ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ కొత్త పాట ఎత్తుకున్నారు. ‘పొత్తుల గురించి ఆలోచించడానికి ఇంకా చాలా సమయం ఉన్నదని’ ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేక ఓటు ఇసుమంతైనా చీలడానికి వీలు లేదని.. అందుకోసం విపక్షాలు అన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉన్నదని.. చాలాకాలంగా పదేపదే చెబుతూ వస్తున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మాట మార్చారు. పొత్తుల గురించి ఆలోచించడానికి సమయం కాదు.. ఒంటరిగా వెళ్లాలా కలిసి వెళ్లాలా అనేది తర్వాత మాట్లాడే విషయం అంటున్నారు!
తెలుగుదేశంతో కలిసి జగన్మోహన్ రెడ్డి హవాను ఎదుర్కోవడంపై పవన్ కళ్యాణ్ హఠాత్తుగా మాట మార్చడం రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తున్నది. ఇవాళ వారాహి రెండో విడత యాత్రకు సంబంధించి కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పవన్ ఇలాంటి మాటలు మాట్లాడడం వెనుక కాపు కులం ఒత్తిడి తీవ్రంగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే తమ పార్టీకి ఎక్కువ సీట్లు దక్కుతాయని, నెగ్గుతామని పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లుగా ఆశపడుతూ వచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు పల్లకి మోయడానికి ఎగబడ్డారు. గత నెలలో గోదావరి జిల్లాలో వారాహి యాత్ర నిర్వహించిన తర్వాత జనసేన పార్టీ నాయకుల ఆత్మవిశ్వాసంలో తేడా వచ్చింది.
పవన్ కళ్యాణ్ సభలకు జనం వెల్లువలా వస్తున్నారని.. ఇలాంటి సమయంలో పొత్తులు పెట్టుకోవడం జనసేనకు ఆత్మహత్యా సదృశం అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పొత్తులు లేకుండా పోటీ చేసినా కూడా.. కేవలం ఉభయగోదావరి జిల్లాలు, కాపు కులం ప్రాబల్యం అధికంగా ఉన్న రాష్ట్రంలోని మరికొన్ని నియోజకవర్గాల మీద శ్రద్ధ పెడితే చాలు.. తమ పార్టీకి 30 నుంచి 40 సీట్లు దొరుకుతాయని జనసేన నాయకులు ఉత్సాహ పడుతున్నారు.
పొత్తులు పెట్టుకుని తెలుగుదేశంతో సీట్లు బతిమిలాడి ఇప్పించుకునే దానికంటే.. ఒంటరిగా పోటీచేసి ఆ మాత్రం సీట్లు సంపాదిస్తే గనుక.. సంకీర్ణ ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి తమ పార్టీ ఎదుగుతుందని వారి కోరిక. ఒకసారి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే ఇక జీవిత పర్యంతం మర్రిచెట్టు నీడలో ఉన్నట్లుగా ఎదుగు బొదుగు లేకుండా జనసేన పరిస్థితి తయారవుతుందనేది వారి అంచనా.
అందుకే పొత్తుల విషయంలో పునరాలోచించాలని పార్టీ, కాపు కుల నాయకులు చాలా మంది పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. ఆ ఒత్తిడి భరించలేకనే ఆయన ‘‘కలిసి వెళ్లాలా, ఒంటరిగా వెళ్లాలా అనేది తర్వాత ఆలోచిద్దాం’’ అంటూ మధ్యేమార్గంగా రోజులు నెట్టుకు వస్తున్నారని పరిశీలపై విశ్లేషిస్తున్నారు.