రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న సినిమా తిరగబడరా సామీ. ఈ సినిమా టైటిల్ ఎందుకు పెట్టారో తెలీదు కానీ, నిజజీవితంలో మాత్రం ఈ హీరో తిరగబడ్డాడని అంటోంది లావణ్య. రాజ్ తరుణ్ తో ఈమె 11 ఏళ్లుగా సహజీవనం చేస్తోందట. ఇప్పుడామెను వదిలించుకునే పనిలో పడ్డాడట సదరు హీరో. దీనికి కారణం ఓ హీరోయిన్.
తిరగబడరాసామీ సినిమాలో మాల్వీ మల్హోత్రాతో కలిసి నటించాడు రాజ్ తరుణ్. ఈ హీరోయిన్నే తమ మధ్య చిచ్చుపెట్టిందని ఆరోపిస్తోంది లావణ్య. తన ప్రియుడు రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా చాలా క్లోజ్ అయ్యారనేది ఈమె ఆరోపణ.
రియల్ లైఫ్ లో కూడా చెట్టపట్టాల్..?
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా రియల్ లైఫ్ లో కూడా చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నారని, వాళ్లిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఆరోపిస్తోంది లావణ్య. 11 ఏళ్లు రాజ్ తరుణ్ తో తను శారీరకంగా, మానసికంగా కలిసి ఉన్నానని, రేపోమాపో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న టైమ్ లో మాల్వీ వచ్చి ఎగరేసుకుపోయిందని ఆరోపిస్తోంది.
తిరగబడరాసామీ సినిమా ఇలా స్టార్ట్ అయిందో లేదో, అలా వీళ్లిద్దరి రియల్ లైఫ్ ఎఫైర్ కూడా స్టార్ట్ అయిందని ఆరోపిస్తోంది లావణ్య. కేవలం ఆమెను కలవడానికే రాజ్ తరుణ్ ఎప్పటికప్పుడు ముంబయి వెళ్లాడని, ఇద్దరూ కలిసి గోవా, చెన్నై, పాండిచ్చేరిలో కలిసి తిరిగారని అంటోంది. అక్కడితో ఆగకుండా.. శాంటో మోహన్ వీరంకి అనే దర్శకుడి ఇంట్లో ఇద్దరూ కాపురం కూడా పెట్టారనేది లావణ్య ఆరోపణ.
మరి ఇంత జరుగుతుంటే లావణ్య ఏం చేస్తోంది..?
ఓవైపు ఇంత బాగోతం నడుస్తుంటే, మరి లావణ్య ఏం చేస్తోంది? ఇది ఎవరికైనా వచ్చే డౌట్. దీనికి కూడా ఆమె వివరణ ఇచ్చింది. దాదాపు 7-8 నెలలుగా లావణ్యను దూరం పెడుతున్నాడట రాజ్ తరుణ్. అదే టైమ్ లో మాల్వి మల్హోత్రా కుటుంబం సీన్ లోకి వచ్చిందంట.
మాల్వి తండ్రి, సోదరుడు లావణ్యను బెదిరించారట. రాజ్ తరుణ్ ను వదిలేయాలని, అవసరమైతే కొంత డబ్బు తీసుకొని రిలేషన్ షిప్ ను బ్రేక్ చేసుకోవాలని సూచించారట. మాల్వి మల్హోత్రా సోదరుడు మరో అడుగు ముందుకేసి, లావణ్యను జైళ్లో పెట్టిస్తానని, చంపేస్తానని కూడా బెదిరించాడట.
ఆ తర్వాత ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది లావణ్య. దాదాపు 43 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ కేసులో కూడా రాజ్ తరుణ్ తనను అక్రమంగా ఇరికించాడని ఆరోపిస్తూనే.. అదే టైమ్ లో మాల్వికి రాజ్ మరింత దగ్గరయ్యాడని వాపోయింది.
ఇప్పుడేం కావాలంట…
ఇదంతా అక్టోబర్ లో జరిగితే, ఇప్పుడు లావణ్య సీన్ లోకి వచ్చింది. కోకాపేట్ లోని ఖరీదైన విల్లాలో ఉంటున్న ఈమె, తన ప్రియుడ్ని తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు పోలీసులకు సవివరంగా కంప్లయింట్ ఇచ్చింది. సాక్ష్యాలుగా కొన్ని ఫొటోలు కూడా సమర్పించింది.
రేపోమాపో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న తామిద్దరి మధ్య హీరోయిన్ చిచ్చుపెట్టిందని, తన ప్రియుడు రాజ్ ను తనకు అప్పగించాలని ఆమె వేడుకుంటోంది.
రాజ్ నిజంగానే తిరగబడ్డాడా..?
నిజంగానే రాజ్ తరుణ్ ఈ అమ్మాయి విషయంలో తిరగబడ్డాడా? అలాంటిదేం లేదంటున్నాడు రాజ్ తరుణ్. కొన్నేళ్లుగా తను లావణ్యకు దూరంగా ఉంటున్నానని, ఆమె డ్రగ్స్ తీసుకుంటోందని తెలిసిన తర్వాత పూర్తిగా దూరమయ్యానని అంటున్నాడు.
“2017 తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. ప్రతిదానికి బెదిరించేది, బ్లాక్ మెయిల్ చేసేది. నా పరువు పోతుందని మూసుకొని ఉన్నాను. ఇప్పుడింక నేను భయపడను. నేను కూడా లీగల్ గా ఫైట్ చేస్తాను. మాన్వి కుటుంబ సభ్యులు బెదిరించలేదు. ఈమె (లావణ్య) బెదిరించిన కాల్స్ మాత్రం వాళ్ల దగ్గరున్నాయి. వాళ్లు కూడా ఫిర్యాదు చేస్తారు. 8 ఏళ్ల కిందట మస్తాన్ సాయి అనే అబ్బాయి పెళ్లి చేసుకోవాలని లావణ్య కంప్లయింట్ ఇచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గరుంది. నా తర్వాత అతడితోనే రిలేషన్ లో ఉంది. నా ఇంటిపైనే ఇద్దరూ ఉండేవారు. ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని తెలిసిన తర్వాత, నా పరువు పోతుందని నేనే అక్కడ్నుంచి వెళ్లిపోయాను.”
లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే, ఈరోజు మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చేంత పరిస్థితి తనకు రాదంటున్నాడు రాజ్ తరుణ్. తను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని ప్రకటించాడు. మాన్వి తన సహ-నటి మాత్రమేనని, తామిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని స్పష్టం చేశాడు.