‘ముని’వాక్యం: బంధాలు డిజిటల్ అందాలు

‘‘నా చిన్నతనంలో..’’ అని ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పడం మొదలు పెడితే గనుక.. శ్రోతల/పాఠకుల తరానికి ఊహకు అందని జీవనశైలులు గడిపినంతటి ముసలివాళ్లు అని మనకు ఇట్టే అర్థమైపోతుంది. కాబట్టి అలాకాకుండా ‘‘పూర్వం…

‘‘నా చిన్నతనంలో..’’ అని ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పడం మొదలు పెడితే గనుక.. శ్రోతల/పాఠకుల తరానికి ఊహకు అందని జీవనశైలులు గడిపినంతటి ముసలివాళ్లు అని మనకు ఇట్టే అర్థమైపోతుంది. కాబట్టి అలాకాకుండా ‘‘పూర్వం మన సమాజంలో..’’ అని మొదలు పెట్టుకుందాం. 

మానవ అనుబంధాలు అన్నీ కేవలం ‘మానవీయ’ రూపంలోనే ఉండేవి. మనిషిని మనిషి నేరులో కలవడం ఉండేది. శుభకార్యాలు గట్రా మాత్రమే కాదు.. తమ తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విరామం దొరికే ప్రతి సందర్భంలోనూ మిత్రబంధువులను కలవడం అనేది ఒక వ్యాపకంగా ఉండేది. ఆ కలయికకు నిర్దిష్ట లక్ష్యాలేమీ ఉండవు. ఆ కలయికలు ఒకటిరెండు పొడిమాటలతో ముగిసిపోవు. ముందే అన్నట్టుగా మానవ అనుబంధాలు మానవీయ రూపంలోనే ఉండేవి. 

కాలగమనంలో బంధాలు రూపు మారుతూ వచ్చాయి. ఒకప్పట్లో ఎగువ మధ్యతరగతి వారికి కూడా దుర్లభంగా, భారంగా అనిపించిన టెలిఫోన్లు ముమ్మరంగా మారుతూ వచ్చిన రోజుల్లో పక్క ఊరితో మాట్లాడాలంటే.. ప్రతి సంభాషణకు ‘ట్రంక్ కాల్’ బుక్ చేయడం, టెలిఫోను ఎక్స్ఛేంజి నుంచి ఆ కాల్ ఎప్పుడు ‘కనెక్ట్’ చేస్తారా అని ఫోను పక్కనే కూర్చుని నిరీక్షించడం.. తక్షణం మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు ‘లైటెనింగ్ కాల్’ బుక్ చేయడం వంటి పరిణామాలు చూసి అంతకు ముందు తరం వాళ్లు బుగ్గలు నొక్కుకుని ఉంటారు. 

కాలినడకన పదుల కిలోమీటర్ల దూరాలు నిత్యం తిరిగేస్తూ.. ఖాళీ ఉన్న రోజుల్లో ఇరుగు పొరుగు గ్రామాల్లోని పరిచయస్తులందరినీ పలకరించడానికి వెళుతూ, వారి ఇళ్లలోనే ఒకటిరెండు రోజులు గడుపుతూ వచ్చిన వారికి.. ఉత్తరాలు రాసుకుని కేవలం అవి అందినప్పుడు మాత్రమే ఆప్తుల కుశల సమాచారాలు  తెలుసుకోవడం అలవాటైన వారిని ‘టెలిఫోను యుగం’ దిగ్భ్రమకు గురిచేసి ఉండొచ్చు. ఇవాళ్టి రోజుల్లోకి వస్తే.. ట్రంక్ కాల్, ఎస్టీడీ, లైటెనింగ్ కాల్ వంటి పదాలు కేవలం నిఘంటువులకే పరిమితమై, జనవ్యవహారంలోంచి పూర్తిగా కనుమరుగు అయిపోయాయి.

టెలిఫోను నుంచి మొబైల్ ఫోనుకి అప్ డేట్ కావడానికి వర్తమాన సమజానికి కొంత వ్యవధి తీసుకున్నదేమో గానీ.. మొబైల్ ఫోను రంగప్రవేశం తరువాత.. కమ్యూనికేషన్ యుగంలో ఇప్పటిదాకా వస్తున్న మార్పులన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. మానవ సంబంధాలన్నీ డిజిటల్ అందాలను సంతరించుకుంటున్నాయి. 

సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. మన జీవితాలను ఎంతగా టెక్నాలజీ కబళించేస్తున్నప్పటికీ.. మనలో మానవ సంబంధాల పట్ల విముఖత రాలేదు. ‘సమూహంలో ఒంటరిగా బతకడం’ అనేది ఆధునిక జీవన వేదం అవుతున్న మాట నిజమే.. కానీ, ‘ఒంటరిగా ఉంటూనే సమూహంలో జీవించడం’ కూడా సాంకేతికత ద్వారా సాధ్యమవుతున్నది. లేకపోతే.. మెటా అనే సంస్థ ‘థ్రెడ్స్’ అనే ఇన్‌స్టా అనుబంధ సోషల్ మీడియా యాప్ ను ఆవిష్కరించిన వెంటనే కేవలం ఒక్కరోజు వ్యవధిలో కోటికి మించిన డౌన్‌లోడ్ లు జరిగేవే కాదు.

మెటా సంస్థ ‘థ్రెడ్స్’ ద్వారా పోటీదారుగా టార్గెట్ చేస్తున్న ట్విట్టర్ 180 కోట్లకు పైగా డౌన్లోడ్ లతో సేవలందిస్తోంది. ఈ థ్రెడ్స్ కు అనుబంధంగా, మాతృసంస్థ లాగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్ గణాంకాలు కూడా 180 కోట్లపైనే ఉన్నాయి. సదరు 180 కోట్ల పైచిలుకు వినియోగదారుల మైలురాయిని చేరుకోవడానికి ఆ రెండు సంస్థలకు అవసరమైనంత సుదూర వ్యవధి ‘థ్రెడ్స్’కు అవసరం కాకపోవచ్చు. ఒక్కరోజులో దక్కిన కోటి ఆదరణే అందుకు నిదర్శనం. 

సోషల్ మీడియా వేదికలు ఎన్ని రకాలుగా వెర్రి తలలు వేస్తున్నాయి, ఎంతగా సమాజాన్ని నాశనం చేస్తున్నాయనే సంగతి మనకు చాలా రకాలుగా అర్థమవుతూనే ఉంది. సోషల్ మీడియా ఊబిలో చిక్కుకుని జీవితాలను ఛిద్రం చేసేసుకుంటున్న వారు మనకు ఎందరో కనిపిస్తూ ఉంటారు. కాకపోతే.. చాలా ప్రధానమైనదే అయినప్పటికీ.. ఈ సందర్భంలో ఆ చర్చ జోలికి వెళ్లకపోతే గనుక.. సోషల్ మీడియా వేదికల ద్వారా.. మానవ సంబంధాలను కొనసాగించే ముచ్చట ప్రజల్లో చచ్చిపోలేదని, ఇలాంటి ఎన్ని సరికొత్త  యాప్ లు వచ్చినా సరే వాటిని ఆదరిస్తూనే ఉంటారని మనకు అర్థమవుతోంది. 

ఆ పరిణామానికి మనం సంతోషించాలి. ముందే చెప్పుకున్నట్టు- ‘సమూహంలో ఒంటరిగా బతికే’ తత్వాన్ని మనం దాటుకుని వచ్చాం. ఆ జాడలు పూర్తిగా లేవని కాదు. కానీ,  మనిషి ఒంటరిగా ఉన్నా సరే.. సమూహంగా జీవించడం కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫారం వేదికల ద్వారా సాధ్యమవుతోంది. దీనిని ఎంతగా మానవ అనుబంధాల కోసం వాడుకుంటున్నాం.. ఎంతగా పెడపోకడల ఊబిలో చిక్కుకుపోతున్నాం అనేది వ్యక్తిగత స్థాయిని బట్టి ఉంటుంది. సోషల్ మీడియా విశృంఖలంగా వస్తుండగా.. దాని పెడపోకడల సమాచారాలే మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అసహజమైన, వంచనలతో కూడిన ప్రేమల బంధాలలో చిక్కుకుంటున్న వారు, ధన మాన ప్రాణాలను వాటికి బలిచేస్తున్న వారు అనేకులు మనకు కనిపిస్తారు. ఇవన్నీ కూడా.. అజాగ్రత్తల కారణంగా వాటిల్లే దుష్పరిణామాలు.

స్మార్ట్ ఫోను మరియు నిరంతరాయ డేటా అనేది దిగువ మధ్యతరగతి వారికి కూడా చాలా చవకగా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. సరైన అవగాహన లేని, ఉండని వారందరూ కూడా ఈ సోషల్ మీడియా యాప్ లను వాడుతున్నారు. కేవలం అవగాహన లేని వారు మాత్రమే కాదు.. ఎంతో చదువుకున్న వారు, టెక్ జ్ఞానులు కూడా ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. బలహీన క్షణాలలో స్వీయ నియంత్రణను వారు కోల్పోతున్నారు. నియంత్రణ పోగానే.. బానిస అవుతున్నారు. ఫేస్ బుక్, వాట్సప్ వంటి ప్రజాదరణ ఉన్న వేదికలు- బంధాలలో నిత్యత్వం తీసుకురావడానికి అనువుగానే ఉంటాయి. అయితే వాటిని వినియోగించడంలో వెర్రితలలు వేస్తుండడం అనేది వ్యక్తుల తప్పిదమే తప్ప, ఆ వేదికకు, సాంకేతికతకు ఆపాదించదగిన నేరం కానే కాదు. 

