విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందంటూ సీఎం వైఎస్ జగన్ మొదలుకుని, మంత్రులు, ఎమ్మెల్యేలు పదేపదే చెబుతున్నారు. వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మరోసారి రాజధానిపై మాట్లాడారు. త్వరలో విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని వైవీ స్పష్టం చేశారు. ఇంతకూ త్వరలో అంటే…ఎంత సమయం అని ఉత్తరాంధ్ర వాసులు ప్రశ్నిస్తున్నారు.
రాజధాని వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో వుంది. దానిపై ఇంకా విచారణే మొదలుకాలేదు. అలాంటప్పుడు విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని త్వరలో వస్తుందని చెప్పి, ఉత్తరాంధ్రలో ఆశలు రేకెత్తించి, చివరికి తీసుకెళ్లకపోతే రాజకీయంగా నష్టం ఎవరికో ఆలోచిస్తున్నారా? వైసీపీ పెద్దల మాటలు చూస్తుంటే ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని పేరుతో రాజకీయంగా ప్రయోజనం పొందవచ్చని వైసీపీ భావిస్తోంది.
ఇదే సందర్భంలో ప్రమాదాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం వుంది. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకురాకపోతే ఉత్తరాంధ్ర దృష్టలో విలన్ అవుతారని గ్రహించాలి. సుప్రీంకోర్టులో వివాదం నడుస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకో మరి త్వరలో ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని నమ్మబలుకుతున్నారు.
ఇదిగో, అదిగో అని నాలుగేళ్లుగా ఆశ పెడుతున్నారు. రాజధాని విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. అలాంటప్పుడు రాజధాని తేనెతుట్టెను కదపాల్సిన అవసరం ఉందా? అనేది ప్రశ్న. ప్రస్తుతం ఆచరణ సాధ్యం కాని అంశాల గురించి మాట్లాడ్డం రాజకీయంగా ఎంత వరకు సరైందో వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.