ఏది అసలైన పాన్ ఇండియన్ సినిమా?

పాన్ ఇండియా సినిమా అనేది సినీ హీరోలకి, దర్శకులకి ఇప్పుడొక స్టాటస్ సింబల్ గా మారిపోయింది.  Advertisement అసలు పాన్ ఇండియన్ సినిమా అంటే ఏంటి?  ఒక భాషలో తీసి, ఇతర భాషల్లోకి డబ్బింగ్…

పాన్ ఇండియా సినిమా అనేది సినీ హీరోలకి, దర్శకులకి ఇప్పుడొక స్టాటస్ సింబల్ గా మారిపోయింది. 

అసలు పాన్ ఇండియన్ సినిమా అంటే ఏంటి? 

ఒక భాషలో తీసి, ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేస్తే పాన్ ఇండియా సినిమా అయిపోతుందా? 

ఒక ప్రాంతీయతున్న కథని జాతీయ స్థాయిలో ప్రేక్షకులకి అందజేస్తే పాన్ ఇండియా అనొచ్చా? 

భాషకొక నటుడినో, నటినో పెట్టుకుని పాన్ ఇండియా అని ప్రొమోట్ చేసుకోవచ్చా? 

నిజానికి ఎవరు ఏదైనా చేసుకోవచ్చు..ఎలాగైనా పిలుచుకోవచ్చు. కానీ నిజమైన పాన్ ఇండియా అంటే, దేశంలో ఏ భాషలోనూ గతంలో చూడని, ఎరుగని కొత్త అనుభూతిని దేశవ్యాప్తంగా కలుగజేసినప్పుడే పాన్ ఇండియా సినిమా అనిపించుకుంటుంది. ఆ అనుభూతి కథ ద్వారా కావొచ్చు, కథనం వల్ల అవ్వొచ్చు లేదా సాంకేతిక పరమైన అద్భుతాల వల్ల కావొచ్చు. 

ఇక్కడ ప్రాంతీయతతో కూడా సంబంధం లేదు. భావోద్వేగాలు గానీ, మానవసంబంధాలు గానీ గుండెల్ని తాకినప్పుడు సరిహద్దులకి అతీతంగా సినిమా వ్యాప్తి చెందుతుంది. 

ఈ లెక్కలో ముందుగా చెప్పుకోవలసింది “దంగల్”. ఉత్తరభారతంలో ఒక ప్రాంతానికి సంబంధించిన కథే అయినా అందరి మనసులకి హత్తుకున్న కథ ఇది. అందుకే పాన్ ఇండియా అనే కాకుండా చైనాలో కూడా ఘనంగా ఆడి పాన్ ఇంటర్నేషనల్ అనిపించుకుంది. “దంగల్” లో సాంకేతికపరమైన అద్భుతాలేమీ లేవు. హీరో తాలూకు శ్రమ, దర్శకుడి తాలూకూ సిన్సియారిటీ ప్రధానంగా కనిపిస్తాయి. ఏ అర్భాటం లేకపోయినా కథ-కథనం-నటన కుదిరి వరల్డ్ క్లాస్ సినిమా అనిపించుకుంది. 

ఇక వెంటనే చెప్పాల్సింది “బాహుబలి”. గతంలో దేశంలో ఎవ్వరూ అనుభూతి చెందని ఒక అద్భుతం ఈ సినిమా. మానవసంబంధాలు, భావోద్వేగాలతో పాటూ తెర మీద అద్భుతరసాన్ని చిలికించాడు రాజమౌళి. “కట్టప్పా నే బాహుబలికో క్యూన్ మారా?” అంటూ ప్రధాని నరేంద్రమోదీ కూడా ఒక సభలో ప్రస్తావనకు తేవడం ఆ సినిమాకి పాన్ ఇండియా స్టేటస్ ఏ స్థాయిలో వచ్చిందో తెలుపడానికి ఒక నిదర్శనం. ఇక బాహుబలికి ఎంచుకున్న ఆహార్యం కానీ, నేపథ్యం కానీ అటు చరిత్రకి, ఇటు ప్రాంతీయతకి లొంగకుండా అన్ని విధాలుగానూ దేశంలో ఏ మూలున్న వాడైనా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అది చాలా గొప్ప విషయం. అందుకే అంతలా ఆకట్టుకోగలిగింది. 