అద్వైత వేదాంతానికి సంబంధించిన పురాతన గ్రంథం ‘యోగవాసిష్ఠము’ వాల్మీకి రాసినది. ఈ గ్రంథం మొత్తం వశిష్టుడికి రాముడికి మధ్య సంభాషణ లాగా సాగుతుంటుంది. అందులో వశిష్టుడు, రామచంద్రుడిని ఉద్దేశించి ఇలా అంటాడు.. 

తవ నావహితం చిత్తం కామః కవలయిష్యతి

సావధానస్య బుద్ధస్య పిశాచః కిం కరిష్యతి

‘అజాగ్రత్తగా ఉన్నట్లయితే నీ మనస్సును కామము (కోరిక) మింగివేయగలదు. జాగ్రత్తగా ఉన్నవాని మనస్సును కామము ఏం చేయగలదు? ఏమి చేయడమూ దానికి సాధ్యం కాదు.. అని ఈ శ్లోక భావం.

వెర్రితలలు వేస్తున్న సోషల్ మీడియా పోకడలను గమనించినప్పుడు ఈ శ్లోకాన్ని తాత్పర్యసహితంగా స్మరణలో ఉంచుకోవడం చాలా అవసరం అని మనకు బోధపడుతుంది. 

మన జీవితాలు అనివార్యంగా డిజిటల్ యుగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇందులో మన ప్రమేయం ఎంత మాత్రమూ లేదు. మనతో నిమిత్తం లేకుండానే.. డిజిటల్ సాంకేతికతల విప్లవ ప్రవాహం మనల్ని నెట్టుకుంటూ ముందుకు తోసుకువెళుతున్నది. మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే.. ఈ సోషల్ వేదికలన్నీ మానవ అనుబంధాలను మరింతగా పరిమళింపజేసే అద్భుత అవకాశాలు అవుతాయి. 

ఈ సోషల్ మీడియా వేదికల్లో ఎన్ని వెర్రి మొర్రి అవకాశాలు ఉన్నప్పటికీ.. వాటి ప్రభావం మనని అంటదు. అదే సమయంలో.. మనం అజాగ్రత్తగా ఉన్నట్లయితే.. అవి చేయగల చేటు పట్ల మనకు స్పృహ లేకపోయినట్లయితే.. కేవలం మానవ సంబంధాలను మాత్రమే కాదు.. మన జీవితాలనే అవి తప్పకుండా కబళించేస్తాయి. ఆ ఎరికతో వాటిని అలవాటు చేసుకోవడం అవసరం. 

మనం- డిజిటల్ సాంకేతికత మరింత విశ్వరూపం దాల్చగల భవిష్యత్తును ఆమోదించాల్సిన సంధియుగంలో ఉన్నాం. ఈ విప్లవం అక్కడక్కడా దుష్పరిణామాలు చూపిస్తున్నంత మాత్రాన దానిని ద్వేషించడం తగదు. అనివార్య పరిస్థితుల్లో మంచిని మాత్రం స్వీకరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. 

మరో ప్రపంచం మరో ప్రపంచం

మరో ప్రపంచం పిలిచింది..

పదండి ముందుకు పదండి త్రోసుకు..

పోదాం పోదాం.. .. … .. .. 

ఆ ఖాళీని చిత్త మొచ్చినట్టుగా మన మన భావజాలాలను బట్టి పూరించుకోవచ్చు. నరకంలోకి వెళ్తామా, స్వర్గంలోకి వెళ్తామా? పైపైకి వెళ్తామా? అథోలోకాలను చేరుకుంటామా? అనేది తర్వాతి సంగతి! కానీ, మరో ప్రపంచంలోకి మనం అడుగుపెట్టేస్తున్న మాట మాత్రం వాస్తవం.. అది ఎలాంటి ప్రపంచం అనేది.. కొంతమేర ముందుగానే నిర్ణయం అయి ఉంటుందిగానీ.. టెక్ విధాతల రాతను, పునర్నిర్దేశించి దిద్దుకోవడం మన చేతిలో లేకుండా పోయేంతటి గొప్ప సంగతి కాదు.

.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె

[email protected]