రోజా మాట‌ల‌కు అర్థాలే వేరులే!

చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట‌ల‌కు అర్థాలే వేరు. నిజానికి రోజా మీడియాతో మాట్లాడే అంశాల‌కు పూర్తి విరుద్ధంగా, స‌న్నిహితుల వ‌ద్ద చెప్పే అంశాలున్నాయ‌నేది ప్ర‌చారం. మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న రోజాలో…

చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట‌ల‌కు అర్థాలే వేరు. నిజానికి రోజా మీడియాతో మాట్లాడే అంశాల‌కు పూర్తి విరుద్ధంగా, స‌న్నిహితుల వ‌ద్ద చెప్పే అంశాలున్నాయ‌నేది ప్ర‌చారం. మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న రోజాలో ఆనందం తొణిక‌స‌లాడుతోంది. మంత్రి ప‌ద‌వి ద‌క్కిన మొద‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ ఆమె ముఖంలో న‌వ్వు చెద‌ర‌లేదు. పైగా మంత్రి ప‌ద‌వి ఆమెలో మునుపెన్న‌డూ లేనంత‌గా ఆత్మ‌విశ్వాసాన్ని పెంచింది. సొంత పార్టీలో కొంత మంది “పెద్ద” నాయ‌కుల అణ‌చివేత ధోర‌ణిపై స‌న్నిహితుల వ‌ద్ద చెప్పుకుని రోజా విల‌పించార‌ని స‌మాచారం.

సామాజిక స‌మీక‌ర‌ణాల రీత్యా రోజాకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌ద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగింది. అయితే అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కింద‌లు చేస్తూ… ఎట్ట‌కేల‌కు అమాత్య ప‌ద‌వి ద‌క్కించుకుని శ‌భాష్ అనిపించుకున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వి ద‌క్కిన త‌ర్వాత మొద‌టిసారి ఆమె న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రోజా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు సొంత పార్టీలోని త‌న వ్య‌తిరేకుల‌నుద్దేశించి అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కూ రోజా ఏమ‌న్నారంటే…

“నిన్న‌టి వ‌ర‌కూ ఇక రోజాకు సీటు రాద‌న్నారు. నా ప‌ని అయిపోయింద‌ని ఎగ‌తాళి చేశారు. అలాంటి వాళ్ల నోళ్లు మూయించేలా న‌గ‌రి నుంచి న‌న్ను రెండుసార్లు ఎన్నుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక లెక్క‌. ఇక‌పై ఇంకో లెక్క‌. నా స‌త్తా ఏంటో చూపిస్తా” అని రోజా ఎంతో జోష్‌తో చెప్పారు.

ప్ర‌త్య‌ర్థుల‌నుద్దేశించి మాత్రం రోజా ఈ హెచ్చ‌రిక‌లు చేయ‌లేద‌ని సొంత పార్టీ శ్రేణులు చెబుతున్న మాట‌. అమాత్య ప‌ద‌వి దక్కించుకోవ‌డ‌మ‌నేది … సొంత పార్టీలోని త‌న బ‌ల‌మైన వ్య‌తిరేకుల‌పై సాధించిన విజ‌యంగా రోజా భావిస్తున్నార‌ని స‌మాచారం. ఆ ఆనందం రోజాలో దూకుడు పెంచింది. 

పార్టీలోని “పెద్ద‌పెద్ద” వాళ్ల కంటే తానేమీ త‌క్కువ కాద‌ని రోజా చెప్ప‌క‌నే చెప్పార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే ఇక‌పై మంత్రి రోజాగా త‌న స‌త్తా ఏంటో చూపుతాన‌ని ఆమె స్వీట్ వార్నింగ్ ఇచ్చార‌ని ఆమె అనుచ‌రులు చెబుతున్నారు. ఇక మీదట త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు తెలియ‌కుండా మంత్రులెవ‌రైనా జోక్యం చేసుకుంటే, తాను కూడా అదే ప‌ని చేస్తాన‌ని ప‌రోక్షంగా ఆమె సంకేతాలు ఇచ్చారు. 

మంత్రి ప‌ద‌వి రోజాలో ఎంతో మార్పు తీసుకొచ్చింద‌నేది వాస్త‌వం. ముఖ్యంగా సొంత పార్టీలోని త‌న వ్య‌తిరేకుల‌ను ఎదుర్కొనేందుకు ఆమె రెట్టించిన ఉత్సాహంతో త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యారనేది వాస్త‌వం.