“అన్నింటికీ చంద్రబాబే కారణం. రాష్ట్రం అధోగతి పాలవ్వడానికి అతడి నిర్ణయాలే ప్రధాన కారణం. చంద్రబాబు చేసిన అరాచకం ఇదంతా. చంద్రబాబు చేసిన తప్పులకు ఏపీ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు.” ఏ వైసీపీ నేతను కదిలించినా కామన్ గా వినిపించే డైలాగ్స్ ఇవి. అందులో తప్పులేదు కూడా. సగం అవ్యవస్థకు చంద్రబాబే కారణం. అది నిజం. కానీ ఎన్నాళ్లిలా? ఇంకెన్నేళ్లు ఇలా చంద్రబాబును బూచిగా చూపించి తప్పించుకుంటారు? అవ్యవస్థకు కారణం చంద్రబాబే.. మరి ఈ మూడేళ్లలో దాన్ని సరిదిద్దే ప్రయత్నం ప్రభుత్వం చేసిందా? చేస్తే ఏం చేసింది?
ఈమధ్య కొత్తగా కేబినెట్ లోకి కొందరు మంత్రులొచ్చారు. వాళ్లకు శాఖలు కూడా కేటాయించారు. తొలిసారి మంత్రుల స్థాయిలో మీడియా ముందుకొచ్చిన వాళ్లంతా చెప్పిన కామన్ డైలాగ్, “చంద్రబాబు రాష్ట్రాన్ని నాశనం చేశారు”. అందరూ చంద్రబాబుని విమర్శించేవాళ్లే తప్ప, ఈ మూడేళ్లలో ఏం చేశారో ఎవ్వరూ చెప్పడం లేదు. పోయినోళ్లు చెప్పలేదు, కొత్తగా వచ్చిన మంత్రులు చెప్పడం లేదు.
ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టునే తీసుకుందాం. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తిచేస్తామని అప్పటి మంత్రి అనీల్ కుమార్ ప్రకటించారు. పనిలోపనిగా మైక్ పుచ్చుకున్న ప్రతిసారి చంద్రబాబును ఆడిపోసుకున్నారు. ఆయన తర్వాత ఇప్పుడు కొత్తగా అంబటి రాంబాబు ఆ పదవిలోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే ఈయన కూడా చంద్రబాబును విమర్శించే పని పెట్టుకున్నారు.
అంబటి అలా రొటీన్ గా బాబును విమర్శించే బదులు, పోలవరం ప్రాజెక్టు ఎంత వరకు వచ్చింది, కొత్త డెడ్ లైన్ ఏంటి, ఈ మూడేళ్లలో చేసిన పనులేంటి లాంటి విషయాల్ని చెబితే బాగుండేది. అవేం ఆయన చెప్పలేదు. డయాఫ్రం వాల్ కొట్టుకుకోవడానికి చంద్రబాబు కారణం అన్నారు. మళ్లీ కట్టాలంటే వందల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అది నిజమే. అలాంటప్పుడు దాని నిర్మాణం, రీడిజైనింగ్ గురించైనా చెప్పాలి కదా.
మొన్నటికిమొన్న విద్యుత్ కోతలపై కూడా ఇదే ప్రాపగాండ నడిచింది. ఉన్నట్టుండి డిమాండ్ పెరిగి, సప్లయ్ తగ్గితే చంద్రబాబు చేసిన తప్పు అన్నారు. ఆ తర్వాత అధికారులు తాపీగా లైన్లోకొచ్చి, అసలు సమస్య ఏంటనేది చెప్పారు. ఇప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ కోతలున్నాయి. మరోవైపు పవర్ హాలిడేలు నడుస్తున్నాయి. రోజురోజుకు లోటు పెరుగుతోంది. బయట నుంచి కొనుక్కొచ్చే 30 మిలియన్ యూనిట్లు ఏమాత్రం సరిపోవడం లేదు. మే మొదటి వారం నుంచి విద్యుత్ సమస్యలు తీరుస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఇంకెన్నాళ్లు.. ఏదో ఒకటి చెప్పాల్సిందే..
సంక్షేమ పథకాల విషయంలో జగన్ సర్కారును మించిన ప్రభుత్వం ఇంకోటి లేదు. ఎన్నికల టైమ్ లో నవరత్నాల్ని ఘనంగా చెప్పుకోవచ్చు. సంక్షేమ రంగంలో సాధించింది చాలానే ఉంది. అదే టైమ్ లో మౌలిక సదుపాయలైన రోడ్లు గురించి కూడా గొప్పగా చెప్పుకునే స్థాయికి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. మరి ఇలా గొప్పగా చెప్పుకునే అంశాల్లోకి పోలవరం ఎప్పుడు చేరుకుంది? 24 గంటలు విద్యుత్ ఇచ్చాం అని ఎన్నికల ప్రచారంలో చెప్పుకునే రేంజ్ కు జగన్ సర్కార్ ఎప్పుడు చేరుకుంటుంది?
వైసీపీ సర్కారు వచ్చి మూడేళ్లయింది. మరో రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. విద్యుత్ సమస్యలు, పోలవరం ప్రాజెక్టు లాంటి కీలక అంశాలపై స్పష్టంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతా చంద్రబాబే చేశారంటూ మరోసారి ఎన్నికలకు వెళ్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. తమ టర్మ్ లో ఏం చేశారో చెప్పాల్సిందే.