వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఆయన్ను దూరం పెట్టాలనేది అందరి డిమాండ్. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రం ఇవేవీ పట్టనట్టుంది. సజ్జల వల్లే పార్టీ అధికారాన్ని కోల్పోయిందనే అభిప్రాయం చాలా బలంగా ఉందని తెలిసి కూడా, మళ్లీ ఆయన్నే తెరపైకి తేవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు వైసీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొంటారనే సందేశం ఆ పార్టీ నేతలకు వెళ్లింది. దీంతో వైసీపీ నాయకులు నిరుత్సాహం చెందుతున్నారు. ఇప్పటికైనా సజ్జలను దూరం పెట్టాలని ఎంతగా మొత్తుకుని చెబుతున్నా జగన్ పట్టించుకోరా? అని మండిపడుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదానికీ సజ్జలను ముందుకు పెట్టి పాలన సాగించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. తాము జగన్‌ను సీఎంగా ఎన్నుకుంటే, ఆయనకు బదులు సజ్జల పాలించడం ఏంటనే నిరసన, వ్యతిరేకత ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైందన్న వాస్తవాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
ప్రత్యక్ష రాజకీయాలతో సజ్జలకు సంబంధం లేదని, ఆయనకు క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమీ తెలియదని, అలాంటి వ్యక్తితో పార్టీని నడిపించడం ఏంటో ఏమీ అర్థం కావడం లేదని పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు.