సంగీత దర్శకుడు థమన్ మీద సోషల్ మీడియాలో సినిమా ఫ్యాన్స్ అసంతృప్తి మళ్లీ మొదలైంది. కొంత మంది తిట్లు, మరి కొంత మంది సెటైర్లు, ఇంకొంత మంది డిమాండ్లు, మొత్తం మీద థమన్ మీద అసంతృప్తి బాగా కనిపిస్తోంది. ఇదంతా పవన్ కళ్యాణ్ సినిమా బ్రో నుంచి వచ్చిన పాట వల్లే. పవన్ ఫ్యాన్స్ అయితే నీరసం అయిపోయారు. బ్రో నుంచి వచ్చే పాట మీద పవన్ ఫ్యాన్స్ బాగా అంచనాలు పెట్టుకున్నారు. పైగా అలవైకుంఠపురములో తరువాత థమన్-త్రివిక్రమ్ కాంబినేషన్ పాట ఇది.
ఈ సినిమాకు దర్శకుడు సముద్రఖని అయినా, కర్త, కర్మ, క్రియ త్రివిక్రమ్ నే. స్క్రిప్ట్, మాటలు తయారు చేసింది ఆయనే. మార్పులు చేర్పులు చేసింది ఆయనే. పైగా ‘కజరారే..కజరారే’ అనే టైపులో అభిషేక్-అమితాబ్ సాంగ్ లా అదిరిపోవాలని ఈ పాటను ప్లాన్ చేసారు. పబ్ సాంగ్ ఇది. అందుకే ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురు చూసారు. నిర్మాతలు కూడా ఈ పాట సినిమా బజ్ కు బాగా ఉపయోగపడుతుందని నమ్మారు.
సినిమాను ఇప్పటికే ఆంధ్ర 40 కోట్ల రేషియో అమ్మారు. నైజాం 35 కోట్ల మేరకు అమ్మాలని చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో వచ్చిన పాట పూర్తిగా డిస్సపాయింట్ చేసింది అన్నది వాస్తవం. థమన్ ఇచ్చిన ట్యూన్ ఏమాత్రం క్యాచీగా లేదు. పైగా దానికి తొడు విజువల్స్ కూడా గొప్పగా లేవు. పవన్ సంగతి పక్కన పెడితే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ మూవ్ మెంట్స్ కూడా చూపించిన మేరు బావున్నాయి గా అనే రేంజ్ కు లేవు.
దీంతో అసలే తమ హీరో సినిమాకు థమన్ వద్దు అంటున్న మహేష్ ఫ్యాన్స్ మరోసారి మెగా ఫ్యాన్స్ తో గొంతు కలిపారు. మిగిలిన మాంటేజ్ సాంగ్ కూడా బయటకు రావాల్సి వుంది.