ఇక “పుష్ప” సంగతికొద్దాం. ఇది శేషాచలం అడవుల నేపథ్యంలో కథ. గతంలో ఎన్నడూ చూడని రగ్గెడ్ లుక్ హీరో, కంటికి కొత్తగా కనిపించే అడవి నేపథ్యం, అన్నిటికీ మించి దేశంలో అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న పాటలు, వాటిని విడుదల చేసిన టైమింగ్, వైరల్ అయిన విధానం మొదలైనవన్నీ కలిసి దీనికి పాన్ ఇండియా స్థాయిని కట్టబెట్టాయి. 

అలాగే “కెజిఎఫ్”. ఇది కోలార్ బంగారు గనుల నేపథ్యంలో కథ. కానీ ఇక్కడున్న ప్రత్యేకత స్క్రీన్ ప్లే ఫార్మాట్. గతంలో ఎప్పుడూ అనుభూతి చెందని కథనం ఈ సినిమాని ప్రత్యేకంగా నిలబెట్టింది. కొందరికి నచ్చకపోయినా చాలామందికి అద్భుతమనిపించిన ఎడిటింగ్, కొందరిని ఇబ్బంది పెట్టిన్నా చాలామందిని ఔరా అనిపించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చాయి. ఇక్కడ “కొందరు”, “అందరూ” అనే పదాలు ఎందుకు వాడాల్సొచ్చిందో కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది. 

ఏ సినిమాకైనా కథనం ముఖ్యం. ఇక పాన్ ఇండియా సినిమా తీయాలనుకుంటే ఇది మరీ ముఖ్యం. రొటీన్ ఫార్ములాగా తీస్తే కచ్చితంగా పాన్ ఇండియా అవ్వదు. 

ఉదాహరణకి “రాధే శ్యాం” తీసుకుందాం. ఈ స్థాయి కథలు, కథనాలు గతంలో చాలానే చూసేశాం. పామిస్ట్రీ పాన్ ఇండియా సబ్జెక్ట్ కదా అని దిగిపోతే సరిపోదు. గతంలో కనీ వినీ ఎరుగని ఎలిమెంట్స్ కచ్చితంగా సినిమాలో ఉండాలి. అవి లేవిందులో. అందుకే దెబ్బతింది కూడా. 

నిజానికి “ఆర్ ఆర్ ఆర్” సినిమా బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా అన్న గౌరవంతో, క్రేజుతో ఈ మాత్రం ఆడింది కానీ లేకపోతే అసలది పక్కా తెలుగు సినిమా మాత్రమే. అందులో పాన్ ఇండియా లక్షణాలే లేవు. సన్నివేశాలు గానీ, కథనం గానీ గతంలో చూడని అనుభూతైతే కలిగించవు. 

ఈ నేషనల్ వైడ్ సినిమాలు చూసి ప్రతి దర్శకుడూ పాన్ ఇండియా మంత్రం జపించేస్తున్నాడు. ఆఖరికి “ఖిలాడి” కూడా పాన్ ఇండియా అనుకుంటే ఇంకేం చెప్పగలం? అనవసరంగా సదరు హీరో పరువు తీయడం తప్ప ఇంకేం లేదు. 

ఇక్కడ చెప్పేదొక్కటే. 24 క్రాఫ్ట్స్ కి నెలవైన సినిమాలో కనీసం కొన్నైనా “న భూతో..” అన్నట్టుండాలి. దానికి ప్రచారం కలిసి రావాలి. అప్పుడే పాన్ ఇండియా అవుతుంది. మొదటిది దర్శకుడి పని. రెండోది నిర్మాతల పనితనం. ఆపైన అదృష్టం. 

– శ్రీనివాసమూర్తి