అహం బ్రహ్మాస్మి అని స్వాములు అనుకుంటారు. చాలా మంది తీరు ఇలాగే ఉంటోంది. ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాల్సిన వారు కాస్తా జనారణ్యంలో రాజకీయ రణగొణ ధ్వనిలో ఆర్భాటం చేయడమే విశేషం.
స్వాములకు ఇహం మీద చూపు ఉండదు, అహం అంతకంటే ఉండదు. కానీ అంతా దైవం కోసం అంటూనే ఆధ్యాత్మికతలో రాజకీయ రంగులను చూడడంతోనే వ్యవహారం వేరే దారి పడుతోంది. విశాఖ శ్రీ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర వైసీపీ అనుకూలురు అని మిగిలిన స్వాములు అంతా ఆయన మీద గుర్రుగా ఉంటూ వచ్చారు.
వైసీపీ ఓటమి పాలు కావడంతో స్వరూపానందేంద్ర మీద వారు నేరుగా మాటలతో దాడి చేస్తున్నారు. సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆనంద శర్మ అయితే స్వరూపానందేంద్రకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పదిహేను ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ భూములను ఆయన స్వయంగా వెళ్ళి పరిశీలించి వచ్చారు.
ఇపుడు స్వామికి మద్దతుగా కొందరు బయటకు వచ్చారు. సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆనంద శర్మకు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. స్వాములు అంటే అందరికీ సమాజంలో ఆదర్శంగా ఉండాలని చెబుతున్నారు. స్వరూపానందేంద్ర స్వామి పై దుష్ప్రచారం చేయడం పాపం అని అంటున్నారు. ఇది హిందూమత స్వాములపై దుష్ప్రచారంగా పేర్కొంటున్నారు.
కొందరు స్వాముల తీరు మారకుంటే అన్ని వర్గాలు, కులాల వారు బుద్ధి చెబుతామని కూడా హెచ్చరిస్తున్నారు. మీడియా మీటింగ్ పెట్టి మరీ ఈ విధంగా స్వాములకు వార్నింగ్ ఇవ్వడం కొత్త చర్చకు తెర తీస్తోంది. స్వాములకు రాజకీయాలు ఎందుకు అంటున్న వారే రాజకీయ నేతలకు దగ్గరగా ఉన్నారని అంటున్నారు.
ఏపీలో ప్రభుత్వం మారింది. వారు వీరు అయ్యారు.ఇపుడు ఈ రంగుల రాజకీయాల్లో స్వాములు కూడా చేరి సిగపట్లు పట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్న వస్తోంది. స్వాముల మీద గౌరవం తగ్గితే అది మొత్తం హిందూ సమాజానికే చేటు తెస్తుందని ఆస్తిక జనులు హెచ్చరిస్తున్నారు.