రీ యాక్టివ్ అంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పొలిటికల్ గా స్పీడ్ అవుతున్నారు. గంటా కాదేదీ విమర్శలకు అతీతం అన్నట్లుగా మీడియా ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మీద ఆయన చాలానే కామెంట్స్ చేస్తున్నారు.
అలాంటి గంటాకు వైసీపీ ప్రభుత్వం ఒక చాన్స్ ఇచ్చింది. విశాఖలోని రుషికొండ బీచ్ కి వెళ్ళేందుకు ఎంట్రీ ఫీజ్ కింద మనిషికి ఇరవై రూపాయలు వసూల్ చేయాలని తీసుకున్న నిర్ణయం వివాదం అవుతోంది. బీచ్ ని చూడడానికి ఎంట్రీ ఫీజ్ ఏంటి అని జనాలు సహజంగానే అనుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో గంటా వాయిస్ సవరించారు. బీచ్ కూడా ఉచితం కాదా అంటూ ట్విట్టర్ ద్వారా ఆయన వైసీపీ మీద విరుచుకుపడ్డారు. విశాఖలో తాకట్టు పెట్టాలనుకున్నవన్నీ పెట్టేశారు. అమ్మివేయాలనుకున్నవన్నీ అమ్మేశారు. కూల్చాలనుకున్నవి కూల్చేశారు. వేయాలనుకున్న పన్నులన్నీ వేసేశారు. ఇప్పుడేమో బీచ్ ల వద్ద పార్కింగ్ ఫీజులు, ఎంట్రీ ఫీజులు అని ట్వీట్ చేశారు.
అందమైన బీచ్ లు ఉన్న విశాఖలో జనాలకు సేద తీరేందుకు అవకాశం ఇవ్వరా. బూ ఫాగ్ గా గుర్తింపు పొంది అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రుషికొండ బీచ్ లో కూర్చోవడానికి ఎంట్రీ ఫీజా అంటూ గంటా అంటున్నారు. ఇది ప్రకృతి ప్రేమికులకు పర్యాటలకు అసహనం రేకెత్తించే విషయం అని ఫైర్ అవుతున్నారు.
రుషికొండ బీచ్ కి ఎంట్రీ ఫీజ్ పెట్టడం మీద విశాఖలో జనాల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. అది రాజకీయ కాక పుట్టించేలా ఉందని గంటా వ్యాఖ్యలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఎంట్రీ ఫీజ్ ని రద్దు చేసుకుంటే మంచిదనే అంటున్నారు. లేకపోతే ఇది పెద్ద రచ్చగా అయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు.