ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలలో రేగిన అసంతృప్తిని కూడా జగన్ ప్రభుత్వం సద్దుమణిగేలా చేసింది. ఉద్యోగులకు ప్రీతికరమైన అనేక నిర్ణయాలను తీసుకుంది. అయితే ఇంకా ఒక్క వర్గంలో మాత్రం జగన్ సర్కారు పట్ల విపరీతమైన నిరసన, వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉన్నాయి. వాళ్లే సిపిఎస్ ఉద్యోగులు!
కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దుచేసి ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం ఒనగూరే లాగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీం తీసుకువస్తాం అని జగన్ సర్కారు చేసిన ప్రకటన పట్ల వారిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందుకే జిపిఎస్ లాంటి కొత్త పథకాలు ఏమీ వద్దని సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలులోకి తీసుకురావడం ఒక్కటే తమ సమస్యకు పరిష్కారం అని ఉద్యోగులు ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ వర్గంలో ఉన్న భయాలను పెంచి తమకు రాజకీయ లాభంగా మార్చుకోవడానికి జనసేన పార్టీ వంచనకు తెగబడుతోంది.
సిపిఎస్ రద్దు కోరుతూ ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల ఎదుట రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు శనివారం నాడు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరులో జరిగిన నిరసన, ధర్నా కార్యక్రమంలో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ‘అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని’ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వం తక్షణమే అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అయితే జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపించిన నాదెండ్ల మనోహర్- తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ సమస్యపై ఏం చేస్తుంది? అనే సంగతి మాత్రం వెల్లడించలేదు.
అంటే జనసేన అధికారంలోకి వచ్చినట్లయితే సిపిఎస్ విషయంలో వారి వ్యవహారం ఏమిటి.. అనేది నాదెండ్ల వెల్లడించలేదు. సిపిఎస్ ఉద్యోగుల సమస్య పట్ల నిజంగానే జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు, నాదెండ్ల మనోహర్ కు చిత్తశుద్ధి ఉన్నట్లయితే తమ పార్టీ తెలుగుదేశంతో పొత్తులలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారంలోకి వచ్చినాసరే కచ్చితంగా సిపిఎస్ రద్దు చేసి తీరుతామనే ప్రకటన చేయగలగాలి! ‘‘మా పార్టీకి పూర్తిస్థాయి అధికారం ఇవ్వలేదు’’ అనే మడత పేచీలు పెట్టకుండా తెలుగుదేశంతో కలిసి అధికారాన్ని పంచుకున్నా సరే, మాట నిలబెట్టుకునే ధోరణి ఉండాలి.
పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు మాట ఇస్తే.. ‘‘చంద్రబాబు ప్రభుత్వం దానిని నిర్ణీత గడువులోగా నెరవేరిస్తే తప్ప ఆ సంకీర్ణ ప్రభుత్వంలో తాము కొనసాగబోము’’ అని స్పష్టంగా తేల్చి చెప్పాలి! అలా చెప్పినప్పుడు మాత్రమే జనసేన చిత్తశుద్ధిని సిపిఎస్ ఉద్యోగులు నమ్మగలుగుతారు. ఏదో నలుగురు ఉద్యోగులు రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారు కదా, కాసేపు వారి పక్కన నిలబడి ఫోటోలు దిగితే తమకు కూడా రాజకీయ మైలేజీ వస్తుందనుకొని నాటకాలు ఆడితే ఉద్యోగులు ఛీకొడతారు.. జనసేన వంచన బుద్ధులను గుర్తిస్తే అసహ్యించుకుంటారు అని వారు తెలుసుకోవాలి!!