కన్ఫ్యూజన్‌కు జనసేనాని పవన్‌కల్యాణ్ పర్యాయపదంగా మారారు. పొత్తులపై రోజుకో మాట ఆయనకే చెల్లింది. చివరికి పవన్‌కల్యాణ్ ఏం చేస్తారోనని టీడీపీ భయంగా వుంది. అసలే గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే… అనే షరతు పట్టుకుని పవన్‌కల్యాణ్ వేళ్లాడుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా పొత్తులపై పవన్ కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ వైఖరి టీడీపీలో బీపీ పెంచుతోంది. సింగిల్‌గా వెళ్లి వీరమరణం పొందలేనని, కావున పొత్తులు తప్పదని తేల్చి చెప్పిన పవన్‌కల్యాణే, ఇప్పుడేమో అధ్యయనం అంటూ కొత్త పల్లవి అందుకోవడంపై టీడీపీ లోతుగా పరిశీలిస్తోంది.
“ఎన్నికల్లో పొత్తుల గురించి ఆలోచించుకునేందుకు ఇంకా సమయం ఉంది. ఒంటరిగా వెళ్లాలా, కలిసి ప్రయాణించాలా అనేది ఇప్పుడు నిర్ణయించేది కాదు. మండల స్థాయిలోనూ సమగ్ర అధ్యయనం చేశాకే పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు.
వివిధ సందర్భాల్లో పవన్‌కల్యాణ్ చేసిన కామెంట్స్‌కు, ఇప్పుడు చెబుతున్నవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని, ప్రతిపక్షాల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యత తనది అని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే పొత్తులపై నిర్ణయాన్ని తనకే వదిలేయాలని, ఏది మంచిదని భావిస్తే ఆ రకంగా ముందుకెళ్తానని పవన్ తన పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు.
ఇప్పుడేమో పొత్తులపై మాట్లాడాల్సిన సమయం ఇది కాదని అంటున్నారు. పార్టీని బలోపేతం చేయడం మానేసి, పొత్తులనే నమ్ముకుని రాజకీయాలు చేసింది ఆయనే. పొత్తులపై తప్ప మరో అంశం మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం చేశాకే పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పడం కామెడీ అనిపిస్తోంది.
అసలు మండల స్థాయిలో ఎవరున్నారని ఆయన చెబుతున్నారో అర్థం కావడం లేదు. పవన్ ఎప్పుడు ఏం మాట్లాడ్తారో ఆయనకే అర్థం కాదు. ఇక జనానికి ఎలా తెలుస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ టీడీపీని మాత్రం పవన్ వ్యాఖ్యలు గందరగోళంలో పడేస్తున్నాయి. చివరికి హ్యాండ్ ఇస్తాడేమో అనే అనుమానం కూడా టీడీపీకి లేకపోలేదు.