విశాఖలోని ప్రతిష్ట కలిగిన విఎమ్మార్డీయే చైర్మన్ పోస్ట్ కోసం టీడీపీ- జనసేన పోటీ పడుతున్నాయి. కేబినెట్ ర్యాంక్ కలిగిన ఈ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతున్నారు ఈ పోస్ట్ పదవీ కాలం రెండేళ్లు. విశాఖ వంటి మెగా సిటీలో అభివృద్ధి కార్యక్రమాలను మొత్తం చూసేదిగా విఎమ్మార్డీయే గా ఉంది. గతంలో విశాఖ నగరాభివృద్ధి సంస్థగా ఉన్న దాన్ని గ్రేడ్ అమాంతం పెంచి విఎమ్మార్డీయే గా మార్చిన ఘనత చంద్రబాబుదే.
ఆయన 2014 నుంచి 2019 మధ్యలో సీఎం గా ఉన్నపుడు ఈ సంస్థకు ఉన్నతి కలిగించారు. కానీ బాబు సీఎం గా ఉండగా చైర్మన్ ని నియమించలేదు. అలా టీడీపీ తమ్ముళ్లకు చాన్స్ దక్కలేదు. అధికారులతోనే పాలన సాగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ వైసీపీ నేతలకు ఈ పదవిని ఇచ్చారు. అలా అయిదేళ్ళ కాలంలో ముగ్గురికి ఈ పదవిని ఇచ్చి జగన్ న్యాయం చేశారు.
ఎంతో ఆశపడిన ఈ పదవి టీడీపీ ఓటమితో దూరం అయింది. ఇప్పుడు అయినా తమకు దక్కాలని తమ్ముళ్ళు అంటున్నారు. ఈ పదవి కోసం రుమాలు వేసిన వారి జాబితా చాలా పెద్దదే ఉంది. ద్వితీయ శ్రేణి నాయకులు అంతా ఈ పదవి కోసమే చూస్తున్నారు. తృతీయ శ్రేణి నేతలు వీఎమ్మార్డీయే బోర్డు లో మెంబర్ గా ఉండాలని ఆశిస్తున్నారు.
అయితే ఈ చైర్మన్ గిరీ కోసం జనసేన కూడా చూస్తోంది. ఆ పార్టీలో కూడా ముఖ్య నాయకులు ఈ కుర్చీ వైపే చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. రెండేళ్ళ కాలపరిమితి కలిగిన ఈ పదవిని ఇపుడే భర్తీ చేస్తే ఈ టెర్మ్ పూర్తి అయ్యేలోగా ముగ్గురికైనా చైర్మన్ గిరీ దక్కుతుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు తొందరగా నామినేటెడ్ పదవుల పందేరం మొదలెట్టాలని కోరుతున్నారు.