వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఏటికి ఎదురీదుతోంది. తమ పార్టీ అధికారంలో వస్తుందని, రాజన్న రాజ్యం తెస్తామని చెబుతోంది. నిజానికి ఆమె పార్టీ తెలంగాణలో నామమాత్రంగా ఉంది. ఆమె 2021 జూలై 8 న పార్టీ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా నిరుద్యోగులకు ప్రభుతం ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ ఆందోళనలు, ధర్నాలు చేసింది. ఎన్నోసార్లు అరెస్టయింది. నిరాహార దీక్షలు చేసింది. సుదీర్ఘ పాదయాత్ర చేసింది. అయినప్పటికీ ఆమె పార్టీకి ప్రజాదరణ రావడంలేదు. పార్టీలో చేరికలు లేవు. అయినప్పటికీ అధికారంలో వస్తామని గట్టిగా చెబుతోంది. ఎంతటి బలహీనమైన పార్టీ అయినా ఈ మాటే చెబుతుంది. షర్మిల అందుకు మినహాయింపు కాదు.
ఆల్రెడీ ఆమె తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంది. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని చాలాకాలం కిందటే ప్రకటించింది. ఆ జిల్లాలో ఇప్పటికీ వైఎస్సాఆర్ మీద అభిమానం ఉంది కాబట్టి షర్మిల గెలుస్తుందేమో చెప్పలేం. కానీ షర్మిల కలలు కంటున్నట్లు ఆమె పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం. అసలు తెలంగాణా వ్యాప్తంగా వైఎస్సార్ టీపీ పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం కూడా అసాధ్యమే. కానీ షర్మిల మాత్రం ప్రధాన పార్టీలకు దీటుగా మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే …ఆమె ఏపీకి వెళ్ళిపోయి అక్కడ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తుందని ఈమధ్య మీడియాలో కథనాలు చాలా వచ్చాయి. దానికి తగ్గట్లు ఏపీ నాయకులు కూడా షర్మిలను ఆహ్వానించారు.
వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు భుజానికెత్తుకోబోతున్నట్లుగా కొన్ని రోజులుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు కూడా ఇటీవల ఈ విషయంపై స్పందించారు. షర్మిలను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు. షర్మిల చేరికతో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం వస్తుందని.. పార్టీ మళ్లీ బలోపేతం అవుతుందని కేవీపీ అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా చతికిలపడ్డ హస్తం పార్టీకి షర్మిల వల్ల లాభమా… నష్టమా అన్న విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నిజంగానే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి ఎంతోకొంత లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో దళిత ఓటు బ్యాంక్ ప్రస్తుతం జగన్ పార్టీకి అనుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే ఈ ఓటు బ్యాంక్ చీలే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే వాళ్లు కూడా రెండుగా చీలే ఛాన్స్ ఉంది. దీంతో ఏపీలో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి కొంత లాభం చేకూరుతుంది. షర్మిల జరుగుతున్నప్రచారాన్ని ఖండించింది.
తాను తెలంగాణలోనే ఉంటానని, ఇక్కడే రాజకీయాలు చేస్తానని చెప్పింది. తాజాగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పక్కాగా పోటీచేయనున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. గతంలో చెప్పినట్లే.. పాలేరు నుంచే పోటీ చేస్తానని కుండా బద్దలు కొట్టింది. ఇదే పాలేరు మట్టి సాక్షిగా పాలేరు ప్రజలకు వైయస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తానని అన్నది. రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీ రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీలతో రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకొస్తానని చెప్పింది.
మళ్లీ చెబుతున్నా.. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తానంటూ చెప్పింది. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరుస్తానని మాటిస్తున్నా.. రాష్ట్రవ్యాప్తంగా 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేశాను. అతికొద్ది రోజుల్లోనే మళ్లీ ఆ పాదయాత్రను పాలేరులో ప్రారంభించి 4000 కిలో మీటర్లు పూర్తి చేసి పాలేరులోనే ముగిస్తానని మాటిస్తున్నా అని చెప్పింది. పాలేరు నియోజకవర్గంపై దృష్టిసారించిన షర్మిల.. పూర్తి స్థాయిలో అక్కడినుంచే పార్టీ కార్యకలాపాలను నిర్వహించడంతోపాటు.. ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టనున్నట్లు సమాచారం.