‘రాజధాని డ్రామా’ సీజన్ 3: ఆలయాల స్పెషల్

అమరావతి మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి అనేది తమకు పట్టనే పట్టదనే సంకుచితమైన వాదనతో అమరావతి ప్రాంతంలో నిర్వహిస్తున్న ఆందోళనలు 1300 రోజుల…

అమరావతి మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి అనేది తమకు పట్టనే పట్టదనే సంకుచితమైన వాదనతో అమరావతి ప్రాంతంలో నిర్వహిస్తున్న ఆందోళనలు 1300 రోజుల మైలురాయికి చేరుకున్నాయి. అమరావతి కోసం పోరాటం పేరుతో నడిపిస్తున్న బూటకపు డ్రామాల పరంపరలో ఇది సరికొత్త మైలురాయి! 

ప్రతి మైలురాయి వద్ద ఏదో ఒక విలక్షణ కార్యక్రమంతో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నించే రైతుల ముసుగులోని ఆందోళనకారులు- ఈ సందర్భంగా కూడా ఒక కొత్త పనిని నిర్వహించారు! ఆలయాల యాత్రను చేపట్టారు!! అమరావతి రాజధాని పోరాటం పేరుతో ఓటీటీ వెబ్ సిరీస్ ను తలదన్నే రీతిలో వీరి కార్యక్రమాలు ఉంటున్నాయని ప్రజలు నవ్వుకుంటున్నారు. తిరుమల, అరసవెల్లి యాత్రల తర్వాత తాజా ఆలయాల స్పెషల్ యాత్ర అనేది సీజన్ 3 గా పరిగణించలేమో అని నవ్వుకుంటున్నారు.

అమరావతి రాజధాని భూబాగోతం వెనుక ఉన్న వారి వద్ద డబ్బు పుష్కలంగా ఉన్నది. పోరాటం పేరుతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమాన్ని వారు 1300 రోజులుగా నిరాటంకంగా నడిపించగలుగుతున్నారు. అదే సమయంలో.. కేవలం నిరసనలు మాత్రమే కాదు.. యాత్రలు కూడా నిర్వహిస్తున్నారు. 

సమస్య పరిష్కారాన్ని కోరుకునే వారు ప్రభుత్వంతో సానుకూలంగా ఉంటూ ఆదిశగా ప్రయత్నించాలి. కానీ వీరు తీరు అలా లేదు. రాజధాని కోసం పోరాటం పేరుతో ఒక డ్రామాను ప్రారంభించేశారు. ఇప్పుడు దానిని మధ్యలో విడిచిపెట్టడానికి లేదు. పైగా దానికి తెలుగుదేశం పార్టీ ఫండింగ్ కూడా ఉంది. అలాంటప్పుడు పక్కకు తప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే సా..గు..తూ ఉంది. 

వాస్తవంలో ఉద్యమాన్ని ఉద్యమంలాగా నడపడం కంటె.. ఈ అమరావతి పోరాటం చేస్తున్న వాళ్లు.. పలు సందర్భాల్లో ఆధ్యాత్మిక యాత్రా స్పెషల్ టూరు ప్రోగ్రాం లాగా నిర్వహిస్తున్నారు. వారి వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాల మేరకు గుడులకు, ఆలయాలకు టూర్లు నిర్వహించుకుంటూ.. అదే పోరాటం అని భ్రమింపజేస్తున్నారు. 

అటు తిరుమల దాకా పాదయాత్ర చేశారంటే.. అర్థముంది. ఒకవేళ తమ వాదన పట్ల ప్రజల్లో సానుభూతి పొందడానికి ఆ ప్రయత్నం అనుకోవచ్చు. కానీ.. విశాఖ రాజధాని ద్వారా ఏ ప్రాంతమైతే లబ్ధి పొందబోతున్నదో.. ఆ ఉత్తరాంధ్ర వైపు అరసవెల్లి దాకా చేపట్టిన పాదయాత్ర దారుణంగా ఫెయిలయింది. 

రైతుల ముసుగులో పెయిడ్ కూలీలు నడుస్తున్నారని కూడా తేలిపోయింది. ఈ క్రమంలో ఉత్తరాదిలో ప్రముఖ ఆలయాలన్నీ ఓ పదిమంది తుళ్లూరు ప్రాంత వాసులు.. ఆధ్యాత్మిక టూర్లు ప్లాన్ చేసుకుని.. ప్రతి గుడి వద్ద.. అమరావతి బ్యానర్ తో ఓ ఫోటో దిగి.. పచ్చ మీడియాకు పంపుకుని.. అమరావతి రాజధాని కోసం ఉత్తరాది గుడులన్నీ యాత్ర చేసినట్టుగా బిల్డప్ లు ఇచ్చుకున్నారు.

తాజాగా, 1300 రోజులు పూర్తయిన సంద్భంగా.. తమ డ్రామాలో సీజన్ 3 అన్నట్టుగా మరో మారు ఆలయాల స్పెషల్ యాత్ర నిర్వహించారు. వెంకటపాలెం వెంకటేశ్వర స్వామివారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారి ఆలయం, మంగళగిరి నరసింహస్వామి సన్నిధి సందర్శించి.. తమ పోరాటాన్ని ఆలయ యాత్రా స్పెషల్ గా వారు తయారుచేసేశారు. వారు గుడులు తిరగడాన్ని కూడా పోరాటంగా అభివర్ణించుకుంటూ మీడియాలో వార్తలు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ వలన.. 1300 రోజులుగా సాగుతున్న పోరాటానికి రావలసిన విలువ కూడా దక్కకుండా పోతోందని పలువురు అంటున్నారు.