక్సెస్ అయిన తర్వాత పార్ట్-2పై అంచనాలు మరింత పెరిగాయి. మరీ ముఖ్యంగా క్లయిమాక్స్ కనెక్ట్ అయిన తర్వాత సీక్వెల్ పై ఊహించుకోవడాలు ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో కల్కి-2లో కృష్ణుడిగా మహేష్ కనిపిస్తాడని, చిరంజీవి కూడా ఈ కథ విన్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై దర్శకుడు నాగ్ అశ్విన్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
కల్కి కథను చిరంజీవికి చెప్పలేదని స్పష్టం చేశాడు దర్శకుడు. ఈ కథను ప్రభాస్ కు తప్ప, వేరే హీరోకు నెరేట్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక మహేష్ బాబు విషయానికొస్తే, మహేష్ కృష్ణుడిగా చేస్తే చాలా బాగుంటుందని అభిప్రాయపడుతూనే, తమ సినిమాలో మహేష్ లేడని ప్రకటించాడు.
కల్కి సినిమాలో ప్రభాస్ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉందనే కంప్లయింట్ ఉంది. దీన్ని నాగ్ అశ్విన్ అంగీకరించాడు. కల్కి-2లో మాత్రం ప్రభాస్ ఫుల్ లెంగ్త్ ఉంటాడని హామీ ఇచ్చాడు.
“కల్కి సినిమాలో ప్రభాస్ స్క్రీన్ టైమ్ పై కామెంట్స్ వచ్చాయి. ఆ విషయం నాకు తెలుసు. పార్ట్-2లో మాత్రం ప్రభాస్ చేసిన భైరవ పాత్ర ఫుల్ లెంగ్త్ ఉంటుంది. కల్కి ప్రపంచాన్ని చూపించి, వివరించే గోల పూర్తయింది కాబట్టి, రెండో పార్ట్ లో నాకు ఆ బాధ లేదు. ఏదైనా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించి కల్కి-2 మొదలుపెట్టినా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. పాత్రలేంటి, ప్రపంచాలేంటి అనేది ఆడియన్స్ కు తెలిసిపోయింది కాబట్టి, పార్ట్-2 మరింత ఫన్ గా ఉండబోతోంది.”
కల్కి-2 సినిమా ఎప్పటికి పూర్తవుతుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేకపోయాడు నాగ్ అశ్విన్. పార్ట్-2 కోసం మరిన్ని ప్రపంచాలు సృష్టించాలని, అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదన్నాడు. మరోవైపు అశ్వనీదత్ మాత్రం కల్కి-2 వచ్చే ఏడాది జూన్ లో వచ్చేస్తుందని ప్రకటించేశారు.